ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటాం: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులపై తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అధిక

- రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యత
- నిర్మాణ రంగ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
విధాత: ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులపై తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సోమవారం సచివాలయంలో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయ మార్గాలు తెచ్చే వెల్త్ క్రియేటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టమని, వారు ఎదుర్కుంటున్న సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. థేమ్స్ నది మాదిరిగా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని, దీనితో పాటు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడానికి శివారు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ధరణి పై తగు సూచనలు, సలహాలను అందచేస్తే కమిటీ కి అందిస్తానన్నారు. డబ్బులు కట్టి గత రెండు మూడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించండి
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ తెలంగాణా విభాగం ప్రతినిధి బృందం భవన నిర్మాణ అనుమతులకు ప్రస్తుతం ఉన్న 10 శాతం మార్టగేజ్ విధానాన్ని ఎత్తి వేయాలని, రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని, జీ.ఓ. 50 ను ఎత్తివేయాలని , ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరింది.
టీ.ఎస్.బీ-పాస్ క్రిందసమర్పించిన ధరఖాస్తులు గత రెండేళ్లుగా పెండింగ్ లో ఉండడం వల్ల ఎన్నో ప్రాజెక్టులు నిలిచి పోయాయని తెలిపింది. రాష్ట్రంలో ఆరు నెలల నుండి ఎన్విరాన్ మెంట్ కమిటీ లేదని, వెంటనే ఆ కమిటీని వేయాలని కోరింది.. భవన నిర్మాణాలకు తీసుకుంటున్న తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు యూనిట్ కు రూ.9 నుండి 14 రూపాయలకు పెంచారని దీనిని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని కోరింది. డిప్యూటీ సీఎంను కలిసిప్రతినిధి బృందంలో మేకా విజయ సాయి,కె. శ్రీధర్ రెడ్డి, కాళీ ప్రసాద్, దశరథ్ రెడ్డి, చలపతి రావు, భూపాల్ రెడ్డి, మారోజు శ్రీధర్ రావు, అశోక్, రామి రెడ్డి వెంకట్ రెడ్డి, కె.కె.రెడ్డి తదితరులున్నారు.