Loan Waiver | కాంగ్రెస్ ప్రభుత్వంపై వేగంగా వ్యతిరేకత!.. అనుకూలంగా మార్చుకునే యత్నాల్లో బీఆరెస్!
రైతు కోపం పాలకులకు శాపం. ఏ ఎన్నిక చూసినా రైతుల ఆగ్రహంతోనే ఆయా పార్టీలు ఓడిపోయాయని స్పష్టం అవుతున్నది. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి కారణం రైతులే. చంద్రబాబు వ్యవసాయం దండుగ అన్నాడన్న ప్రచారం ఆయనను నిట్టనిలువునా ముంచింది. అలిపిరిలో మావోయిస్టుల దాడికి గురైన సానుభూతి కూడా నాడు ఏమాత్రం పని చేయలేదు. ఆ ఎన్నికల్లో రైతు కేంద్రంగా ఎజెండాను రూపొందించి ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

- రైతుల కోపానికి పడిపోయిన గత ప్రభుత్వాలు
- హైటెక్ చంద్రబాబుకూ తప్పని శాపాలు
- రైతు అంశాలపై గెలిచి.. అవే అంశాలతో ఓడిన కేసీఆర్
- గత అనుభవాలను పట్టించుకోని రేవంత్ సర్కార్
- ఎవరికివారే అన్న తీరుగా కాంగ్రెస్ మంత్రుల స్టేట్‌మెంట్లు
- రెండు లక్షలపైన రుణాల మాఫీ సంగతేంటి?
(విధాత ప్రత్యేకం)
Loan Waiver । రైతు కోపం పాలకులకు శాపం. ఏ ఎన్నిక చూసినా రైతుల ఆగ్రహంతోనే ఆయా పార్టీలు ఓడిపోయాయని స్పష్టం అవుతున్నది. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి కారణం రైతులే. చంద్రబాబు వ్యవసాయం దండుగ అన్నాడన్న ప్రచారం ఆయనను నిట్టనిలువునా ముంచింది. అలిపిరిలో మావోయిస్టుల దాడికి గురైన సానుభూతి కూడా నాడు ఏమాత్రం పని చేయలేదు. ఆ ఎన్నికల్లో రైతు కేంద్రంగా ఎజెండాను రూపొందించి ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రైతులకు ఉచిత కరెంటు నినాదంతో ముందుకు వచ్చిన రాజశేఖర్ రెడ్డి గెలిచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. హైటెక్ సీఎంగా నాడు పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఘోరంగా ఓటమి పాలయ్యారు. నాటి నుంచి నేటి వరకు వరుసగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌తో ఉద్యమించిన కేసీఆర్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు జరిగిన అన్యాయలనే ప్రధాన అంశంగా ఎంచుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే టాగ్‌లైన్‌తో ఉద్యమించారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అధికారంలోకి వచ్చారు. రైతుబంధు అమలుతో పాటు, భూముల విషయంలో రైతులకు జరుగుతున్న అన్యాయాలను ఏకరువు పెట్టిన కేసీఆర్ మాటలను విశ్వసించిన ప్రజలు రెండవ సారి అధికారం అప్పగించారు. అయితే భూ యజమాన్య హక్కుల విషయంలో ధరణిలో జరిగిన అన్యాయాలను రెక్టిఫై చేయడానికి కేసీఆర్ ఇష్టం చూపక పోవడమే 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణమైంది.
