తెలంగాణ ఓటర్లు 3,17,17,389

తెలంగాణ ఓటర్లు 3,17,17,389
  • తుది జాబితా విడుదల చేసిన సీఈసీ
  • జనవరి 5తో పోల్చితే 5% పెరుగుదల
  • 60కిపైగా స్థానాల్లో మహిళాధిక్యం


విధాత: రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,17,17,389 ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన తుది జాబితాకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీ నాటి లెక్కలతో పోల్చితే తుది జాబితాలో 17,42,470 మంది (5.8శాతం) ఓటర్లు పెరిగారని వెల్లడించింది.



18-19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 8,11,640గా తెలిపింది. జనవరి ఐదు లెక్కలతో పోల్చితే 5,32,990 మంది పెరిగాని తెలిపింది. చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్‌, ఇల్లు మారిన వారు.. మొత్తంగా 6,10,694 ఓట్లు తొలగించినట్టు వెల్లడించింది. జాబితాలో ఇంటి నంబర్లకు సంబంధించి 5,80,208 మార్పులు చేసినట్టు తెలిపింది.

అక్టోబర్‌ 4 తర్వాత కూడా పేరు నమోదు చేయించుకునేందుకు, జాబితాలో తప్పులు సవరించుకునేందుకు అవకాశం ఉన్నదని పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఇంటిలో ఆరుకు మించి ఓటర్లు ఉన్న 7.66 లక్షల ఇళ్లలో 75.97 ఓట్లను తనిఖీ చేసినట్టు వివరించింది.


ఇందులో పురుషులు 1,58,71,493, మహిళా ఓటర్లు 1,58,43,339 ఉన్నారని, థర్డ్‌జెండర్‌ ఓటర్లు 2,557 ఉన్నారని తెలిపింది. సర్వీస్‌ ఎలక్టర్స్‌ 15,338 మంది, ఓవర్సీస్‌ ఓటర్లు 2,780 మంది ఉన్నట్టు పేర్కొన్నది. గత జనవరి జాబితాతో పోల్చితే 5% పెరుగుదల ఉన్నది.


 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 43,943గా ఉన్నది. 5,06,493 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏమన్నా పొరపాట్లు ఉంటే ఫామ్‌ 8 ద్వారా లేదా ఆన్‌లైన్‌లో దిద్దుబాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1950ని సంప్రదించాలని ఈసీ కోరింది. దాదాపు 60కి పైగా స్థానాల్లో పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు.