పలు రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు!
విధాత:కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే దేశం ఊపిరిపీల్చుకొంటున్న తరుణంలో డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది. రోజుకో కొత్త రాష్ట్రానికి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో తొలి కేసు నమోదైంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 52 కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ ముప్పునకు ఈ రకమే కారణమయ్యే అవకాశం ఉందంటోన్న నిపుణుల హెచ్చరికలతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మరోసారి కఠిన ఆంక్షలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నాయి. రాజస్థాన్‌లో తొలి […]

విధాత:కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే దేశం ఊపిరిపీల్చుకొంటున్న తరుణంలో డెల్టా ప్లస్ వేరియంట్ కలవరపెడుతోంది. రోజుకో కొత్త రాష్ట్రానికి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో తొలి కేసు నమోదైంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 52 కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ ముప్పునకు ఈ రకమే కారణమయ్యే అవకాశం ఉందంటోన్న నిపుణుల హెచ్చరికలతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మరోసారి కఠిన ఆంక్షలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నాయి.
రాజస్థాన్‌లో తొలి కేసు నమోదు
రాజస్థాన్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి కేసు నమోదైంది. బికనేర్‌లోని 65 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఓపీ చాహర్ వెల్లడించారు. ఆమెకు ఇంతకుముందే వైరస్ సోకగా.. పూర్తిగా కోలుకున్నారని, రెండు డోసుల టీకా కూడా తీసుకున్నట్టు వివరించారు. మే 30న ఆమె శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా.. డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు.
తమిళనాట తొలి మరణం
కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌తో తమిళనాడులో తొలి మరణం నమోదైంది. మదురైకి చెందిన ఓ వ్యక్తి డెల్టా ప్లస్ స్ట్రెయిన్‌తో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఎమ్‌ఏ సుబ్రమణియన్ ధ్రువీకరించారు. రోగి మరణించిన తరువాత నమూనాలను సేకరించి పరీక్షించగా డెల్టా ప్లస్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్లు చెప్పారు.
జమ్మూలో అతిపెద్ద ధాన్యపు మార్కెట్ మూత
డెల్టా ప్లస్ రకం ఆందోళన నేపథ్యంలో జమ్మూలోని అతి పెద్ద ధాన్యం మార్కెట్ మూతపడింది. జమ్మూలో తొలి కేసు నమోదు కావడంతో స్థానిక వర్తకుల సమాఖ్య స్వచ్ఛందంగానే వీకెండ్ లాక్‌డౌన్ పాటించాలని నిర్ణయించింది. జమ్మూ సహా ఎనిమిది జిల్లాల్లో వీకెండ్ లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ఈ నెల 20న వెల్లడించినప్పటికీ.. జమ్మూకశ్మీర్‌లో డెల్టా ప్లస్ తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే నెహ్రూ మార్కెట్, ఆసియా చౌక్, విక్రమ్ చౌక్‌లలో దుకాణాలన్నీ మూసివేశారు. రానున్న మూడు వారాల్లో వీకెండ్ లాక్‌డౌన్ పాటించాలని నిర్ణయించినట్టు వర్తకుల ఫెడరేషన్ అధ్యక్షుడు దీపక్‌గుప్తా వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లో 8కి చేరిన కేసులు
మధ్యప్రదేశ్‌లో డెల్టాప్లస్ రకం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ విషయాన్ని వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ వెల్లడించారు. మే నెలలో ఇద్దరు మృతిచెందినట్టు తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది కేసులు తమ దృష్టికి వచ్చాయని, టెస్టింగ్‌లను పెంచినట్టు చెప్పారు. డెల్టా ప్లస్ బారిన పడిన రోగుల కాంటాక్ట్ ట్రేసింగ్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎవరినీ గుర్తించలేదన్నారు. భోపాల్‌లో జీనోమ్‌సీక్వెన్సింగ్ కోసం ఓ ల్యాబరేటరీ ఏర్పాటు చేయాలని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నిర్ణయించారన్నారు. వేర్వేరు మ్యుటేషన్ల బారిన పడుతున్నవారిని త్వరగా గుర్తించేలా ఒక జీనోమ్ సీక్వెన్సింగ్ యంత్రం భోపాల్‌లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు.