కట్టింది ప్రాజెక్టు కాదు..పేకమేడ: షర్మిల

కట్టింది ప్రాజెక్టు కాదు..పేకమేడ: షర్మిల
  • సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ధ్వజం


విధాత: కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగడంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజ్ పై డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు కేసీఆర్‌ మెగా అవినీతికి, మెగా సంస్థ పనితనానికి నిదర్శనమని విమర్శంచారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వందల ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండాల్సిన బ్యారేజ్‌లు కట్టిన నాలుగేళ్లకే ముక్కలైన ఘనత ప్రపంచలోనే మన మెగా కేసీఆర్ కే దక్కిందని షర్మిల ఎద్దేవా చేశారు. నా రక్తం, నా చెమట అని కల్లబొల్లి మాటలు చెప్పి కట్టింది ప్రాజెక్ట్ కాదు పేక మేడ అని బయట పడిందని, పేరు గొప్ప ఊరు దిబ్బ రీతిన దొరగారి కమీషన్ల కాళేశ్వరం దుస్థితి ఉందని విమర్శించారు.


తెలంగాణ ప్రజల సంపద 1.27 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం ఉద్ధరించినట్లు? అని నిలదీశారు. 80 వేల పుస్తకాలు చదివిన దొర మెగా ఇంజినీరింగ్ పనితనం ప్రపంచానికి తెలిసిందన్నారు. లోపాలు కళ్లముందు కొట్టొచ్చినట్లు కనపడుతుంటే.. దొర లక్ష కోట్ల దోపిడీ జనాలకు అర్థమైతుంటే.. బీటలు బారడం కామన్ అని, నెర్రెలు రావడం సహజమట అని మాట్లాడటం ఏమింటంటూ మండిపడ్డారు. ఇంతకాలం జనాలను కేసీఆర్‌ మభ్యపెట్టింది చాలని, తమరి దోపిడీ పాపం పండిందని, అవినీతికి కాలం చెల్లిందన్నారు. తిన్నదంతా కక్కించే దాకా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వెంటనే కేంద్రం ఒక దర్యాప్తు కమీషన్‌ను వేయాలని, జరిగిన అవినీతిపై విచారణ తక్షణం చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు.