Mahaboobnagar | కొంత మోదం.. మరికొంత ఖేదం! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ వర్గ పోరు
Mahaboobnagar కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటాపోటీ మరికొన్నింటిలో పోటీ లేని వైనం విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : కులాలు…కుమ్ములాటలు..వర్గ పోరు..ఆధిపత్య జోరు.. టికెట్ల లొల్లి..ఇవన్నీ కలగలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య పోటీ లేకున్నా మరికొన్నిoటీలో మాత్రం పోటీ త్రీవంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో […]

Mahaboobnagar
- కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటాపోటీ
- మరికొన్నింటిలో పోటీ లేని వైనం
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : కులాలు…కుమ్ములాటలు..వర్గ పోరు..ఆధిపత్య జోరు.. టికెట్ల లొల్లి..ఇవన్నీ కలగలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య పోటీ లేకున్నా మరికొన్నిoటీలో మాత్రం పోటీ త్రీవంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కుల ప్రాతిపదికన టికెట్ కేటాయించి గెలిచే స్థానాలను పోగొట్టుకుంది.
తమ వారికే టికెట్ ఇప్పించుకునేదుకు కొందరు నేతలు పట్టుబట్టి తప్పటడుగులు వేశారు. తమ పలుకుబడి తో టికెట్ ఇప్పిoచినా అభ్యర్థిని గెలుపు బాటలో నడిపించలేకపోయారు. ఇలా గత ఎన్నికల్లో కొన్ని స్థానాలు కాంగ్రెస్ కోల్పోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్ అయితే కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి టికెట్ల పంచాయతీ తప్పేటట్లు కనిపించడం లేదు.
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో.. కాంగ్రెస్ పార్టీ లో బలమైన నేతలు లేరు. మొదటి నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి ఉంది. ఎప్పుడు ఇతర ప్రాంతాల నేతలే ఇక్కడి కాంగ్రెస్ లో ఆధిపత్యం చేలాయించేవారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థి కి టికెట్ కేటాయించారు. తెలంగాణ లో కాలం చెల్లిన టీడీపీకి మహబూబ్ నగర్ లో ఓట్లు పడతాయని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకుందో ఏమో కానీ ఇక్కడ ఆ పార్టీని ఓటర్లు తిరస్కరించారు.
ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఒకప్పుడు వీరి ఓట్లు గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ కే పడేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి ఇక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీలో నేడు వినిపిస్తున్న పేర్లు రెండు మాత్రమే. మాజీ డీసీసీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్, బీసీ వర్గం నుంచి సంజీవ్ ముదిరాజ్ ఉన్నారు. వీరిద్దరూ బీఆరెస్ పార్టీ ని ఢీ కొనే స్థాయి లో లేరని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలమైన నేత కోసం వెతుకుతున్నారు.
నారాయణ పేట నియోజకవర్గం లో.. కాంగ్రెస్ పార్టీ కి కుంభం శివకుమార్ రెడ్డి ఒక్కరే పెద్ద దిక్కుగా ఉన్నారు. మరో నేత కనుచూపు మేరలో కూడా లేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో పార్టీ టికెట్ ఇవ్వకుండా పక్కన బెట్టింది. కుల సమీకరణలో భాగంగా ఈ స్థానం బీసీలకు కేటాయించడంతో మనస్తపం చెందిన శివకుమార్ రెడ్డి పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
దీంతో ఓట్లు చీలి కాంగ్రెస్ అభ్యర్థి సరాఫ్ కృష్ణ ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కన్నా శివకుమార్ రెడ్డికే అధిక శాతం ఓట్లు పడ్డాయి. ఇక్కడ శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉంటే గెలుపొందేవారు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ టికెట్ కు పోటీ లేదని తెలుస్తుంది.
దేవరకద్ర నియోజకవర్గం లో.. కాంగ్రెస్ పార్టీలో టికెట్ లొల్లి లేనట్లే. మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ అధ్యక్షులు గౌని మధుసూదన్ రెడ్డి ఈ నియోజకవర్గం నేత కావడంతో పార్టీ టికెట్ ఆయనకే వస్తుందని పార్టీ శ్రేణులు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశించే నేతలు కూడా ఎవ్వరూ లేకపోవడంతో మధుసూదన్ రెడ్డికి లైన్ క్లియర్ గా ఉందని తెలుస్తోంది.
మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లో బలమైన నేతలు లేరు. గతంలో చిట్టెం నర్సిరెడ్డి హయాంలో నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచు కోట గా ఉండేది.అయన మరణాంతరం పార్టీని నర్సిరెడ్డి కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పార్టీని నడిపించి ఎమ్మెల్యే గా ఎన్నికైన అనంతరం బీఆరెస్‌లో చేరారు.
అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పట్టించునే వారే కరువయ్యారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గ నాయకుడు వాకిటి శ్రీహరికి నారాయణ పేట డీసీసీ అధ్యక్షులుగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ బలం పుంజుకుంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ లేకపోవడంతో శ్రీహరి తనకే టికెట్ వస్తుందనే ధీమాలో ఉన్నారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అస్సలు కథంతా ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ లో ఇద్దరు ఉద్దండులు ఉన్నారు. ఒకరు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి. ఇక్కడ టికెట్ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధినాయకులకు తలనొప్పి తెప్పించే అవకాశం ఉంది.
నాగం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ప్రస్తుతం కూచుకుళ్ళ బీఆరెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తన కుమారుడు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డికి నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇప్పించాలనే ఉద్దేశంలో ఉన్నారు. రాజేశ్‌రెడ్డి గురువారం జూపల్లితో పాటు కాంగ్రెస్‌లో చేరారు. బర్నింగ్ లీడర్ గా పేరున్న నాగం కాంగ్రెస్ టికెట్ వదులుకునే ప్రసక్తే లేదని పట్టు బట్టే అవకాశం లేకపోలేదు. ఇద్దరు నేతల మధ్య టికెట్ పోరు తప్పడం లేదు.
జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ తప్పడం లేదనే వాదన వినిపిస్తోంది. జనుం అనిరుద్ రెడ్డి, చంద్ర శేఖర్ ( ఎర్ర శేఖర్ )మధ్య పోటీ త్రీవంగా ఉంది. ఎర్ర శేఖర్ గతంలో రెండు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇక్కడి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీ ని ముందుకు నడిపిస్తున్న అనిరుద్ రెడ్డి అసెంబ్లీ టికెట్ పోరులో ఉన్నారు. గత 20 రోజుల నుంచి నియోజకవర్గం లోని గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకమవుతున్నారు. ఇద్దరు నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గం లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ లో చేరడంతో కొల్లాపూర్ రాజకీయం మరింత వేడెక్కింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లో అలజడి రేగింది. నిన్నటిదాకా పార్టీ నే నమ్ముకుని నియోజకవర్గంలో పోటీ లేని నేతగా ఉన్న చింతలపల్లి జగదీశ్వర్ రావు జూపల్లి చేరికతో ఖంగుతిన్నారు.
జూపల్లి చేరికతో వీరిద్దరి మధ్య టికెట్ పోరు తప్పడం లేదు. వీరికి తోడు కాంగ్రెస్ సీనియర్ నేత మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ముగ్గురూ టికెట్ కోసం ఇప్పటి నుంచే ఎవరికీ వారు కార్యకర్తలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఎవ్వరూ ఆరాటపడడం లేదు. మాజీ మంత్రి జిలేల్ల చిన్నరెడ్డి కే టికెట్ ఖాయమని తెలుస్తోంది. ఇక్కడి కాంగ్రెస్ లో పోటీలో ఉండేందుకు మరో నేత లేకపోవడం చిన్నరెడ్డి కి కలిసి వస్తోంది.
గద్వాల నియోజకవర్గం లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉండేది. కాంగ్రెస్ నుంచి మంత్రి గా పనిచేసిన డీకే అరుణ బీజేపీ లో చేరింది. అప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ ను నడిపించే నాయకుడే కరువయ్యారు. ఇటీవల బీఆర్ ఎస్ జడ్పీ చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ప్రస్తుతం సరిత కు ఈ నియోజకవర్గం లో కాంగ్రెస్ నుంచి మరో నేత లేకపోవడం ప్లస్ అయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
అలంపూర్ నియోజకవర్గంలో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆ వర్గం నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కి ఒకే ఒక్కడుగా ఉన్నారు. గతంలో ఓసారి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఖాయమని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీచేసేందుకు మరో నేత లేరు.
అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కి మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఒక్కరే ఉన్నారు. ఈ నియోజకవర్గం కూడా ఎస్సీలకు రిజర్వు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో నాయకుడు లేకపోవడం వంశీకృష్ణ కు కలిసి వస్తుంది.
కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లో ఒకేఒక్కడు వంశీచంద్ రెడ్డి ఉన్నారు. గతంలో ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ లేదు. వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అండ పుష్కలంగా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని ప్రకటిస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కు పోటీ లేనేలేదు. కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి కి ఎదురులేదని పార్టీ శ్రేణులు అంటున్నారు. గతంలో ఆయనను ఓడించి తప్పు చేశామని ఇక్కడి నియోజకవర్గం ప్రజలు అభిప్రాయపడుతున్నారు.