ధరణిపై విమర్శలు పెడచెవిన పెట్టి దెబ్బతిన్న కేసీఆర్
కేసీఆర్ తాను అధికారంలో ఉండగా ధరణి తప్పులపై సీఎంవోలో ఉన్న కీలక అధికారులు ఒకరిద్దరు కానీ, సహచర మంత్రులు కానీ చెప్పిన మాటలు నాడు కేసీఆర్ పెడచెవిన పెట్టారనే వాదన ఉన్నది. కొందరు మంత్రులు, అధికారులు కేసీఆర్‌కు విషయం విడమర్చి చెప్పడానికి ప్రయత్నించగా.. వారి మొఖం పట్టుకొని ‘మీ వద్దకు కానీ, సచివాలయానికి కానీ పైరవీకారులే వస్తారు.. వాళ్లు చెప్పినవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ మారు మాట మాట్లాడనీయకుండా పంపించాడన్న ప్రచారం కూడా ఉంది. పైగా రైతులకు ఎలాంటి సమస్యలు లేవని తెగేసి చెప్పారంట! కేసీఆర్ రైతులను పట్టించుకోవడం లేదు.. ఎవరి మాట వినడం లేదు… రైతు బంధు పేరుతో డబ్బులు పంచి గెలువచ్చని అనుకుంటున్నాడు.. అందుకే దళిత బందు, బీసీ బంధుల పేరుతో మన డబ్బులే ఎన్నికల కోసం మనకు పంచుతున్నాడని ప్రజల్లో ఊపందుకున్న ప్రచారం నాడు బీఆరెస్ కొంప ముంచింది.
ధరణి కేంద్రంగా నాడు రేవంత్ రెడ్డి ఉద్యమం
ధరణిపై మడమ తిప్పేది లేదని సీతయ్యలా కూర్చుకున్న కేసీఆర్‌పై, బీఆరెస్ ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఉద్యమం చేపట్టారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతానని ప్రకటించారు. రైతు భరోసా, కౌలు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరాకు 15,000, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రూ 2 లక్షల రుణమాఫీని ప్రకటించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేత రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయించారు. ఈ డిక్లరేషన్‌పై ఆనాడు ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణ గ్రామీణ ప్రజలు కేసీఆర్ ఏ మాట చెప్పినా నమ్మలేదు. రైతులు, కూలీలు, గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం గట్టారు. సీఎంగా రేవంత్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టారు. అయితే రైతుల కోసం ఇచ్చిన ఏ వాగ్దానం కూడా పూర్తి స్థాయిలో నెరవేరక పోవడంతో 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత క్రమంగా వేళ్లూనుకుంటున్నదనే చర్చ నడుస్తున్నది. ఈ వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చక ముందే మేలుకొంటే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచిందన్న అభిప్రాయం విమర్శకుల నుంచి వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై వేగంగా వ్యతిరేకత!
బీఆరెస్ పార్టీ పై కానీ, కేసీఆర్ పై కానీ సానుకూలత రాలేదు కానీ కాంగ్రెస్‌పై వ్యతిరేక మాత్రం చాలా వేగంగా వచ్చిందని 30 ఏళ్లకు పైగా రాజకీయాలను సునిశితంగా పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అన్నారు. వెనుకటికి ఒకాయన పిలిచి పిల్లనిస్తే.. కులం తక్కువన్నాడన్న సామెత తీరుగా కాంగ్రెస్ నాయకుల పాలన తీరు ఉందని ఒక పెద్దాయన వ్యాఖ్యానించాడు. ఏ రైతులైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారో.. తిరిగి ఆ రైతులకే ఏమీ చేయలేక.. మంత్రులు, నాయకులు ఎవరికి వారే.. యమునా తీరే అన్న తీరుగా ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. ఎన్నికలకు ముందు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఎక్కడా కుటుంబంలో ఒక్కరికేననే నిబంధన పెట్టలేదు. రైతుకు ఎంత రుణం ఉన్నా. అందులో తాము రెండు లక్షలు మాత్రమే మాఫీ చేస్తామన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా రూ.2 లక్షల రుణమాఫీ అయ్యాక ఆ పైన ఉన్న రుణాలకు షెడ్యూల్ ప్రకటిస్తామని గాంధీ భవన్‌లో 2024 సెప్టెంబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ ముఖ్యమంత్రి ప్రకటనకు భిన్నంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ లోనే రుణమాఫీ అయిపోయిందని, రెండు లక్షలకు పైగా ఉన్న వాళ్లకు తాము రుణమాఫీ చేయడం లేదని తేల్చి చెప్పేశారు. ఎంత రుణం ఉన్నా రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు కేంద్రంగా కాకుండా కుటుంబంలో ఒక్కరికన్న నిబంధన పెట్టింది. దీంతో పెళ్లిళ్లు అయి వేరు కాపురం పెట్టిన వాళ్లను కూడా ఒకే కుటుంబం కింద కలిపి రుణమాఫీ చేయడం లేదన్న విమర్శలు గ్రామ స్థాయిలోనే వ్యక్తమవుతున్నది. మరో వైపు అక్షరాల్లో ఉన్న తప్పులను టెక్నికల్ కారణాలు చూపించి మాఫీ చేయడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు రైతు భరోసాను పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్న వాదనలు కూడా ఉన్నాయి. వెరసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చుతున్నది.
