కాంగ్రెస్‌కు అంటిన‌ టికెట్ల మంట‌!

కాంగ్రెస్‌కు అంటిన‌ టికెట్ల మంట‌!
  • రెండో జాబితాతో ర‌గిలిన‌ అసమ్మతులు
  • ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపుపై నేత‌ల్లో ధీమా
  • టికెట్ రాక‌పోవ‌డంతో ప‌లువురికి నిరాశ‌
  • పలు నియోజకవర్గాల్లో నేతల తిరుగుబాట్లు
  • జూబ్లీహిల్స్ నేత విష్ణువర్ధన్ రెడ్డి రాజీనామా
  • అదే బాటలో మ‌రికొంద‌మంది ఆశావ‌హులు
  • పలుచోట్ల రెబల్ అభ్య‌ర్థులుగా పోటీకి సిద్దం
  • క‌న్నీరుమున్నీరైన కొంద‌రు నాయ‌కులు

విధాత: తెలంగాణ శాసనసభ ఎన్నికల కాంగ్రెస్ రెండో జాబితా ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెల‌వ‌డం ప‌క్కా అని భావిస్తున్న ఆ పార్టీ నేత‌లు.. టికెట్‌ల కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ క్ర‌మంలో కొంద‌రికి టికెట్‌లు ద‌క్క‌లేదు. దీంతో ఆశావ‌హుల్లో అసంతృప్తి రాజుకున్న‌ది. ఏకాభిప్రాయం ఉన్న స్థానాల‌ని అధిష్ఠానం చెబుతున్నా.. అనేక చోట్ల భిన్నాభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. టికెట్ రాని నేత‌లు అసమ్మతి వెళ్ళగక్కుతూ రచ్చకెక్కుతున్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ అగ్ర నేతల దిష్టిబొమ్మలను సైతం దహనం చేస్తూ నిరసనకు దిగారు. మరికొందరు నేతలు పార్టీకి రాజీనామా చేస్తుండగా.. ఇంకొందరు ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన పీ విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా ప్రకటించారు. జూబ్లీహిల్స్ సీటును అజారుద్దీన్‌కు కేటాయించారు. దీంతో అసంతృప్తికి గురైన విష్ణువర్ధన్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా అజారుద్దీన్ పై ఘాటైన విమర్శలు గుప్పించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడి లాంటివాడని, అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. అజార్ హెచ్‌సీఏలో ఎలా అవకతవకలకు పాల్పడ్డారో, జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే కూడా అలాగే చేస్తారని ఆరోపించారు. మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించడంతో, ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన చలమల కృష్ణారెడ్డి కినుక వహించారు. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. చలమల‌ వర్గీయులు నిరసన బాట పట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్, రేవంత్ దిష్టిబొమ్మ దహనాలకు పాల్పడ్డారు. అటు ఎన్ఎస్‌యూఐ నేత బల్మూరు వెంకట్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి సైతం తమకు కాంగ్రెస్ టికెట్లు దక్కకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు.

ఇంకోవైపు పార్టీలో చేరిన వెంటనే టికెట్లు కేటాయించడంతో గత ఐదు, పదేళ్లుగా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించిన నేతలు టికెట్ దక్కకపోవడంతో ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. వలస నేతలకు టికెట్లు కేటాయించడం పట్ల పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అటు బీసీ నేతలు తమకు తగిన సీట్లు దక్కలేద‌ని చెబుతున్నాయి. మిగిలిన 19 స్థానాల్లో నాలుగు వామ‌ప‌క్షాల‌కు పోను.. అసంతృప్తులకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అన్నది తేలాల్సి ఉంది. మ‌రోవైపు వామపక్షాలకు ఇచ్చే సీట్లతో ఎవరి టికెట్లకు కోతపడుతుందోనన్న టెన్షన్ కాంగ్రెస్ ఆశావహులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.

కన్నీరుపెట్టిన సుభాష్‌రెడ్డి

ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ను కాంగ్రెస్ అధిష్ఠానం మదన్ మోహన్‌కు కేటాయించింది. ఈ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. తన అనుచరులతో భేటీ అయ్యారు. వారి ఎదుటే భోరున విలపించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వనపర్తి టికెట్ ఆశించిన మేఘారెడ్డికి, దేవరకద్ర టికెట్ ఆశించిన కొండా ప్రశాంత్ రెడ్డికి, జడ్చర్ల టికెట్ ఆశించిన ఎర్ర శేఖర్ కి నిరాశ ఎదురైంది. వారంతా తమ భవిష్యత్ కార్యాచరణ కోసం అనుచరులు, మద్దతుదారులతో భేటీ అవుతున్నారు. వనపర్తి టికెట్ ఆశించిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. పరకాల టికెట్ రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇవ్వడంతో, ఇక్కడి నుండి టికెట్ ఆశించిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానని ప్రకటించారు. బోథ్ నియోజకవర్గం సిటింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ టికెట్ దక్కక కాంగ్రెస్ లో చేరినప్పటికీ ఇక్కడ కూడా టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలో పడిపోయారు. ఆయన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకునేందుకు అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు.

వరంగల్ లో జంగా రాఘవరెడ్డికి నిరాశే

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్‌ నాయిని రాజేందర్ రెడ్డికి దక్కింది. ఈ టికెట్ ఆశించిన జంగా రాఘవరెడ్డికి నిరాశే ఎదురైంది. ఆయన మొదట జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలో పని చేశారు. అధిష్ఠానం ఆదేశాలతో వరంగల్ పశ్చిమలో ఇన్నాళ్లూ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. టికెట్‌ ఆశించి భంగపడిన జంగా, తన అనుచరుల వద్ద కంటతడి పెట్టారు. కొత్తగా వచ్చిన రేవూరి, నాగరాజు, యశస్వికి టిక్కెట్లు ఇచ్చారని, మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన తనకు ఇవ్వలేదని మీడియా ఎదుట వాపోయారు. పార్టీ సమావేశాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశానన్నారు. నాయిని రాజేందర్ ఒక బ్రోకర్… అసమర్థుడు అన్నారు. కేయూ భూములు అమ్ముకున్న నాయినికి టిక్కెట్ ఇచ్చారన్నారు. తనపై కుట్ర చేసి అసమర్థుడికి టిక్కెట్ ఇచ్చారంటూ జంగా రాఘవరెడ్డి అధిష్టానంపై మండిపడ్డారు. ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, చలమల్ల‌ కృష్ణారెడ్డి, ఎర్ర శేఖర్, నగేష్ రెడ్డి,‌ గండ్ర సుజాత, శివసేనా రెడ్డి, బల్మూరి వెంకట్, మానవతా రాయ్, పిడమర్తి రవి కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. గొట్టిముక్కల వెంగళరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూకట్‌పల్లి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేశారు. పార్టీ అధిష్టానం శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు టిక్కెట్ ఖరారుచేసింది. దీంతో పార్టీపై మనస్తాపం చెందిన సీనియర్ నేత గొట్టిముక్కల ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కోసం 40 ఏళ్లుగా కష్టపడ్డానని, పార్టీని వీడాలంటే బాధగా ఉందని గొట్టిముక్కల కంటతడి పెట్టారు.