అభ్యర్థుల ప్రచార ఎత్తుగడలు.. బాండ్ పేపర్ల హామీలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు పలు రకాల ప్రయత్నాలు..వినూత్న ప్రచార ఎత్తుగడలు, హామీలు కురిపిస్తూ విజయం కోసం పాట్లు పడుతున్నారు

- జగిత్యాలలో జీవన్‌రెడ్డి, సూర్యాపేటలో సంకినేని, నకిరేకల్‌లో వీరేశం
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు పలు రకాల ప్రయత్నాలు..వినూత్న ప్రచార ఎత్తుగడలు, హామీలు కురిపిస్తూ విజయం కోసం పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులు బాండ్ పేపర్ల హామీ ఎత్తుగడలను ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగిత్యాల ప్రజలకు నేను ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని తన బాండ్ పేపర్‌లో హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి శుభ దినాన తాను బాండ్ పేపర్ రాసిస్తున్నానని, తాను గెలిచాక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నన్నూ నిలదీయ వచ్చని తెలిపారు. అటు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్‌రావు కూడా నియోజకవర్గ ప్రజలకు బాండ్ పేపర్ హామీ రాసిచ్చారు.
సూర్యాపేటలో నన్నూ గెలిపిస్తే ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఉంటారని, కాంగ్రెస్, బీఆరెస్ పాలనలో జరిగిన రౌడీ, కబ్జా రాజకీయలు ఉండవని ప్రజలంతా స్వేచ్చాయుత ప్రశాంత జీవనం సాగించవచ్చని ఆయన బాండ్ పేపర్‌లో హామీ ఇచ్చారు. నకిరేకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం కూడా బాండ్ పేపర్ హామీ రాసిచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో వీరేశం నియోజకవర్గం ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చారు. వీరేశం అనే నేను కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తానని మాట ఇస్తున్నట్లుగా బాండ్ పేపర్‌పై రాసి సంతకం చేశారు. ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అభ్యర్థుల బాండ్ పేపర్ల హామీలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. గతంలో నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్ కూడా పసుపు బోర్డు తెస్తానని ప్రజలకు బాండ్ పేపర్ హామీ ఇచ్చారు. విపక్షాలు అర్వింద్ ఇచ్చిన బాండ్ పేపర్ హామీని ప్రస్తావిస్తూ ఇటీవల దాకా ఆయనపై విమర్శల దాడి సాగించాయి. ప్రధాని మోడీ ఇటీవల పసుపు బోర్డు ప్రకటన చేయడంతో అర్వింద్ బాండ్ పేపర్ హామీ అమలులో విమర్శలు తప్పినట్లయ్యింది.