అందుకే ముగ్గురం కాంగ్రెస్ పార్టీలో చేరాము

అందుకే ముగ్గురం కాంగ్రెస్ పార్టీలో చేరాము

విధాత : రాములమ్మ పార్టీ మారారు అని విమర్శించే వాళ్లు అసలు ఎందుకు పార్టీ మారాల్సివచ్చిందో తెలుసుకోవాలని విజయశాంతి కోరారు. ట్వీట్టర్ వేదికగా తనతో పాటు రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎందుకు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరాల్సివచ్చిందన్నదానిపై వివరణ ఇచ్చారు.

కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు 7 సంవత్సరాలు జెండా మోసి కొట్లాడామన్నారు. నాడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇంకొందరు బీజేపీ ప్రముఖులు అనేకసార్లు నా వద్దకు వచ్చి బీఆరెస్‌ అవినీతిపై తప్పక చర్యలుంటాయని, మీరందరూ సమర్థిస్తే కేంద్రంలోని బీజేపీ ఎంతవరకైనా కొట్లాడతదని తమను నమ్మించారన్నారు.

నన్ను, వివేక్ వెంకటస్వామిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఒప్పించి, అందుకు కేంద్ర పెద్దలతో హామీ ఇప్పించి బీజేపీలో చేర్చుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని దుర్మార్గ పాలన పోవాలి, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో సంవత్సరాలుగా పనిచేసిన కాంగ్రెస్ ను వదిలి మేమంతా బీజేపీలోకి వెళితే మాట నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసగించి బీఆర్ఎస్ తో బీజేపీ అవగాహన పెట్టుకున్నందన్నారు. ఆ విషయం తెలిసే మేమంతా బీజేపీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లామన్నారు. విమర్శ తేలికని, ఆత్మ పరిశీలన అవసరమని బీజేపీ నేతలకు విజయశాంతి హితవు చెప్పారు