N. Uttam Kumar Reddy | సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల,మూడేళ్లలో ఎస్‌ఎల్బీసీ పూర్తి చేస్తాం : ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు కీలకమైన, గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు

N. Uttam Kumar Reddy | సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల,మూడేళ్లలో ఎస్‌ఎల్బీసీ పూర్తి చేస్తాం : ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పెండింగ్ ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యత
ఏటా ఆరున్నర లక్షలు..ఐదేళ్లలో 35లక్షల కొత్త ఆయకట్టు మా లక్ష్యం
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మంత్రి కోమటిరెడ్డితో కలిసి సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల

విధాత, హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు కీలకమైన, గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనీయర్ నాయకులు కె. జానారెడ్డి, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్‌, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలతో కలిసి నాగార్జున సాగర్ డ్యాం, లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యూలేటర్ నుంచి సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బీఆరెస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖలో చేసిన అవినీతి కారణంగా లక్షల కోట్లు ఖర్చు చేసినా కొత్తగా ఆయకట్టు సాగులోకి రాలేదని విమర్శించారు. మేం ఇరిగేషన్ విషయంలో అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుగా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతీ ఏటా ఆరున్నర లక్షల ఎకరాలను, ఐదేళ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మేడిగడ్డ నిర్మాణం అవకతవకలపై లిఖిత పూర్వకంగా ఎన్డీఏస్‌ఏ నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బీఆరెస్ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఇరిగేషన్ బడ్జెట్ 22వేల 500 కోట్లలో అన్ గోయింగ్ వర్క్స్, ఎస్టాబ్లిష్ మెంట్ వర్క్స్ కోసం ఖర్చులు పోగా, మిగిలిన నిధులతో పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత వారిగా పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు నాగార్జునసాగర్ లాగా ఉంటే, బీఆరెస్‌ కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరం లాగా వుంటాయని ఎద్దేవా చేశారు. సాగర్ ఎడమ కాలువకు 11 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, సాగర్ డ్యామ్ మెయింటేనెన్స్ తెలంగాణ ప్రభుత్వమే చేస్తుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులైన ఎస్‌ఎల్బీసీ, డిండీ, బ్రహ్మణవెల్లెంల, పిలాయిపల్లి, లిఫ్టులు అన్ని అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేస్తామని చెప్పారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎడమకాలువ, వరద కాలువలకు నీటి విడుదల చేయడం సంతోషకరమన్నారు. సాగర్ ఎడమకాలువ కింద అన్ని చెరువులు నింపనున్నామని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ సహా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులనుమూడేళ్లలోపు పూర్తి చేస్తామన్నారు. నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పెద్దలు జానారెడ్డి సలహాలతో ముందుకు వెళ్తామని, 35 ఏళ్ల కిందట నిర్మించిన ఏఎమ్మార్పీ కెనాల్ కు లైనింగ్ పూర్తి చేస్తామని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, జిల్లాలో రోడ్లు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. సాగర్ కాలువకు నీటి విడుదల సందర్భంగా రైతులు ఆనందంతో సంబురాలు చేసుకున్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం అంటూ రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.