అనుకూలంగా మార్చుకునే యత్నాల్లో బీఆరెస్
ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాన్ని బీఆరెస్ చేపట్టింది. అందుకే రైతు కేంద్రంగా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం బీఆరెస్ చేస్తున్నది. ప్రతిపక్షం చేసే విమర్శలు, ఆరోపణలలో నిజం ఎంతుందో పరిశీలించి, వాటిని సరి చేసుకుంటే ప్రతిపక్షానికి అవకాశం లేకుండా చేయానికి ప్రభుత్వానికి ఆస్కారం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు ఇందుకు విరుద్దంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్న పరిస్థితిపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఎవరి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ మంత్రుల్లో సమన్వయ లేమి కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. అసెంబ్లీలో ముఖ్యమంత్రినో లేక మరొక మంత్రినో ప్రతిపక్షం ఇరుకున పెట్టినట్లు మాట్లాడితే.. ఇంకొక మంత్రి సదరు ప్రతిపక్ష ఎమ్మెల్యే కలువగానే బాగా మాట్లాడవన్న సంకేతాన్ని తెలియజేసేలా చంకలు గుద్దుకుంటూ వెళ్లాడాన్ని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఒకరిద్దరు చూసి ముక్కున వేలేసుకున్నారని తెలిసింది. అదే విధంగా ఏదైనా ఒక సమస్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శ చేసినా, ముఖ్యమంత్రిపై విమర్శలు, ఆరోపణలు చేసినా మిగతా మంత్రులు తమకెందుకులే అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం లేదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధికారం ఇస్తే కాపాడు కోవడం రాదని, అందుకే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారని, ఒక్క మాట మీద నిలబడి విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేక పోతున్నారన్న అభిప్రాయం కూడా ఉన్నది. అందుకే చేసినవి కూడా చెప్పుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అన్నారు.
భూభారతిపై కాంగ్రెస్ మీనమేషాలు
ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ప్రకటించి, దాని స్థానంలో భూ భారతి చట్టాన్ని చేసిన పాలకులు.. తీరా దాన్ని అమల్లోకి తెచ్చే విషయంలో మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారు. రైతు రుణమాఫీ అమలులో లోపాలు, రైతు భరోసా అమలు కాకపోవడంతో పాటు ధరణి అలాగే ఉండటం కూడా రైతుల ఆగ్రహానికి కారణమవుతోందని అంటున్నారు. దీనిని సరి చేసుకొని ముందుకు పోవాల్సిన సర్కారు, ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నదని చెబుతున్నారు. రైతులకు ఆగ్రహాన్ని తెప్పించే స్టేట్‌మెంట్ల ద్వారా విపక్షాలకు మరింత అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఇస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీన్ని సరి చేసుకోకుంటే రైతుల ఆగ్రహం అనే చారిత్రక శాపానికి గురికావడం ఖాయమన్న భావన కూడా ఏర్పడుతోంది.