Banakacherla Project| బనకచర్ల ప్రాజెక్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్‌తో సరి!
అన్ని అనుమతులు వచ్చి, పనులు ప్రారంభించే సమయంలో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు కీలకం. ఇవి ప్రాజెక్టు మొత్తం వ్యయంలో దాదాపు 30 శాతం వరకూ ఉంటాయి. టెండర్లు ఖరారైతే.. 30 శాతం సొమ్ము కాంట్రాక్ట్ సంస్థకు అందుతాయి. ఇప్పటికే ఆంధ్ర మేధావులు.. ఇది కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు అని ఆరోపణలు చేస్తున్నారు. ఈ కోణంలో చూస్తే.. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు, దాని కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టాలనుకుంటున్నారా? అనే అనుమానాలను సాగునీటి రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Banakacherla Project| హైదరాబాద్, ఆగస్ట్ 1 (విధాత): బనకచర్ల లింకేజ్ ప్రాజెక్ట్! దీని వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఒనగూరేదేమీ లేదని అక్కడి మేధావులే మొత్తుకుంటున్నారు. అది బడా కాంట్రాక్టర్ మదిలో ఉద్భవించిన ఆలోచనగా చెబుతున్నారు. అది మరో కాళేశ్వరం తరహాలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న లింకు కెనాల్స్ అభివృద్ధి చేసుకుంటే అంతకు మించిన ప్రయోజనాలు ఉంటాయని నీటిపారుల రంగ నిపుణులు కూడా స్పష్టంచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు అవసరం లేదని, శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లు రాయలసీమకు సరిపోతాయన్న ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఆగస్ట్ 4 నుంచి 6వ తేదీ వరకు ఆయా ప్రాజెక్ట్‌ల పర్యటనకు వెళుతున్నట్లు ఆంధ్ర మేధావులు ప్రకటించారు. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకే వెళ్లాలని చూస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌర సమాజం, మేధావులు వద్దంటున్న ప్రాజెక్టును చేపట్టడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఏ ప్రాజెక్టు చేపట్టాల్సి వచ్చినా.. అన్ని అనుమతులు వచ్చి, పనులు ప్రారంభించే సమయంలో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు కీలకం. ఇవి ప్రాజెక్టు మొత్తం వ్యయంలో దాదాపు 30 శాతం వరకూ ఉంటాయి. ఒకసారి టెండర్లు ఖరారైతే.. ఈ 30 శాతం సొమ్ము సదరు కాంట్రాక్ట్ సంస్థకు అందుతాయి. ఇప్పటికే ఆంధ్ర మేధావులు.. ఇది కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు అని ఆరోపణలు చేస్తున్నారు. ఈ కోణంలో చూస్తే.. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు, దాని కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టాలనుకుంటున్నారా? అనే అనుమానాలను సాగునీటి రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ల కోసమే భారీ ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారన్న అనుమానాలను సాగునీటి రంగ నిపుణులు, విశ్లేషకులు నైనాల గోవర్దన్ వ్యక్తం చేశారు. దీనిని బలపరిచే విధంగానే ప్రభుత్వ అడుగులు కనిపిస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అభిప్రాయపడ్డారు.
అవసరం లేకపోయినా భారీ ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారంటే అనుమానించాల్సిందేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో వైఎస్ హయాంలో భారీ ఎత్తున మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల వ్యవహారాలను గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వైఎస్ చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమాన్ని నాటి ప్రతిపక్ష టీడీపీ ధనయజ్ఞంగా అభివర్ణించింది. దీనిలో లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించిందని చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ కూడా అదే మార్గంలో వెళుతున్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన రూ.1.86 లక్షల కోట్ల ప్రాజెక్టులలో భారీ ఎత్తున మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు సంబంధిత కాంట్రాక్ట్ సంస్థలు తీసుకున్నా.. సరిగ్గా పనులు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల పనులు ప్రారంభించిన దాఖలు కూడా లేవని చెబుతున్నారు. ఆ పేరుతో నిధులు దారి మళ్లించారనే ఆరోపణలు వెలువడ్డాయి. జలయజ్ఞం ప్రాజెక్ట్‌లను కాగ్ కూడా తప్పుపట్టింది. ఆనాడు మేఘా సంస్థపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. కాగ్ కూడా ఆక్షింతలు వేసింది. 2007/08 కాలంలో ఒక్క హంద్రీ నీవా ప్రాజెక్ట్ లోనే రూ. 500 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినట్లు నివేదికల్లోనే ఉంది.
