మసకబారుతున్న బీఆర్ఎస్ ప్రతిష్ట
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత అన్ని విధాలుగా పూర్తి అండదండలందించిన ఓరుగల్లులో ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారుతోంది

- సిట్టింగులకు పెరిగిన వ్యతిరేకత
- అక్రమాల పైన జనంలో తీవ్ర చర్చ
- సెకండ్ లీడర్ షిప్‌లో అసమ్మతి
- పనిచేయని అధిష్టానం పరపతి
- బీఆర్ఎస్ నేతల గాంభీర్య ప్రకటనలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత అన్ని విధాలుగా పూర్తి అండదండలందించిన ఓరుగల్లులో ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారుతోంది. పార్టీ పలుకుబడి దెబ్బతిని ప్రజా విశ్వాసం కోల్పోతోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నప్పటికీ పోలింగ్ నాటికి కూడా పరిస్థితులు కుదుటపడకుంటే ఈ దఫా వరంగల్ జిల్లా పై గులాబీ అధిష్టానం పెట్టుకున్న ఆశలు గల్లంతుకావడం ఖాయమంటున్నారు.
టీఆరెస్‌కు అన్నివేళలా అండదండ
టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి, ఆ తదుపరి ఉద్యమ సమయంలో, ఎన్నికల్లో, ఎదురైన కష్టసుఖాల్లన్నింటా వరంగల్ గడ్డ మేమున్నామంటూ బాసటగా నిలిచి కొండంత బలాన్నిచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని అందించింది. బలంతో వెలుగువెలిగిన ఓరుగల్లు బీఆర్ఎస్ ప్రభ క్రమంగా సన్నగిల్లుతోంది. గమనించాల్సిన విషయమేమిటంటే ప్రజాకర్షక పథకాల పట్ల అంత వ్యతిరేకత లేనప్పటికీ పార్టీ అధిష్టానంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన మాత్రం పార్టీలోని సెకండ్ లీడర్ షిప్ బహిరంగంగా భగ్గుమంటోంది.
ఎమ్మెల్యేల పై తిరుగుబావుటా ఎగురవేసి తమ అసంతృప్తిని బాహటంగా చాటిచెబుతున్నారు. ఇక కేడర్లో నాయకుల పట్ల తీవ్ర అసంతృప్తి జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరుపట్ల స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం అధిష్టానాన్ని తీవ్రంగా కలవరపరుస్తోందీ. పోలింగ్ ఇంకా 15 రోజులు ఉండగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరికలు ప్రచార ఆర్భాటం పేరుతో డాంబికాలు పలుకుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నిత్యం వెన్నంటి తిరిగే నాయకత్వంలో కూడా అప నమ్మకం కనిపిస్తోంది
ఎమ్మెల్యేల పై భగ్గమంటున్న అసమ్మతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిలో ఒకటి, అర మినహా అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఆ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీరుపై ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. భూకబ్జాలు, అక్రమాలు అంటూ విమర్శిస్తున్నారు.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పైన ఉద్యమకారులు కారాలు మిరియాలు నూరుతున్నారు. మొరం దందా చల్లా కనుసన్నల్లో సాగుతోందని విమర్శించారు. నాగూర్ల వెంకటేశ్వర్లుకు మద్ధతుగా బహిరంగ ప్రకటనలు చేసి చల్లాకు కునుకులేకుండా చేశారు. ఇప్పటికీ నాగోర్ల పరకాల నియోజకవర్గంలో కాలు పెట్టింది లేదు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఎమ్మెల్సీ రవిందర్ రావు అనుచరులు నిరసన జెండాలెత్తారు. భూకబ్జాదారుడైన ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ ప్రకటనలు చేశారు.
మామిడితోటల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పైన పార్టీ నాయకులు, శ్రేణులు మండిపడుతున్నారు. గ్రామాలు, తండాలకు వెళితే నిరసనలతో అడ్డుకుని వాపస్ పంపించారు. పాలకుర్తి ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లికి అసమ్మతి వర్గ నాయకులు రహస్య సమావేశం నిర్వహించి గట్టి ఝలక్ ఇచ్చారు. దీని నుంచి మంత్రి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పై ఆయన అనచరవర్గంగా ముద్రపడిన వారే వ్యతిరేకించారు. మార్నేని రవీందర్ రావు ఆధ్వర్యంలో రహస్య సమావేశాలు నిర్వహించారు.
