ఉగ్గాని అంటే..? సీఎం బ్రేక్ ఫాస్ట్ మెనూపై మంత్రి కేటీఆర్ ప్రశ్న

విధాత: ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ప్రారంభం సందర్భంగా.. ఉగ్గాని అంటే ఏంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సభలో ఉన్న వారినుంచి పెద్దగా స్పందన రాకపోయే సరికి.. ఇది మనది కాదా టిఫిన్ అని అడిగారు. ఈ ఉగ్గానిపై తనకు ఐడియా లేదని కేటీఆర్ చెప్పారు. మనం ఎప్పుడన్న వండితే తెలుస్తది.. తనకు తెల్వదు అని మంత్రి పేర్కొన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మెనూ గురించి పిల్లలకు వివరించారు. ఏ రోజున ఏ అల్పాహారం అందిస్తారనే వివరాలను చెప్పారు. అయితే శుక్రవారం ఉగ్గాని అందివ్వనున్నట్లు మెనూలో ఉండటంతో.. కేటీఆర్ కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉగ్గాని అంటే ఏంటని ప్రశ్నించారు. ఉగ్గానిపై తనకు ఐడియా లేదని కేటీఆర్ చెప్పారు. మనం ఎప్పుడన్న వండితే తెలుస్తదని మంత్రి అన్నారు.
రాష్ట్రంలోని 23 లక్షల మంది పిల్లలకు ప్రతి రోజు ఉదయం సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం కింద అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధ్యాహ్నం భోజనంలో భాగంగా ప్రతి విద్యార్థికి సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. అదే విధంగా ఉదయం పూట కూడా నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్ పెడితే బాగుంటుందని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో, గ్రామాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా కలిసి బ్రేక్ ఫాస్ట్‌ను అందించనున్నాయి. బ్రేక్ ఫాస్ట్ పోషకాలతో కూడి ఉంది. చాలా రుచిగా ఉంది.. నేను కూడా తిన్నాను. మెనూ ప్రకారం అల్పాహారం అందివ్వకపోతే తమకు ఫోన్ చేయాలని విద్యార్థులకు కేటీఆర్ సూచించారు.
సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంలో భాగంగా పెడుతున్న ఉగ్గాని టిఫిన్ అడిగి తెలుసుకున్న కేటీఆర్ pic.twitter.com/e98kecZYmG
— Telugu Scribe (@TeluguScribe) October 6, 2023
నాణ్యతతో కూడిన అల్పాహారాన్ని అందివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కేటీఆర్ ఆదేశించారు. తరుచుగా బ్రేక్ ఫాస్ట్‌ను పరిశీలిస్తూ, రుచిని కూడా పరిశీలించాలన్నారు. మరో ఐదారు రోజుల్లో దసరా సెలవులు కూడా వస్తాయి. ఈ లోపు అల్పాహారం పథకం ఎలా ఉందనే ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని టీచర్లకు సూచించారు కేటీఆర్. పిల్లలందరూ మన పిల్లలే. ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా అందరం బాధపడే పరిస్థితి ఉంటది కాబట్టి.. టీచర్లు కూడా మాకు చెప్పండి. ఈ పథకాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కూడా చెప్పాలని కోరారు.
తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే పనులకు వెళ్లే తల్లిదండ్రుల పిల్లలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. పోషకాలతో కూడి అల్పాహారం విద్యార్థులకు అందుతుంది. పిల్లల బ్రేక్ ఫాస్ట్ కోసం పొద్దున 5 గంటలకు లేవాల్సి ఉంటుంది. ఈ పథకం అమలుతో అటు తల్లిదండ్రులకు, ఇటు పిల్లలకు లాభం కలుగుతుందన్నారు కేటీఆర్.