వ‌రంగ‌ల్ జిల్లా బీజేపీ అభ్య‌ర్థులు వీరే

వరంగల్ పశ్చిమ బిజెపి అభ్యర్థిగా రావు పద్మ ను ఎంపిక చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్య‌ర్థుల తొలిజాబితా శ‌నివారం రాత్రి విడుద‌ల కానుంది

వ‌రంగ‌ల్ జిల్లా బీజేపీ అభ్య‌ర్థులు వీరే

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పశ్చిమ బిజెపి అభ్యర్థిగా రావు పద్మ ను ఎంపిక చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్య‌ర్థుల తొలిజాబితా శ‌నివారం రాత్రి విడుద‌ల కానుంది. అధికారికంగా జాబితా విడుద‌ల‌కు ముందే సంబంధిత అభ్య‌ర్థుల‌కు పార్టీ అగ్ర‌నేత‌లు ఫోన్ చేసి జ‌నంలోకి వెళ్లాలంటూ చెప్పిన‌ట్లు తెలిసింది. అనంత‌రం జాబితాను ప్ర‌క‌టించారు. ఇందులో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థిగా పార్టీ హ‌న్మ‌కొండ జిల్లా అధ్య‌క్షురాలు రావు ప‌ద్మ‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఈ మేర‌కు తొలిజాబితాలో ఆమె పేరు ప్ర‌క‌టించారు. బీజేపీ అభ్య‌ర్థిగా రావు ప‌ద్మకు తొలి జాబితాలోనే అవ‌కాశం ద‌క్క‌డంతో అనుచరుల్లో జోష్ క‌నిపిస్తోంది.




 


అనేక రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డ‌డంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రధానంగా ఇద్దరు నాయకులు పోటీ పడగా రావు పద్మవైపే ముగ్గు చూపారు. బిజెపి నాయకులు రాకేష్ రెడ్డి కూడా టికెట్ నాకే అని భరోసాతో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రావు పద్మవైపు మొగ్గుచూపినట్లు తెలిసింది. మహిళగా పార్టీ కష్టకాలంలో అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించడం ఆమెకు కలిసి వచ్చినట్లు చెబుతున్నారు.

– పార్టీ అభివృద్ధికి పద్మ కృషి

స‌మీక‌ర‌ణాలు, స‌ర్వేలు, అభిప్రాయాల అనంత‌రం రావు ప‌ద్మ‌ను బీజేపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. వ‌రంగ‌ల్లో బీజేపీ బ‌లోపేతానికి రావు ప‌ద్మ కృషి చేశారు. బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణంపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల గెలుపులో కీల‌క పాత్ర పోషించారు. ఇంటింటికీ బీజేపీ పేరుతో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ప్ర‌ధాని మోడీ చేప‌డుతున్న సంక్షేమ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.



 


– తూర్పు, భూపాలపల్లి అభ్యర్థుల ఎంపిక?

వరంగల్ పశ్చిమ తో పాటు వరంగల్ తూర్పు, భూపాలపల్లి స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ప్రకటించిన అనంతరం ఎవరికి అవకాశం దక్కిందో తేలనుంది. వరంగల్ తూర్పు నుంచి నలుగురు పోటీపడుతున్నారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్ బాబు, గంట రవికుమార్ వన్నాల వెంకటరమణ టికెట్ ఆశించారు. సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం టికెట్ వచ్చే అవకాశం ఉంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు టికెట్ ఖాయమైనట్లు ప్రచారం సాగుతోంది. భూపాల్ పల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన చందుపట్ల కీర్తి రెడ్డికి అవకాశాలు పూర్తిగా ఉన్నాయి.ఆమె వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచిచూడక తప్పదు.