Kannepalli water lift Debate | కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీళ్లు ఎత్తిపోస్తే నష్టమేంటి! కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే?

కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద నీటిని ఎత్తిపోసేంత నీటి మట్టంతో గోదావరి వరద నీరు ప్రవహిస్తున్నది. ఒకవైపు రైతులు పొలాలకు నీళ్లు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ప్రభుత్వం కన్నెపల్లి పంప్‌ హౌస్‌ నుంచి నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు? కాళేశ్వరం నీళ్లిస్తే.. కేటీఆర్‌ రాజకీయ మైలేజ్‌ వస్తుందనేనా?

Kannepalli water lift Debate | కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీళ్లు ఎత్తిపోస్తే నష్టమేంటి! కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే?

Kannepalli water lift Debate |  హైదరాబాద్‌, జూలై 18 (విధాత): గోదావరికి వరద పోటెత్తుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద సుమారు 97 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తున్నది. అక్కడ 94 మీటర్లకు చేరుకుంటే సులభంగా ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. ఒకవైపు వర్షాలు లేక కాలం వెనక్కుపోయింది. ఈ తరుణంలో రైతాంగం గోదావరి నీటికోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నా రేవంత్‌ రెడ్డి సర్కార్‌ మాత్రం అందుకు సిద్ధపడకపోవడం అనేక సందేహాలకు తావిస్తున్నది. కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలు, బరాజ్‌లు దెబ్బతినడం పక్కన పెడితే.. అవకాశం ఉన్న మేరకు నీళ్లు ఎత్తిపోసుకునే మార్గం ఉంది. ఒకవైపు రైతాంగానికి నీటి అవసరం ఉన్నప్పటికీ, కన్నెపల్లి మోటర్లను నడిపి, నీళ్లు ఎత్తిపోసుకుని, రిజర్వాయర్లకు మళ్లించుకునేందుకు అన్ని రకాల వ్యవస్థలు వినియోగంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ఊసెత్తకపోవడం విస్మయానికి గురి చేస్తున్నదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ప్రభుత్వ ప్రాధమ్యాల్లో రైతాంగం లేరా? అని నిలదీస్తున్నారు. తెలంగాణలో 42 శాతం వర్షపాతం లోటు ఉన్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోసే విషయంలో కనీస స్పష్టతను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కన్నెపల్లి నుంచి వాటర్ ఎప్పుడైనా లిఫ్ట్ చేసుకోవచ్చా

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కన్నెపల్లి పంప్ హౌస్‌ వద్ద గోదావరి నది 94 మీటర్ల ఎత్తున ప్రవహించే సమయంలో నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు 97 మీటర్ల వద్ద నదీ ప్రవాహం ఉన్నది. అంతేకాదు.. గోదావరి నది కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ఒరుసుకొనే పారుతున్నది. ఇక గోదావరిలో నీటి ప్రవాహం తగ్గినా.. రబ్బర్ డ్యామ్ ద్వారా అడ్డుకట్ట వేసి పంప్ హౌస్‌లోకి నీటిని మళ్లించుకుని లిఫ్ట్‌ చేయగల సదుపాయం కూడా ఉంది. వీటన్నింటినీ ఉపయోగించుకుని తమకు నీళ్లు ఇవ్వాలని పరివాహక ప్రాంత రైతాంగం విజ్ఞప్తులు చేస్తున్నది. అదే సమయంలో ఈ వ్యవస్థకు అనుసంధానమై ఉన్న చెరువులు, రిజర్వాయర్లను నింపుకొంటే.. రానున్న రోజుల్లో వర్షపాతం లోటునే చూపించినా.. తాగునీటికి సైతం ఢోకా ఉండదనే అభిప్రాయాన్ని రిటైర్డ్‌ ఇంజినీర్లు వెలిబుచ్చుతున్నారు. వృథాగా నీటిని కిందికి వదిలివేసే బదులు రిజర్వాయర్లు నింపుకోవడం తెలివైన ప్రభుత్వ లక్షణం అవుతుందని వారు పేర్కొంటున్నారు.

