3వేలకు పైనే మరణాలు
కొత్తగా 3.86లక్షల మందికి పాజిటివ్ దిల్లీ: కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయానికి యావత్ భారతావని చిగురుటాకులా వణికిపోతోంది. చాపకింద నీరులా దేశం నలుమూలలకు విస్తరించిన కొవిడ్.. లక్షల మందిపై ప్రతాపం చూపిస్తోంది. నిత్యం వేల మందిని బలితీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన గణాంకాలు వైరస్ ఉద్ధృతిని కళ్లకు కడుతున్నాయి. తాజాగా మరో 3.86లక్షల మంది కొవిడ్ బారినపడగా.. వరుసగా మూడో రోజు 3వేల మందికి పైనే మృత్యువాతపడ్డారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం […]

కొత్తగా 3.86లక్షల మందికి పాజిటివ్
దిల్లీ: కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయానికి యావత్ భారతావని చిగురుటాకులా వణికిపోతోంది. చాపకింద నీరులా దేశం నలుమూలలకు విస్తరించిన కొవిడ్.. లక్షల మందిపై ప్రతాపం చూపిస్తోంది. నిత్యం వేల మందిని బలితీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన గణాంకాలు వైరస్ ఉద్ధృతిని కళ్లకు కడుతున్నాయి. తాజాగా మరో 3.86లక్షల మంది కొవిడ్ బారినపడగా.. వరుసగా మూడో రోజు 3వేల మందికి పైనే మృత్యువాతపడ్డారు.
- గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 19,20,107 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 3,86,452 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.87కోట్లకు చేరింది.
- ఇదే సమయంలో మరో 3,498 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 2,08,330 మంది వైరస్‌తో మరణించారు. మరణాల రేటు 1.11.శాతానికి చేరింది.
- అయితే కొత్త కేసులతో పాటు వైరస్ నుంచి కోలుకునేవారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,97,540 మంది కరోనాను జయించగా.. ఇప్పటివరకు 1.53కోట్ల మంది వైరస్ నుంచి క్షేమంగా బయటపడ్డారు. రికవరీ రేటు 81.99శాతంగా ఉంది.
- ఇక రోజువారీ కేసులు పెరుగుతుండటంతో దేశంలో యాక్టివ్ కేసులు 31 లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31,70,228 క్రియాశీల కేసులుండగా.. ఈ రేటు 16.90శాతంగా ఉంది.
- దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. గురువారం మరో 22లక్షల మందికి పైనే వ్యాక్సిన్ తీసుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15.22కోట్ల మందికి టీకాలు ఇచ్చారు.
కొవిడ్ గుప్పిట్లో రాష్ట్రాలు..
కొవిడ్ మహమ్మారితో మహారాష్ట్ర వణుకుతోంది. నిన్న అక్కడ 66వేలకు పైన కొత్త కేసులు, 771 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళ, కర్ణాటక, ఉత్తప్రదేశ్, దిల్లీల్లో అత్యధిక రోజువారీ కేసులు వెలుగుచూస్తున్నాయి. కేరళలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 38,607 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 35వేల కేసులు.. 270 మరణాలు నమోదయ్యాయి. దిల్లీలో గడిచిన 24 గంటల్లో 24వేలకు పైగా కొత్తగా కరోనా బారినపడగా.. 395 మంది మృత్యువాతపడ్డారు..