Bhu Bharathi । భూ యజమానికి భరోసా కంప్యూటరా? కాగితమా? నిపుణులేమంటున్నారు?

కాగితాలపైన వివరాలుంటే ట్యాంపరింగ్‌కు అవకాశం ఉంటుందని, లంచగొండితనం పెరుగుతుందని, అందుకే మాన్యువల్ రికార్డులు కాకుండా కంప్యూటర్ రికార్డులే మేలనేవారూ ఉన్నారు. వాస్తవంగా దేశవ్యాప్తంగా భూమి రికార్డుల కంప్యూటరీకరణ జరిగింది. అయితే మాన్యువల్ రికార్డులు కూడా నిర్వహిస్తున్నారు. రైతుల భూమి వివరాలు కంప్యూటర్‌లో ఉన్నా పట్టాదార్ పాస్ పుస్తకం ఇస్తేనే తన వద్ద భూమి భద్రంగా ఉందని రైతు భరోసాతో ఉంటాడని ప్రముఖ న్యాయవాది, భూమి చట్టాల నిపుణుడు భూమి సునీల్ చెప్పారు.

Bhu Bharathi । భూ యజమానికి భరోసా కంప్యూటరా? కాగితమా? నిపుణులేమంటున్నారు?

(తిప్పన కోటిరెడ్డి)
Bhu Bharathi । ఇప్పుడు కంప్యూటర్ (computer) యుగం నడుస్తోంది… కానీ ప్రతి రైతు, ప్రతి భూ యజమానికి తన భూమి హక్కుల రికార్డ్.. కాగితం రూపంలోనే కావాలని కోరుకుంటున్నాడు. పేపర్‌లెస్‌ (paperless) చేయాలంటున్న పాలకులు కానీ, కంప్యూటర్ నిష్ణాతులు కానీ, పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీల అధిపతులు కానీ తమ భూముల విషయానికి వచ్చే వరకు కాగితాన్నే నమ్ముకుంటున్నారు. కంప్యూటర్ ప్రింట్ తీసిన స్టాంప్ పేపర్ (stamp paper) పైన రిజిస్ట్రేషన్ చేసి అధికారి మాన్యువల్‌గా సంతకం చేసి ఇస్తేనే తీసుకుంటున్నాడు.. దానికే మార్కెట్‌లో చెల్లుబాటు ఉంది. కానీ కంప్యూటర్‌లో వివరాలున్నాయని చెపితే ఎవరూ వాటిని విశ్వసించరు. పైగా సబ్ రిజిస్ట్రార్‌ (sub-registrar) కూడా కంప్యూటర్‌ను చూసి రిజిస్ట్రేషన్ చేయడు. ఇదీ ప్రస్తుతం మార్కెట్‌లో కాగితానికి ఉన్నవిలువ. ఒక డాక్యుమెంట్‌ను ప్రింట్ తీస్తే దానిపై సెస్పిమన్ కాపీ అని వస్తుంది కానీ ఒరిజనల్‌గా చూపించడం లేదు. కంప్యూటర్‌ నుంచి తీసిన ప్రింట్ కాగితంపై అధికారి సంతం ఉంటేనే దానికి విలువ. అందుకే రికార్డులన్నీ కంప్యూటరీకరించినా భూమి డాక్యుమెంట్ ఫిజికల్‌(physical)గా ఉంటేనే రైతు కానీ, భూమి యజమాని గానీ తన భూమిపై తనకు హక్కు సంక్రమించిందని నమ్ముతాడు. అందుకే భూమి వివరాలను కంప్యూటరీకరించినా రైతులకు, భూ యజమానులకు ఫిజికల్ కాపీ ఇస్తున్నారు.

