Kavitha| తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలి: కవిత

Kavitha| తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలి: కవిత

విధాత : తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కవిత కలిశారు. తీన్మార్ మల్లన్న తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై కమిటీ ఆన్ ఎథిక్స్ కు రెఫర్ చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు ఛైర్మన్ కు వినతి పత్రం సమర్పించారు. శాసనమండలి ఛైర్మన్ తో భేటీ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్ధం కాలేదన్నారు. తాను మల్లన్నను విమర్శించలేదని… అయినా ఆయన తనపై ఎందుకు నోరుపారేసుకున్నారో అర్ధం కాలేదన్నారు.

ఈ వ్యాఖ్యలపై ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన జాగృతి సంస్థ కార్యకర్తలపై కాల్పులు జరుపుతారా అని ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అరెస్టులు చేస్తున్న ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. ఒక మహిళ ప్రశ్నిస్తే తట్టుకోలేరా అని ఆమె అడిగారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నను అరెస్ట్ చేయకపోతే సీఎంను కూడా అనుమానించాల్సి వస్తోందని ఆమె అన్నారు. మల్లన్న వ్యాఖ్యలపై రాష్ట్ర, కేంద్ర మహిళా కమిషన్లకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.