భారీ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు 1980 నుంచి అమల్లో ఉన్నాయి. ప్రాజెక్ట్‌కు కావాల్సిన యంత్రాలను కాంట్రాక్టర్లు కొనుగోలు చేయడానికి, మానవ వనరులు సమకూర్చుకోవడానికి, క్యాంపు నిర్మాణం, తదితర అవసరమైన ప్రారంభ ఖర్చుల కోసం ప్రభుత్వం ముందస్తుగా నిధులు కాంట్రాక్ట్ సంస్థకు ఇస్తూ వస్తున్నది. అయితే.. ఉమ్మడి ఏపీలో వైఎస్ పాలన కాలంలో ఈ మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ప్రభుత్వం కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను దుర్వినియోగం చేసినట్లు తరువాత వచ్చిన ప్రభుత్వం చేపట్టిన విచారణలో వెలుగులోకి వచ్చింది.
వైఎస్ ప్రభుత్వం నాడు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు.. నేడు అదే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తున్నదని ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 2014-15లో చంద్రబాబు ప్రభుత్వం ట్రాన్స్ట్రాయ్ మరో రెండు కంపెనీల కన్సార్షియానికి రూ. 200 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది. అలాగే మొబిలైజేషన్ ఆఫ్ అడ్వాన్స్ ఇంట్రెస్ట్ కింద రూ.84.43 కోట్లు, పవర్ ప్రాజెక్ట్ సెగ్మెంట్లో అడ్వాన్స్ కింద రూ.787 కోట్లు, ఇతర సందర్భాలలో రూ.144.22 కోట్లు, మొత్తంగా రూ.2,346. 85 కోట్లు ఎక్కువగా చెల్లింపులు చేసినట్లు నిపుణుల కమిటీ నాడు తేల్చింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. నవయుగ కంపెనీకి అడ్వాన్స్ గా ఇచ్చిన రూ.780 కోట్లను రికవరీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. కాగ్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం నవయుగ కంపెనీ నుంచి రూ.428.98 కోట్లు ఇంకా రికవరీ కాలేదని స్పష్టమవుతున్నది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా బనకచర్ల ప్రాజెక్ట్ పై మొండిగా ముందుకు వెళుతున్న తీరు కూడా మొబిలైజేషన్ పేర దండుకోవడానికే అన్న అనుమానాలను ఆంధ్రా ప్రముఖుడొకరు వ్యక్తం చేశారు. వైఎస్ జలయజ్ఞాన్ని తీవ్రంగా వ్యతిరేకించి లక్ష కోట్ల దోపిడీ అని ప్రచారం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్ట్‌లో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాయలసీమకు అవసరం లేని ఈ ప్రాజెక్ట్‌ను భారీగా చేపట్టడంలో ఉద్దేశం ఇదేనని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాలన్న ఉద్దేశం కన్నా ముందుగానే 30 శాతం అడ్వాన్స్ తీసుకుంటే భారీగా లబ్ధిపొందవచ్చుననే ఆలోచనే ఎక్కవగా ఉన్నట్లు కనిపిస్తోందన్న సందేహాలను ఆయన వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ వద్ద, ఆ తర్వాత టీడీపీ హయాంలో చంద్రబాబు వద్ద ఒక బడా కాంట్రాక్టర్ ప్రతిపాదనలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు తెప్పించే బాధ్యత కూడా తానే తీసుకుంటానని చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇది కూడా కొనసాగించే ప్రాజెక్టు కాదని, మొబిలైజేషన్ అడ్వాన్స్లతోనే ఆగిపోయేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 30 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ నుంచి అధికార పక్షం 10 శాతం, ప్రతిపక్ష పార్టీ 5 శాతం పంచుకుంటాయని, మిగిలినది కాంట్రాక్ట్ సంస్థ ఉంచుకుంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా తట్టెడు మట్టి పోయకుండా సుమారు 15వేల కోట్లు కొల్లగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నంగా సాగునీటి నిపుణులు ఈ ప్రాజెక్టును అభివర్ణిస్తున్నారు. ఆ తర్వాత కూడా ప్రాజెక్టుపై కేసులు దాఖలైనా.. తమకేమీ నష్టం ఉండదనే ఆలోచనగా ఈ వ్యవహారం కనిపిస్తున్నదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖుడొకరు అనుమానం వ్యక్తం చేశారు.