మేడిగడ్డ నుంచి దిగువకు 275 టీఎంసీలు

ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు మేడిగడ్డ నుంచి 275 టీఎంసీల నీరు కిందికి వెళ్లిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఒక్క రోజే రికార్డు స్థాయిలో సుమారు 1.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లింది. మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగడంతో ఇందులో నీటిని నిల్వ చేస్తే అది పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరించిందన్న విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అందుకే గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత ఉన్న లక్ష్మీ బరాజ్‌ (మేడిగడ్డ) నుంచి వరద నీటిని వచ్చినవి వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల విషయంలోనూ డిజైన్ లోపాలున్నాయని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక పేర్కొంటున్నది. వీటిని కూడా నీటితో నింపవద్దనేది ఆ రిపోర్ట్ సూచించింది. దీంతో మేడిగడ్డకు వస్తున్న వరదను లిఫ్ట్ చేయడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

వరద నీటిని లిఫ్ట్ చేస్తే నష్టమా?

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను నీటితో నింపితే ప్రమాదమని ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చెబుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. వీటిని నీటితో నింపితే దిగువన ఉన్న 44 గ్రామాలతో పాటు భద్రాచలం టౌన్‌కు కూడా ఇబ్బందేనని ఈ నివేదిక చెబుతోందనేది మంత్రి వాదన. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎమ్మెల్సీ కోదండరామ్ మండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెబుతూ.. సుందిళ్ల, అన్నారం బరాజ్‌లకు నష్టం లేదని చెప్పడాన్ని బీఆరెస్‌ నాయకులు ప్రస్తావిస్తున్నారు. శాసనమండలిలో ఒకరకంగా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో మరోరకంగా మాట్లాడారని విమర్శలు చేస్తున్నారు. వరద నీరు సముద్రంలోకి వెళ్లకుండా ప్రాజెక్టులు, చెరువులు నింపుకొనే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక పేరుతో వరద నీటిని వృథాగా వదిలేయడంతో నష్టపోతున్నామని గోదావరి పరివాహక ప్రాంత రైతులు ఆవేదన చెందుతున్నారు.

కాళేశ్వరం కింద 45 వేల ఎకరాల ఆయకట్టే

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఈ వానకాలం సీజన్‌లో 45 వేల ఎకరాలకు మాత్రమే ప్రతిపాదించడం కూడా చర్చకు దారి తీసింది. స్టేట్ లెవల్ కమిటీ ఫర్ ఇరిగేటేడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌ (SCIWAM) సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా, మైనర్ ఇరిగేషన్ కింద 38,76 లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం నుంచి 250 కిలోమీటర్ల దూరంలో సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం రావి చెరువుకు కూడా నీళ్లిచ్చామని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన కారణంగా నీటిని నింపకుండా వదిలివేయడంతో కాళేశ్వరం ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కాళేశ్వరం కింద 18 లక్షలు, ఎస్ ఆర్ ఎస్ పీ సహా ఇతర ప్రాజెక్టుల కింద మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలనేది కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కింద చుక్క నీరు ఉపయోగించకుండానే గత సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును తమ ప్రచారానికి బీఆర్ఎస్ వాడుకుందనేది హస్తం పార్టీ విమర్శ. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా.. నీటి అవసరం ఉన్న వేళ జల రాజకీయాలేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఔట్‌ఫ్లోలు లేని ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరును నింపుకొనేందుకు ఇది మంచి అవకాశమని రైతు సంఘం నాయకుడొకరు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నీళ్లు ఇస్తే కేసీఆర్‌కు క్రెడిట్‌ వెళుతుందనే కక్షతో నీళ్లు ఆపుతున్నారా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఏ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందనే రైతులు చూస్తారే కానీ.. దాన్ని ఎవరు కట్టారనేదానితో నిమిత్తం ఉండదని పేర్కొంటున్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా భేషజాలకు పోకుండా రైతులకు నీళ్లు అందించేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.