టికెట్ నాదే.. బరిలో ఉండేది నేనే! మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి

టికెట్ నాదే.. బరిలో ఉండేది నేనే! మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి

విధాత, మెదక్ బ్యూరో: ‘జిల్లాలో కార్యకర్తల రెక్కల కష్టంతో కాంగ్రెస్ ను ముందుండి నడిపాం. వారి అభీష్టం మేరకే నా నిర్ణయం ఉంటుంది. టికెట్ నాదే.. పార్టీ బరిలో ఉండేది నేనే’ అంటూ డీసీసీ అధ్యక్షుడు కంఠ రెడ్డి తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో కొత్తగా వచ్చిన వారికే టికెట్ వస్తుందని మీడియాలో ప్రచారం చేస్తున్నారని మైనంపల్లి హన్మంతరావును ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



డీసీసీ క్యాంప్ కార్యాలయంలో మెదక్ నియోజక వర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులతో కలిసి తిరుపతిరెడ్డి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లుగా కష్టనష్టాలకు ఓర్చి కాంగ్రెస్ పార్టీని నడిపించింది కార్యకర్తలని, వారి అభీష్టం మేరకే తాను ముందుకెళ్తానని అన్నారు.



గతంలో ప్రకటించిన మాదిరిగా తనకే టికెట్ కేటాయించాలని మండల, పట్టణ, జిల్లా నాయకుల తీర్మానం కాపీని ఢిల్లీకి వెళ్లి అధిష్టాన వర్గానికి సమర్పిస్తానని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన వారికి టికెట్ కేటాయిస్తే సమయం సరిపోదన్నారు. మండల, గ్రామ కమిటీలను పరిచయం చేసుకునేసరికే సమయం వృథా అవుతుందన్నారు.



ఎవరికి పార్టీ హామీ ఇచ్చినా, టికెట్ కేటాయించినా తాను బరిలో ఉంటానని కంటారెడ్డి తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. ఇది కార్యకర్తల అభిప్రాయం అన్నారు. సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి మమిల్ల ఆంజనేయులు, ఆఫీస్ ఉద్దీన్, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే శంకర్, శ్యామ్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అంజగౌడ్ పాల్గొన్నారు.