Bhu Bharathi | రైతులకు శుభవార్త.. పార్ట్- బీలోని 7 లక్షలు ఎకరాలకు పరిష్కారం
రాష్ట్రంలో ఇంతవరకు డాక్యుమెంట్లు లేని ఆబాదీ ఇల్లు అని పిలుచుకునే నివాసగృహాలకు డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

- అబాదీ ఇళ్లకు కూడా డాక్యుమెంట్లు
- త్వరలో భూభారతి టోల్‌ఫ్రీ నెంబర్
- గిరిజన ప్రాంత భూ సమస్యలపై కమిటీ
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Bhu Bharathi |
ములుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా పార్ట్ -బీ లో పెట్టిన 18 లక్షల ఎకరాలలో ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని, ఈ భూములకు ఈ భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్‌లో మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి భూభారతి పైలట్ ప్రాజెక్టును పొంగులేటి ప్రారంభించారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పుసాయ్ గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల కన్నీటిని తుడిచేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని తాము ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించి, ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సేవలు అందిస్తామని ఆయన చెప్పారు. రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారులే రైతుల వద్దకు వచ్చి వారి భూ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.
ఆబాదీ ఇళ్లకు కూడా డాక్యుమెంట్లు
రాష్ట్రంలో ఇంతవరకు డాక్యుమెంట్లు లేని ఆబాదీ ఇల్లు అని పిలుచుకునే నివాసగృహాలకు డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆరు గ్యారంటీల అమలులో ఆలస్యానికి కేసీఆర్ కారణమన్నారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితే అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. భూ భారతి సమస్యల పరిష్కారానికి గాను తమ కార్యాలయం, సీసీఎల్ఎ కార్యాలయాలను అనుసంధానించే టోల్‌ఫ్రీ నంబర్‌ను త్వరలో ప్రకటిస్తామన్నారు. గిరిజన, గిరిజనేతరులు ఉండే ప్రాంతంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కేంద్రప్రభుత్వ నిబంధనలకు లోబడి ఒక కమిటీని నియమిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
రైతుల బాధలు తీర్చేందుకే భూభారతి: మంత్రి సీతక్క
ధరణి పోర్టల్‌తో భూముల భద్రతపై ఆందోళనకు గురైన రైతుల బాధలు తీర్చేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతి చట్టం తెచ్చిందని మంత్రి సీతక్క అన్నారు. భూభారతితో రైతుకు అతని భూమిపై యాజమాన్య హక్కు దక్కనుందన్నారు.