Digital Twin | ఆపరేషన్‌ మీకు కాదు.. మీ డిజిటల్‌ ట్విన్‌కి..!

Digital Twin విధాత‌: పూర్వకాలం.. రాజులు భోం చేయడానికి ముందు దాని రుచి చూడటానికి ఒక ఉద్యోగి ఉండేవాడు. అతడు రుచి చూసి, ఆ వంటకం అంతా బాగానే ఉంది, దానివల్ల ఎటువంటి హాని లేదని నమ్మకం కుదిరాక రాజు భోజనం చేసేవాడు. ఇప్పుడు మనందరం కూడా అలాంటి రాజ సత్కారాలు పొందే రోజు దగ్గరలోనే ఉంది. అయితే.. ఇది తినే భోజనం విషయంలో కాదు.. వేసుకునే మందులకు. అక్కడ రాజు దగ్గర పనిచేసే ఉద్యోగి శాంపిల్‌ […]

Digital Twin | ఆపరేషన్‌ మీకు కాదు.. మీ డిజిటల్‌ ట్విన్‌కి..!

Digital Twin

విధాత‌: పూర్వకాలం.. రాజులు భోం చేయడానికి ముందు దాని రుచి చూడటానికి ఒక ఉద్యోగి ఉండేవాడు. అతడు రుచి చూసి, ఆ వంటకం అంతా బాగానే ఉంది, దానివల్ల ఎటువంటి హాని లేదని నమ్మకం కుదిరాక రాజు భోజనం చేసేవాడు. ఇప్పుడు మనందరం కూడా అలాంటి రాజ సత్కారాలు పొందే రోజు దగ్గరలోనే ఉంది. అయితే.. ఇది తినే భోజనం విషయంలో కాదు.. వేసుకునే మందులకు.

అక్కడ రాజు దగ్గర పనిచేసే ఉద్యోగి శాంపిల్‌ టెస్ట్‌ చేస్తే… ఇక్కడ మీరే.. అంటే మీ వర్చువల్‌ కాపీ ఈ మందులను టెస్ట్ చేస్తుందన్నమాట. కృత్రిమ మేధస్సు శక్తితో, డిజిటల్ కవలలు ప్రివెంటివ్ హెల్త్‌కేర్, ఇతర చికిత్సలలో విప్లవాత్మక మార్పులు తేనున్నాయి.

ఒక మెడిసిన్‌ వేసుకున్నప్పుడు సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావడం సహజం. అది మార్కెట్‌ లోకి రాకముందే మనపై ఏ రకంగా పనిచేస్తుందో తెలుసుకోవడం అవసరం. ఇందుకోసం సాధాణంగా జంతువులపై, ఆపై మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేస్తుంటారు.

కానీ ఇప్పుడు ప్రతీ మెడిసిన్‌, ప్రతీ చికిత్స మీకు అందించే ముందు మీపైనే ప్రయోగం చేయబడుతుంది.. ఇదేంటి బాబోయ్‌! అని టెన్షన్‌ పడకండి. మీపైన.. అంటే మీరు కాదు… మీ డిజిటల్‌ ట్విన్‌. మీలాగే ఉండే మీ వర్చువల్‌ కవల. అచ్చం.. జీన్స్‌ సినిమాలో వైష్ణవి పాత్ర లాగా అన్నమాట.

ఇంకా వివరంగా చెప్పాలంటే.. మీ వర్చువల్‌ ట్విన్‌ మీ కంటే ముందు మీరు వేసుకోవాల్సిన మెడిసిన్‌ వేసుకుంటుంది. మీకంటే ముందు మీ వర్చువల్‌ ట్విన్‌ ఆపరేషన్‌ చేయించుకుంటుంది.

కొత్త ప్రొసిజర్‌ వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీని ఉపయోగించి సర్జికల్‌ టీమ్‌ డైరెక్ట్‌ గా మీకు ఆ చికిత్సను అందించడానికి ముందు మీతో మ్యాచ్‌ అయిన మీ వర్చువల్‌ కాపీ పై డ్రై రన్‌ చేస్తే ఇంకా కంఫర్టబుల్‌ గా ఉంటుంది కదా! రాబోయే వైద్య ప్రక్రియ గురించి మీరు మరింత ప్రాక్టికల్‌ గా తెలుసుకున్న తరువాత దాన్ని తీసుకోవచ్చు.

అందుకే హెల్త్‌ కేర్‌ రంగంలో ఉపయోగించి ప్రొసిజర్లను ఈ వర్చువల్‌ ట్విన్‌ పై ఉపయోగించిన తర్వాత అవసరమైతే వాటిని రీషేప్‌ చేయడానికి, ఇంకా అనేక అంశాల్లో ఈ డిజిటల్‌ ట్విన్స్‌ ఉపయోగపడుతాయి.

బ్రెయిన్‌ కి కూడా కాపీ!

డిజిటల్‌ ట్విన్స్‌ వైద్య రంగంలో ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ‘‘వర్చువల్ యు: హౌ బిల్డింగ్ యువర్ డిజిటల్ ట్విన్ విల్ రివల్యూషన్ మెడిసిన్ అండ్ చేంజ్ యువర్ లైఫ్’’ పేరుతో ఓ పుస్తకాన్ని రచించారు పీటర్ కోవెనీ, రోజర్ హైఫీల్డ్. వాళ్లు ఇందులో మెడికల్‌ డిజిటల్‌ ట్విన్స్‌ గురించి వాళ్లు సమగ్రమైన సమాచారం అందించారు. రోగుల గుండెలకు సంబంధించిన డిజిటల్‌ ట్విన్స్‌ డాక్టర్లకు చికిత్సను మరింత సులభం ఎలా చేయగలవో వాళ్లు వివరించారు.