భూమికి శిస్తు (land tax) వసూలు చేసే కాలం నుంచి భూమి దస్తావేజులు అమలులోకి వచ్చాయి. శిస్తు వసూలు చేసే తాసిల్దార్లు (tahsildars) గ్రామ గ్రామానికి వెళ్లి, రికార్డు తయారు చేసి, శిస్తు వసూలు చేసేవారు. దీని కోసం ప్రతి ఏటా జమాబందీ నిర్వహించే వారు. దీంతో రెవెన్యూ వ్యవస్థనే (revenue system) ప్రజల వద్దకు వెళ్లేది. భూమి శిస్తు వసూలు చేసినంత కాలం ప్రతి ఏటా అధికారులు గ్రామాలకు వెళ్లే వారు.. ఏ భూమి ఎవరు కొన్నారు? ఎవరు అమ్మారు? ఏ కుటుంబంలో అన్నదమ్ములు వేరు కాపురం పెట్టారు? వారసత్వ భూమిని ఏవిధంగా పంచుకున్నారు? వీటన్నింటినీ పరిశీలించి, గ్రామంలోనే విచారించి, రికార్డు తయారు చేసేవారు. వీటిని పాస్ పుస్తకం, భూ యజమాన్య హక్కు పత్రం రూపంలో రైతుకు అందించే వారు. ఇదంతా క్రమ పద్ధతిలో జరిగేది. తెలంగాణలో భూమి అంతా నవాబులు(Nawabs), దేశ్‌ముఖ్‌లు(Deshmukhs), జమీందార్లు (Zamindars), పటేల్, పట్వారీల చేతుల్లోనే ఉండేది. అలా వేళ్లూనుకున్న భూస్వామ్య వ్యవస్థపై తెలంగాణ రైతులు సాయుధ పోరాటం (Telangana armed struggle) చేసి గ్రామాలకు గ్రామాలనే విముక్తం చేసుకున్నారు. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పంచింది. ఈ భూమి అంతా రైతుల చేతుల్లోనే ఉంది. ఆ తరువాత వచ్చిన నక్సల్ పోరాటం కూడా లక్షల ఎకరాల భూములు పంచింది. 1971లో పీవీ నరసింహారావు తీసుకు వచ్చిన భూ సంస్కరణల చట్టం (Land Reforms Act) తెలంగాణలో జరిగిన భూ పోరాటాల ఫలితంగా రైతుల చేతుల్లోకి వచ్చిన భూములకు యజమాన్య హక్కులు లభించే విధంగా చేసింది.

రైతు హక్కు పత్రాల రికార్డులను నాటి పట్వారీలు రూపొందించే వారు. పట్వారీ వ్యవస్థ బలంగా ఉండేది. అయితే.. కారణాలు ఏమిటన్నది పక్కన పెడితే దివంగత ఎన్టీరామారావు (N.T. Rama Rao) ముఖ్యమంత్రి అయిన తరువాత ‘దేవుడిచ్చిన భూమికి శిస్తు ఏమిటి బ్రదర్?’ అని భూమి శిస్తును రద్దు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా గ్రామాలవారీగా పంటలు వచ్చే సమయంలో జరిగే జమాబందీ జరగలేదు. తెలంగాణ భూమి రికార్డులపైన పడిన మొదటి దెబ్బ అది. ఆ తరువాత రైతులు, భూ యజమానులు కోలుకోలేని రీతిలో ధరణి రూపంలో దెబ్బ పడిందని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అన్నారు. ప్రతి ఏటా గ్రామాలకు అధికారులే వెళ్లి భూమి రికార్డులు రాస్తే ప్రస్తుత రికార్డులలో ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడేవి కావని ఆయన తెలిపారు. కంప్యూటరీకరణ పెరిగిన తరువాత రికార్డులను కంప్యూరీకరించినప్పటికీ మాన్యువల్ రికార్డ్ ఉండాలని న్యాయ నిపుణులు (Legal experts) అంటున్నారు. రికార్డులలో వివరాలను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసేది మనుషులేనని, కంప్యూటర్ పొందుపరిచిన వివరాలకు ఆధారం కాగితాలేనని అంటున్నారు. కాగితాల (రికార్డ్)లో ఉన్న వివరాలే కంప్యూటరీకరణకు ఆధారమైనప్పడు… ఆ బేస్ రికార్డ్ లేకుండా చేస్తే నష్టపోయేది రైతులేనని చెపుతున్నారు.

