ఎంఐఎంలో న‌లుగురు సిట్టింగ్‌కు నో టికెట్‌!

ఎంఐఎంలో న‌లుగురు సిట్టింగ్‌కు నో టికెట్‌!
  • మార్పు త‌ప్ప‌దంటున్న పార్టీ చీఫ్ ఓవైసీ?
  • పాత‌బ‌స్తీ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి
  • చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్పై
  • ముసురుతున్న అవినీతి ఆరోప‌ణ‌లు



విధాత‌: పాత‌బ‌స్తీ ప‌రిధిలోని న‌లుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను ఈ సారి ఎంఐఎం మార్చ‌బోతున్న‌ద‌ని అనే ప్ర‌చారం క‌ల‌క‌లం సృష్టిస్తున్న‌ది. పాత‌బ‌స్తీ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాలు ఎంఐఎంకు కంచుకోట‌గా ఉన్నాయి. గ‌త కొన్నేండ్లుగా ఈ స్థానాల్లో ఎంఐఎం అభ్య‌ర్థులే గెలుస్తూ వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో న‌లుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎంఐఎం మార్చ‌బోతున్న‌ద‌ని వ‌స్తున్న‌వార్త‌లుతో సిట్టింగ్‌కు ఇత‌ర పార్టీలు గాలం వేసే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. ముఖ్యంగా ఆయా స్థానాల్లో పాగా వేయాల‌ని కాంగ్రెస్ పావులు క‌దుపుతున్న‌ది.


ఆలిండియా మ‌జ్లిస్ ఈ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) త‌ర‌ఫున‌ చార్మినార్ ఎమ్మెల్యేగా ముంతాజ్ అహ్మద్, బ‌హ‌దూర్‌పుర ఎమ్మెల్యేగా మౌజం ఖాన్‌, యాక‌త్‌పుర్ ఎమ్మెల్యేగా స‌య్య‌డ్ అహ్మ‌ద్ పాషా ఖాద్రి, నాంప‌ల్లి ఎమ్మెల్యేగా జాఫ‌ర్ హుస్సేన్ ఉన్నారు. ఈ నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను ఎంఐఎం మార్చాలని భావిస్తున్నట్టు తెలుస్తున్న‌ది. గతంలో కంటే సీట్లు పెంచుకునే అవకాశాలపై కూడా ఒవైసీ బ్రదర్స్ దృష్టిపెట్టారు. ఈ నేప‌థ్యంలోనే మరో నెల రోజుల్లో తెలంగాణ పోలింగ్ జరుగనున్నా.. ఎంఐఎం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.


ముఖ్యంగా చార్మినార్ ఎమ్మెల్యేకు అసలు టికెట్ ఇవ్వకపోవచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకుడు, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ విషయంలో ఇప్పుడు పార్టీ తీవ్రంగా ఆలోచిస్తున్నది. చార్మినార్ ఎమ్మెల్యేగా ఉంటూ అవినీతికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎమ్మెల్యే అవినీతిపై భారీగా చర్చజ‌రుగుతున్న‌ది.


ఈ సారి ఎన్నికల నుంచి తప్పుకోవాలంటూ స్వయంగా అక్బరుద్దీన్ వెళ్లి ముంతాజ్‌కు చెప్పినట్లు తెలుస్తున్నది. చార్మినార్ నుంచి కొత్త అభ్యర్థిని ప్రకటిస్తామని కూడా చెప్పింది. అయితే ముంతాజ్ అహ్మద్ అంగీకరించలేదని తెలుస్తున్నది. ఒక వేళ తాను కాకుంటే తన కుటుంబం నుంచి ఒకరికి టికెట్ కేటాయించాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఓవైసీ బ్రదర్స్ మాత్రం ఇంకా ఆ విషయంపై ఎలాంటి హామీ ఇవ్వలేద‌ని స‌మాచారం.