గుండెకు సంబంధించి టెస్ట్‌ చేసిన థెరపీలు ఎలా పనిచేయగలవో దగ్గరి నుంచి పరిశీలించడానికి ఇవి ఉపయోగపడ్డాయి. బార్సిలోనాకు చెందిన ‘మారె నోస్ట్రమ్‌’ అనే సూపర్‌ కంప్యూటర్‌ పేషెంటు నిజమైన గుండెకు వర్చువల్‌ కాపీని సరిగ్గా సపోర్టు చేయగలదు. ట్రీట్‌ మెంట్ల పరీక్షలే కాకుండా, డ్రగ్స్‌, ఇంప్లాంట్స్‌.. ఇలా వేటికైనా ఈ డిజిటల్‌ ట్విన్‌ హార్ట్స్‌ ఉపయోగపడుతాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి గురించి పరిశోధనలు జరుగుతున్నాయి.

వర్చువల్‌ కణాలు, కణజాలాలు, అవయవాలను రూపొందించే ప్రయత్నం వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకురానుంది. ఇప్పటివరకూ డాక్టర్లు తమ రోగుల క్లినికల్‌ హిస్టరీ తీసుకుని, శారీరకంగా పరీక్షించి, వారి లాంటి రోగ పరిస్థితులే ఉన్నవాళ్లకు ఆ చికిత్స ఎలా పనిచేసిందనే దాన్ని ఆధారం చేసుకుని.. మాత్రమే సరైన చికిత్సా విధానాన్ని ఎన్నుకుంటున్నారు.

కానీ డిజిటల్‌ ట్విన్‌ రావడం వల్ల ఆయా చికిత్సలు సరిగ్గా వాళ్ల మీద ఎలా పనిచేస్తాయనేది చాలా కచ్చితంగా అంచనా వేసేందుకు వీలుంటుంది. వ్యక్తిగతమైన, పేషెంట్‌ సెంట్రిక్‌ చికిత్సలు అందించేందుకు అవకాశం కలుగుతుంది. దీనివల్ల జంతువులపై క్లినికల్‌ ట్రయల్స్‌ పేరిట జరిగే హింస కూడా తగ్గిపోతుంది.

వాస్తవానికి, డిజిటల్ ట్వినింగ్ అనేది గుండె కోసం మాత్రమే కాదు… ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణ వ్యవస్థ.. ఇలా వివిధ రకాల అవయవాలను డిజిటల్‌గా కాపీ తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాదు, అత్యంత సంక్లిష్టమైన అవయవమైన మానవ మెదడు కూడా డిజిటల్‌ ట్విన్నింగ్‌ ద్వారా కాపీ చేయడం సాధ్యమవుతుందనీ, దీని ద్వారా మూర్ఛ వ్యాధి లాంటి వాటికి కూడా శస్త్రచికిత్స సులువవుతుందినీ కోవెనీ మరియు హైఫీల్డ్ తమ పుస్తకంలో వివరించారు.

ఇంకా… ఏఐ ట్విన్స్‌ చేసే పనులేంటంటే..

వ్యక్తిగత వైద్యం : ఏఐ ద్వారా నడిచే డిజిటల్‌ ట్విన్‌ ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, ఆరోగ్య సమస్యలను అంచనా వేయడానికి కూడా సహాయపడుతుంది. ఒక పేషెంట్‌ డిజిటల్‌ ట్విన్‌ నుంచి సేకరించిన డేటా పర్సనలైజ్‌ డ్‌ హెల్త్‌ కేర్‌ అందించడానికి హెల్ప్‌ చేస్తుంది. సరైన చికిత్సలను ఎంచుకోవడానికి తోడ్పడుతుంది.

పిల్లల ఎదుగుదలలో ఆలస్యాన్ని తొందరగా గుర్తించడం : చిన్న వయసులోనే పిల్లల్లో ఎదుగుదలలో జరిగే ఆలస్యాన్ని తొందరగా గుర్తించడానికి ఈ ఏఐ ట్విన్‌ సహాయపడుతుంది. అవసరమైన సపోర్టు సకాలంలో అందించేందుకు ఉపయోగపడుతుంది. విద్య – నైపుణ్యం : విభిన్న వాతావరణాలు మరియు పరిస్థితులను అనుకరించడానికి ఏఐ ద్వారా రూపొందిన కవలలను ఉపయోగించవచ్చు.

అంటే వివిధ రకాల స్కిల్స్‌ ను అభ్యసించడానికి సేఫ్‌ గా, అందుకు అనుగుణమైన వాతావరణం ఉండేలా చేస్తుంది. నైపుణ్య సాధనలో ఒక వ్యక్తి ప్రత్యేక శైలి ఎలా ఉంటుందో, ఏ వాతావరణంలో సరైన విధంగా అభ్యాసం చేయగలుగుతాడో.. అందుకు అనుగుణమైన వాతావరణం ఏర్పరుస్తుందన్న మాట.

మానసిక ఆరోగ్యానికి సపోర్ట్‌ : ఒక వ్యక్తిలో భావోద్వేగ పరిస్థితి ఏ రకంగా ఉందో మానిటర్‌ చేయగలుగుతుంది. అవసరమైన వ్యక్తిగత మానసిక సపోర్టును ఇస్తుంది. మానసిక సమస్యలను తొందరగా గుర్తించి, సకాలంలో అవసరమైన చికిత్స అందించేందుకు వీలుకల్పిస్తుంది.