ఏడు పెండింగ్ బిల్లులను ఆమోదించిన గవర్నర్‌.. పరిపాలనలో తొలగిన ఆటంకాలు

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులను తెలంగాణ గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన మూడు బిల్లులతో పాటు

ఏడు పెండింగ్ బిల్లులను ఆమోదించిన గవర్నర్‌.. పరిపాలనలో తొలగిన ఆటంకాలు

ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం
మున్సిపల్ చట్ట సవరణ బిల్లుతో ఇక నాలుగేళ్లకు అవిశ్వాసం
పెరిగిన కోఆప్షన్ సభ్యుల సంఖ్య
నాలుగు టిమ్స్‌ల ఏర్పాటుకు ఆమోదం
మున్సిపాల్టీకి ములుగు
మైనార్టీ కమిషన్‌లో జైన్‌లకు చోటు
మూడు పంచాయతీలుగా భద్రాచలం

విధాత, హైదరాబాద్ : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులను తెలంగాణ గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన మూడు బిల్లులతో పాటు తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) బిల్లు, తెలంగాణ స్టేట్ మైనార్టీస్ కమిషన్ బిల్లు, తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర చేశారు, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గత సోమవారం రాజ్ భవన్‌లో గవర్నర్ సుమారు రెండు గంటలపాటు సమావేశమై పెండింగ్ బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు. బిల్లుల పెండింగ్‌లో పరిపాలనలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరవు పెట్టారు. ఈ నేపధ్యంలోనే గవర్నర్ పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు.

గత బీఆరెస్‌ సర్కారు రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన చాలా బిల్లులను అప్పటి సీఎం కేసీఆర్‌తో నెలకొన్న విభేధాల నేపథ్యంలో నాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించకుండా సుదీర్ఘ కాలం పెండింగ్ లో పెట్టారు. దీనిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన అనంతరం తమిళిసై 2023ఏప్రిల్‌లో మూడు బిల్లులు మాత్రమే అమోదించారు. మిగిలిన ఏడింటిలో తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లును రాష్ట్రపతికి పంపించారు. మిగిలిన వాటిలో కొన్నింటిని తిరస్కరించగా, మరకొన్నింటిని ప్రభుత్వానికి తిప్పి పంపించడం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసనసభ రెండోసారీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో పెండింగ్ బిల్లుల్లో నాలుగింటిని గత బీఆరెస్ ప్రభుత్వం రెండోసారి రాష్ట్ర శాసనసభలో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపించినప్పటికి గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. తాజాగా ఏడు బిల్లులను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించడంతో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది.

‘అవిశ్వాసం’ ఇక నాలుగేళ్ల తర్వాత..

మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు-2022కు గవర్నర్‌ ఆమోదముద్ర లభించడంతో మున్సిపల్ చైర్ పర్సన్‌, వైస్ చైర్ పర్సన్‌లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీస కాల వ్యవధిని 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెరిగింది. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మేయర్లు/చైర్ పర్సన్లు, డిప్యూటీ మేయర్లు/వైస్ చైస్ పర్సన్లపై అవిశ్వాసన తీర్మానం ప్రవేశపెట్టడానికి వారి పదవీ కాలం కనీసం మూడేళ్లు ముగిసి ఉండాలని మున్సిపాలిటీల చట్టం పేర్కోంటుంది. మేయర్లు/చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు/డిప్యూటీ మేయర్లను బెదిరించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి కౌన్సిలర్లు/ కార్పొరేటర్లు ఈ నిబంధనను దుర్వనియోగం చేస్తున్నారని పేర్కొంటూ గత ప్రభుత్వం ఈ వ్యవధిని 4 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన చేసింది. మున్సిపాల్టీల్లో ఇద్దరు, కార్పోరేషన్‌లలో నలుగురు కోఆప్షన్ సభ్యులను నియమించుకునే అవకాశం గత మున్సిపల్ చట్టంలో ఉండగా, సవరణ చట్టంలో అదనంగా ప్రత్యేక పరిజ్ఞానం, విశేష అనుభవం ఉన్న వారిని మున్సిపాల్టీల్లో ఇద్దరిని, కార్పోరేషన్లలో ఆరుగురి వరకు నియమించుకునే వెసులుబాటు కల్పించారు.

రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు

మున్సిపాలిటీల ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వ్యవహరిస్తారని మున్సిపాల్టీ చట్టంలో ఉండగా, చైర్ పర్సన్‌/మేయర్, వైస్ చైర్ పర్సన్‌/ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోకసభ సభ్యులకు మాత్రమే ఉన్నట్టు చట్టంలో ఉంది. ‘రాజ్యసభ సభ్యులు’ అనే పదాన్ని చేర్చడంలో చట్టం రూపొందించే సమయంలో పొరపాటున మరిచిపోయారు. ఈ నేపధ్యంలో రాజ్యసభ సభ్యులకు సైతం ఓటు హక్కును కల్పిస్తూ ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు సైతం గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక జీహెచ్ఎంసీలో ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులకు గాను ఇద్దరు మైనార్టీలు ఉండాలి. జీహెచ్ఎంసీ పరిధి పెరిగిన నేపధ్యంలో కోఆప్షన్ సభ్యుల సంఖ్య 9కి, వారిలో మైనారిటీల సంఖ్య 6కు పెంచాలని మరో ప్రతిపాదన ఈ బిల్లులో పెట్టారు. హైదరాబాద్ కార్పోరేషన్ ఓటర్ల జాబితాను జనవరితో పాటు ఏప్రిల్‌, మే నెలల్లో కూడా సవరించి ఫబ్లిష్ చేసేందుకు అనుమతించారు.

మరో ఐదు ప్రైవేటు వర్సిటీలకు చాన్స్

తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు- 2022ను గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ బిల్లును బీఆరెస్‌ ప్రభుత్వం రెండోసారి శాసనసధిలో ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. కాగా మెడ్చల్ జిల్లా శామీర్ పేటలో ఎస్ఐసీఎంఏఆర్ యూనివర్సిటీ, సంగారెడ్డిలో ఎంఎన్ఆర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురునానక్, మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం యామ్నాంపేటలో శ్రీనిధి, సిద్ధిపేట జిల్లా వర్గల్‌ మండలం గౌరారంలో కావేరి వర్సిటీల ఏర్పాటుకు లైన్ క్లియరైంది. ఆ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ సమస్యలు తొలగిపోయాయి.

మున్సిపాలిటీగా ములుగు

ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు, కేతనపల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్‌గా మార్పుకు సంబంధించిన బిల్లును కూడా గతంలో ప్రభుత్వం రెండోసారి శాసన సభలో ఆమోదించి పంపించింది. దీనిని గవర్నర్ ఆమోదించారు.

3 పంచాయతీలుగా భద్రాచలం

తెలంగాణ పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లు-2023కు ఆమోదం లభించడంతో పాలన వికేంద్రీకరణలో భాగంగా భద్రాచలంను మూడు గ్రామ పంచాయతీలుగా, సారపాకను రెండు గ్రామ పంచాయతీలుగా విభజించడానికి, రాజంపేటను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

మైనారిటీల జాబితాలో జైనులు

తెలంగాణ స్టేట్ మైనార్టీస్ కమిషన్ చట్ట సవరణ బిల్లు ఆమోదంతో రాష్ట్రంలోని మైనారిటీల జాబితాలో జైనులకు కూడా చోటు లభించింది. రాష్ట్ర మైనార్టీస్ కమిషన్‌లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలతో పాటు కొత్తగా జైన మతస్తుడిని సైతం సభ్యుడిగా
నియమించడానికి వీలు కలిగింది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) బిల్లు ద్వారా హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు బోధనాస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు కూడా ఆమోదం లభించింది. గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ బిల్లుతో టిమ్స్‌లకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటుతో పాటు వైద్యులు, సిబ్బందిని స్వయంగా నియమించుకునే అధికారం ఆ సంస్థలకు ఉంటుంది. సొంతంగా ఆదాయాన్ని, నిధులను సమకూర్చుకునే వీలుంది. ఓక్కో టీమ్స్‌లో 150గగదులు ప్రైవేటు వ్యక్తులకు వైద్య సేవలకు వినియోగిస్తారు. టిమ్స్‌లకు చైర్మన్‌గా సీఎం ఉంటారు. నిమ్స్‌, ఎయిమ్స్ మాదిరిగా డైరక్టర్‌ను నియమిస్తారు. పీజీ మెడికల్ సీట్లతో పాటు మెడికల్ రీసెర్చ్ సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలను అందిస్తారు.