తెలంగాణలో రజాకార్ల రాజ్యం.. కేంద్ర సహాయ మంత్రి భగవంతు ఖుభ

తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తున్నదని కేంద్ర రసాయన, ఔషధ కొత్త పాత పునరుత్పత్తుల శాఖ సహాయ మంత్రి భగవంతు ఖుభ అన్నారు

తెలంగాణలో రజాకార్ల రాజ్యం.. కేంద్ర సహాయ మంత్రి భగవంతు ఖుభ

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తున్నదని కేంద్ర రసాయన, ఔషధ కొత్త పాత పునరుత్పత్తుల శాఖ సహాయ మంత్రి భగవంతు ఖుభ అన్నారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజనీతి ఒకటేనని, కుటుంబ అభివృద్ధి రెండు పార్టీల లక్ష్యమన్నారు. పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తెలంగాణ ప్రజల్లో ఆదరణ కోల్పోయిందన్నారు. మరోసారి ఉచితాల పేరుతో ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నదన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలను, ఉద్యమంలో పాల్గొన్న యువత, ఉద్యమకారులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని విమర్శలు చేశారు.

బంగారు తెలంగాణ కాలేదు కానీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయ్యిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలు సైతం ఇవ్వడం లేదన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్యపై కేసీఆర్ ఊసెత్తడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి, దళితబంధు పేరు చెప్పి అర్హులైన దళితులకు ఇప్పటివరకు ఇవ్వటం లేదన్నారు. దళిత నాయకులను నేనొక్కటే కోరుతున్నా… దళిత ద్రోహి కేసీఆర్ గురించి ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా దళిత సామాజిక వర్గాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉందన్నారు. అధికారమే లక్ష్యంగా గ్యారంటీ ఉచిత పథకాల పేరు చెప్పుకొని కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఐదు నెలలు అయినా వారు ఇచ్చిన ఐదు గ్యారంటీ హామీలు నేటికీ అమలు చేయడం లేదని విమర్శించారు.

అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదన్నారు. తెలంగాణ మంత్రుల్లో అత్యంత అవినీతి మంత్రి ఎవరైనా ఉన్నారంటే.. అది పాలమూరు మంత్రి పేరు వస్తున్నదన్నారు. భారతీయ జనతా పార్టీ సర్కారు రావాల్సిన అవసరం తెలంగాణలో ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీ పద్మజా రెడ్డి, ఎగ్గని నర్సింలు, పార్లమెంట్ కన్వీనర్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, జిల్లా ఉపాధ్యక్షులు క్రిస్టియ నాయక్, కృష్ణ వర్ధన్ రెడ్డి, పాండురంగారెడ్డి, రాజు రెడ్డి, అంజయ్య, రాజేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కృష్ణయ్య, బుచ్చిరెడ్డి, జామ్ శ్రీనివాసులు, రమేష్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.