ఇద్దరు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్

ఇద్దరు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్


  • ట్రాక్టర్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం
  • పరారీలో ప్రధాన నిందితులు

విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ఒరిస్సా రాష్టం నుంచి మంచిర్యాల మీదగా మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లు పోలీసులకు పట్టుబట్టారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం సీపీ రెమా రాజేశ్వరి కేసు వివరాలు వెల్లడించారు.


ఒడిషా రాష్టంలోని మల్కాజ్ గిరి జిల్లాకు చెందిన జగబందు క్రిసాని, చిత్ర సేన్ క్రిసాని సినీ ఫక్కీలో నాలుగు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా మీదగా నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్ లో ఇటుకల మధ్య 465 కిలోలు, సుమారు రూ.93 లక్షల విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడింది.


సంఘటనా స్థలం నుంచి నిందితులు పరారయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బోల్తా పడిన ట్రాక్టర్ దగ్గర ఎవరూ లేక పోవడంతో ట్రాక్టర్ ను తనిఖీ చేయగా, గంజాయి ఉన్నట్లు గుర్తించారు. భారీ మొత్తంలో గంజాయి ఉండడంతో రెండు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.


ట్రాక్టర్ ఓనర్ తో పాటు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. త్వరలోనే గంజాయి అక్రమ సరఫరా చేస్తున్న ముఠా ను అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్ , రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలిస్తామన్నారు. ఈ కేసును ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, జైపూర్ ఏసీపీ మోహన్ ను అభినందించారు.