కొలువుల భర్తీ.. అటకెక్కింది!
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలన నిరుద్యోగులకు మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. నిధులు, నియామకాలు, నీళ్లు అన్న ఉద్యమ ట్యాగ్‌లైన్‌లో నియామకాల అంశంపై నిరుద్యోగులు

- విద్యార్థులు, నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ
- 80 వేల పోస్టుల భర్తీకి సీఎం ప్రకటన
- నోటిఫికేషన్ల దశ నుంచీ గందరగోళమే
- ప్రతి నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కిందే!
- గ్రూప్ -1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దు
- గ్రూప్-2 పరీక్ష రెండుసార్లు వాయిదా
- గ్రూప్-3 పరీక్షలకు తేదీలే రాలేదు
- గ్రూప్-4 జరిగినా.. ఆగిన ఫలితాలు
- పలు పరీక్షలు రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ
- ఎన్నికల కోడ్ వచ్చే నాటికి భర్తీ సున్నా!
విధాత : సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలన నిరుద్యోగులకు మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. నిధులు, నియామకాలు, నీళ్లు అన్న ఉద్యమ ట్యాగ్‌లైన్‌లో నియామకాల అంశంపై నిరుద్యోగులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ప్రత్యేక రాష్ట్రంలో తమ ఆశలు నెరవేరుతాయని ఆశించినా.. అవి అడియాసలే అయ్యాయని పలువురు విద్యార్థి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఇటీవల జారీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని కండ్లకు కడుతున్నాయని అంటున్నారు. ప్రభుత్వం 80వేల కొలువుల భర్తీకి సిద్ధమవడంతో దానికోసం ఇప్పటిదాకా ఆశగా ఎదురుచూసిన నిరుద్యోగులు.. కూలీనాలి పనులు, అప్పులు చేసి, అమ్మల పుస్తెలు కుదువపెట్టి, ఉద్యోగాల కోసం దీక్షతో సన్నద్ధమయ్యారు. లక్షలాది నిరుద్యోగ యువత.. ప్రభుత్వం ప్రకటించిన ప్రతి నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొని, అప్పులు చేసి మరీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. ప్రభుత్వ చర్యలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రకటించిన పోస్టులు భర్తీ చేయక, ఇచ్చిన నోటిఫికేషన్లు సక్రమంగా అమలు చేయక విద్యార్థులతో జీవితాలతో కేసీఆర్ సర్కార్ చెలగాటమాడిందని పలువురు నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ జారీ చేసిన దాదాపు అన్ని నోటిఫికేషన్లు.. కోర్టు మెట్లు ఎక్కిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కోర్టు కేసులతో ఉద్యోగాల భర్తీ జరగక అన్ని పెండింగ్‌లో పడ్డాయని, ఒక్కో నోటిఫికేషన్‌ది ఒక్కో వ్యథ అని వాపోతున్నారు.
80వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ప్రకటన
2022, మార్చి 9న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ 80 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన లెక్కలు చెప్పారు. సర్కార్ 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నదని నిరుద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ 2023, అక్టోబర్ 9న మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి భర్తీ అయిన ఉద్యోగాలు గుండు సున్నా.
పోటీ పరీక్షలది అదే తీరు
పోటీ పరీక్షలు కూడా రద్దు కావడమో వాయిదాపడటమో జరుగుతూ వచ్చింది. ఇప్పటికే గ్రూప్ -1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దయింది. గ్రూప్-2 రాతపరీక్ష రెండుసార్లు వాయిదా పడింది. ఇక గ్రూప్-3 రాతపరీక్షలకు ఇంకా తేదీలను ప్రకటించనేలేదు. ఈ నోటిఫికేషన్ జారీ చేసి దాదాపు 10 నెలలు కావొస్తున్నది. గ్రూప్-4 పరీక్ష పూర్తయింది.. తుది కీ వెలువడింది.. కానీ కోర్టు కేసుల కారణంగా ఫలితాల విడుదల కాలేదు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి 10 నెలలు అవుతున్నప్పటికీ.. ఇంకా పరీక్ష తేదీలను ప్రకటించలేదు. డీఏవో పరీక్ష కూడా రద్దు అయింది. మళ్లీ కొత్త తేదీని ఇవ్వలేదు. గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీ అని రెండేండ్ల పాటు హంగామా సృష్టించింది. మొత్తానికి గురుకుల పరీక్షలు పూర్తయ్యాయి. ఎడిట్ ఆప్షన్ పేరుతో 40 రోజులుగా కాలయాపన జరుగుతున్నది. పోలీసు నియామక పరీక్షల తుది ఫలితాలు వెలువడ్డాయి. సివిల్ విభాగంలో ఫలితాలు తప్పుగా ఉన్నాయని, మళ్లీ ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు ఇటీవలే తీర్పు వెల్లడించింది.
5వేల పోస్టులతోనే గురుకుల నోటిఫికేషన్
ఎంతో ఆశగా ఎదురుచూసిన బీఈడీ, డీఈడీ అభ్యర్థులకు సర్కారు ప్రకటనతో నెత్తిన పిడుగు పడినట్టయ్యింది. 15 వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తారని ఎదురు చూస్తే.. చివరకు 5 వేల పోస్టులకు నోటిఫికేషన్‌తో సరిపెట్టారు. ఈ పోస్టులకే 5 లక్షల మంది పోటీ పడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో కొన్ని క్యాటగిరీలకు పోస్టులే లేవు. మొత్తానికి నోటిఫికేషన్లు జారీ చేసి, 40 లక్షల మంది అభ్యర్థుల వద్ద ఫీజులు వసూలు చేశారు. కానీ.. కానీ ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేసీఆర్ ప్రకటన.. ఇలా చివరకు ఎన్నికల కోడ్‌తో అటకెక్కిపోయింది.