ఓఆర్‌ఆర్‌పై వివరాలివ్వడానికి అభ్యంతరం ఏంటి..?: హైకోర్టు

- ఒక ప్రజాప్రతినిధి, (ఎంపీ) వివరాలు అడుగుతే ఎందుకు ఇవ్వరూ?
- ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి..
- అస్సలు ఆర్టీఐ ఉన్నది ఎందుకు..?
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు
- తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా
హైదరాబాద్, విధాత : ఓఆర్‌ఆర్‌పై వివరాలు అడిగితే వివరాలు ఇవ్వకపోవడం ఏంటి..? ఒక ప్రజాప్రతినిధి (ఎంపీ) అడుగుతేనే వివరాలు ఇవ్వకుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఓ ఆర్ ఆర్ టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని, వాటి వివరాలు చెప్పాలని సమాచార హక్కు చట్టం ( ఆర్టీఐ)ని సంప్రదించిన వారు స్పందించకపోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్ దఖాలు చేసిన విషయం తెలిసిందే.
ఓఆర్‌ఆర్‌ని 30 ఏండ్లు ఐఆర్‌బీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం కట్టబెట్టి ప్రజాధనాన్ని వృథా చేస్తుందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా రూ. లక్ష కోట్ల విలువైన ఓ ఆర్ ఆర్‌ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం బీనామీ సంస్థలకు అమ్ముకుంటుందని ఆరోపిస్తూ 2022-2023లో ఓఆర్ ఆర్‌కి ఎంత ఆదాయం వచ్చిందని జూన్,14 2023న ఆర్టీఐకి అప్లీకేషన్ చేస్తే వారు ఎలాంటి వివరాలు వెల్లడిస్తలేరని ఆయన పిటిషన్‌లో తెలిపారు.
ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరుఫు న్యాయవాది రేవంత్‌రెడ్డి తరుఫున రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఓఆర్ఆర్ టెండర్ల వివరాలు అడిగితే ఓ ఎంపీకి ఇవ్వకపోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా పిటిషనర్ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన వివరాలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు పాటిస్తామని స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.