కాళేశ్వరంపై కేసీఆర్ మౌనమెందుకు?.. రూపశిల్పినన్న సీఎం స్పందన లేదు

– కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బొమ్మాబొరుసు
– లిక్కర్ స్కాంలో కవిత ఊచలు లెక్కపెట్టాల్సిందే
– కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టు నేనే కడుతున్నాను… రూపశిల్పి నేనేనని… డ్రాయింగ్స్ కూడా నేనే ఇన్వాల్వ్ అయి చేస్తున్నానని ప్రగల్బాలు పలికిన ఈ ముఖ్యమంత్రి కేసీఆర్.. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నాడని కేంద్ర సమాచార, యువజన, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. మంచి జరిగితే తన ఖాతాలో, తప్పు జరిగితే ఇతరులను బాధ్యులుగా చేయడం అలవాటని విమర్శించారు. హనుమకొండలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. నాణ్యత, డిజైన్, మెయింటెనెన్స్, ప్లానింగ్ లోపం వల్ల మేడిగడ్డ కుంగిపోయినట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తున్నా కనీస స్పందనలేదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయన్నారు.
లిక్కర్ స్కాంలో ఊచలు పెట్టాల్సిందే
లిక్కర్ స్కాం అయినా, ఏ కుంభకోణమైన సరే భాగస్వామ్యమైన వారు జైలు ఊచలు లెక్కపెట్టవలసిందేనని ఠాకూర్ అన్నారు. తప్పు చేసిన వారిని నరేంద్ర మోడీ ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒకే నాణానికి ఉన్న బొమ్మాబొరుసు లాంటివన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిపాలనని చూసినట్లయితే, రెండూ కూడా అవినీతిని నమ్ముతాయన్నారు. కుటుంబ రాజకీయాలు చేస్తాయి. ఒకదానివెనక ఒకటి పెద్ద పెద్ద కుంభకోణాలకి పాల్పడుతుంటాయని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మరోసారి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు దళిత బంధు ఇస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని, దళిత ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి మాటతప్పారని మండిపడ్డారు.
50 లక్షల కోట్లు దళితులకి, గిరిజనులకి ఖర్చు పెడతామని చెప్పి.. ఈరోజు ఎవరికీ ఎటువంటి మేలు చేయకుండా ఈ ముఖ్యమంత్రి మూర్ఖంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న రేషన్ ని ఇంకొక ఐదేళ్లు ఉచితంగా ఇవ్వాలని నరేంద్ర మోదీ నిర్ణయించారన్నారు. గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం 700 మెడికల్ కాలేజీలు కట్టించిందన్నారు. 75 విమానాశ్రయాలు, 25 ఎయిమ్స్ కాలేజీలు, భారతదేశం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ కలిగి ఉన్నామని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సీట్లలో కనీసం 8 సీట్లు కైవసం చేసుకుంటామన్నారు. తెలంగాణలో అధికారాన్ని చేపట్టేందుకు అవసరమైన స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రావు పద్మ, నాయకులు మురళీధర్ గౌడ్, సదానందం గౌడ్, సంతోష్ రెడ్డి, మాచర్ల కుమార్ స్వామి గౌడ్, కార్పొరేటర్ వసంత, భరత్ గౌడ్, మహేందర్ రెడ్డి, విజయలక్ష్మి, మధు, సాగర్ పాల్గొన్నారు.