కాగితాలపైన వివరాలుంటే ట్యాంపరింగ్‌కు అవకాశం ఉంటుందని, లంచగొండితనం పెరుగుతుందని, అందుకే మాన్యువల్ రికార్డులు కాకుండా కంప్యూటర్ రికార్డులే మేలనేవారూ ఉన్నారు. వాస్తవంగా దేశవ్యాప్తంగా భూమి రికార్డుల కంప్యూటరీకరణ (computerization) జరిగింది. అయితే మాన్యువల్ రికార్డులు కూడా నిర్వహిస్తున్నారు. రైతుల భూమి వివరాలు కంప్యూటర్‌లో ఉన్నా పట్టాదార్ పాస్ పుస్తకం ఇస్తేనే తన వద్ద భూమి భద్రంగా ఉందని రైతు భరోసాతో ఉంటాడని ప్రముఖ న్యాయవాది, భూమి చట్టాల నిపుణుడు భూమి సునీల్ (Bhumi Sunil) చెప్పారు. కంప్యూటర్ అనేది ఒక టూల్ మాత్రమేనని, దానిని మనం ఎలా వినియోగిస్తే అలా ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు. ఈ కాలంలో కంప్యూటర్ కోర్స్ చదువుకున్న ఇంజినీర్ కూడా తన పట్టా సర్టిఫికెట్‌ను కాగితం రూపంలో అందుకోక పోతే తనకు పట్టా వచ్చిందనే భావనలో ఉండడని వ్యాఖ్యానించారు. మనం కంప్యూటర్‌లో ఏది లోడ్ చేస్తే అదే వస్తుందని, అలాంటప్పుడు కంప్యూటర్ ఆపరేటర్లు తప్పులు లోడ్ చేస్తే తప్పులే వస్తాయి కానీ వాషింగ్ మిషన్‌లో మాసిన బట్టలు వేస్తే ఉతికి ఆరవేసి వచ్చినట్లుగా రికార్డులు స రి చేసి రావన్న విషయాన్ని కంప్యూటర్ గురించి చెప్పే పెద్దలు గుర్తించాలని అంటారు. పేదల అధికారిగా గుర్తింపుపొందిన దివంగత ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ (IAS officer SR Sankaran) చనిపోయే ముందు కూడా అన్న మాట ఏమిటంటే అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో సగటు రైతుకు తన భూమి భద్రంగా ఉంది అని నమ్మకం కావాలన్నా, తన రికార్డు చూసుకోవాలన్నా కాగితాన్నే నమ్ముతాడని చెప్పారని సునీల్ తెలిపారు. అయితే రికార్డుల కంప్యూటరీకరణ జరగాలి. సెల్ ఫోన్‌లో కూడా కో ఆర్డినేట్స్ చూసుకునేలా అభివృద్ధి చేయాలి. ఇప్పటికే కర్ణాటక ఆ దిశగా భూమి రికార్డులను అభివృద్ధి చేసింది. కర్ణాటకలో ఒక భూమి వద్ద నిలబడితే ఆ భూమి ఏ సర్వే నంబర్‌లో ఉన్నదో కూడా తెలియజేసే యాప్‌ను డెవలప్ చేశారు. అయినప్పటికీ మాన్యువల్ రికార్డుకు ఎక్కువ విలువ ఇస్తారని సునీల్ తెలిపారు. మాన్యువల్ రికార్డ్ ఉంటేనే భద్రత కూడా ఉంటుందన్నారు. భూమి రికార్డ్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంతోపాటు హార్డ్ కాపీ ఉంటేనే ఎక్కడైనా తప్పులు జరిగితే రుజువు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెపుతున్నారు.