సింగరేణికి 28 వేల కోట్ల బకాయి: వివేక్

సింగరేణి కాలరీస్ కంపెనీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.28 వేల కోట్లు బకాయి పడిందని, ఇంతవరకు చెల్లించలేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఆరోపించారు

సింగరేణికి 28 వేల కోట్ల బకాయి: వివేక్
  • ఉద్యోగావకాశాలు కల్పిస్తానని కేసీఆర్ మోసం
  • చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.28 వేల కోట్లు బకాయి పడిందని, ఇంతవరకు చెల్లించలేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివేక్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కంపెనీకి పూర్వ వైభవం తీసుకువస్తామని, ఉద్యోగ అవకాశాలు పెంచుదామని చెప్పి మోసం చేశారని విమర్శించారు.


ఉపాధి అవకాశాలు కల్పించకపోగా, ఉన్న ఉద్యోగాలను కుదించారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 72 వేల మంది కార్మికులు ఉండగా, ప్రస్తుతం 42 వేల మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఒకప్పుడు కార్మికుల సంఖ్య గణనీయంగా ఉండేదని, రోజురోజుకు కుదిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు.


కేసీఆర్ దత్తపుత్రుడు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. ఆయపరే ఇక్కడ ఉన్న నిధులు ఎలా తరలించకపోవాలనే ఆలోచన తప్ప అభివృద్ధి చేయాలన్నది లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, 6 గ్యారంటీలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఈసమావేశంలో ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జనక్ ప్రసాద్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.