అరూరి తీరుపై అంశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రాంగం నిర్వహించారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పైన ఆ పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, నాయకులు మెట్టు శ్రీనివాస్, రాజనాల శ్రీహరి తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. తాజాగా మాజీ మేయర్ గుండ ప్రకాష్, రాజనాల శ్రీహరి పార్టీని వీడారు. సారయ్య సుధారాణి పూర్తిలో ప్రచారం చేసింది లేదు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పైన భూకబ్జాదారుడంటూ ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. దీనికి ఆయన కుమార్తె తుల్జాభవాని తోడైంది.
ముత్తిరెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోటీలోకి తీసుకొచ్చారు. పల్లా రంగ ప్రవేశం చేసినప్పటికీ సానుకూల పరిస్థితి నెలకొనేలేదని గులాబీ వర్గాలే బాహాటంగా అంటున్నారు. స్టేషన్గన్పూర్ బీఆర్ఎస్ లో డాక్టర్ రాజయ్య, కడియం శ్రీహరి మధ్య పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే నువ్వు అవినీతిపరుడు అంటే నువ్వు అవినీతిపరుడు బహిరంగంగా దూషించుకున్నారు ఇప్పటికీ రాజీవ్ వర్గం అంటే ముట్టనట్టు వ్యవహరిస్తుందని చర్చ సాగుతోంది. వరంగల్ పశ్చిమ, నర్సంపేటల్లో మాత్రం ప్రస్తుతానికి అసంతృప్తి బహిరంగం కాలేదు.
ఎమ్మెల్యేల అక్రమాలపై తీవ్ర చర్చ
ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల అక్రమాలు, ఏకపక్ష విధానాలు, అక్రమ సంపదన, పార్టీని పట్టించుకోకపోవడం తదితర అంశాలను ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగా చర్చిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సొంత పార్టీ నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యేల అక్రమార్జన పై లెక్కలు చెబుతుంటే విని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్నటి వరకు ఏ అసమ్మతి లేదని భావించిన నియోజకవర్గాల్లో సైతం ఈ పరిణమాలు చోటు చేసుకోవడం విశేషం.
ఎమ్మెల్యేలకు అనుచరులుగా ముద్రపడిన వారు నిరసన గొంతెత్తుతుంటే మిగిలిన వాళ్లు నోరెళ్లబెడుతున్నారు.ఈ వరుస పరిణామాలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టికి ముంచు కొస్తున్న ప్రమాద ఘంటికలుగా పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలాగే కొనసాగితే కొంపమునుగడం ఖాయమంటున్నారు. మరోవైపు జనగామ, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి, పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాల, మానుకోట, డోర్నకల్, వరంగల్ తూర్పు సెగ్మెంట్లలో వరుసగా రెండు అంతకంటే ఎక్కువ పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఉంటూ వస్తున్నారు.
ఒక్క నర్సంపేట మాత్రమే రెండవ పర్యాయం పోటీ పడుతున్నారు. ఇందులో కొందరు పార్టీలు మారినప్పటికీ అభ్యర్థులు వారే కావడం ఒక అంశం అయితే, మరి కొన్నిచోట్ల అభ్యర్థులు మారినా బీఆర్ఎస్ మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ పడటం పార్టీకి ప్రతికూలంగా మారింది. దీంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
గులాబీ నేతల మేకపోతు గాంభీర్యం
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పెరిగిన తీవ్ర వ్యతిరేకత బహిరంగంగా వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేలు నిర్వహించుకుంటున్న అంతర్గత సర్వేల్లో ఇదే అంశం తేటతెల్లమై వారిని తీవ్ర ఆందోళనల్లో ముంచెత్తుతున్నప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పైకి గంభీర వచనాలు ప్రవచిస్తున్నప్పటికీ ఈ స్థితి ఇలాగే కొనసాగితే ఈ ఎన్నికల్లో పుట్టిమునగడం తప్పదంటున్నారు.
రానున్న ఎన్నికల్లో మార్పు తప్పదని భావిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు తెరవెనుక ప్రయత్నం అధిష్టానం ముఖ్యనేతలు,వార్ రూం ద్వారా రంగంలోకి దిగి విశ్వాసపాత్రులైన నాయకులను దూతలుగా పంపుతున్నారు. వీరి ద్వారా మధ్యవర్తిత్వత్వం నెరపి అసమ్మతిని కట్టడి చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.