Bhu Bharathi | ధరణిలో లేనిది… భూ భారతిలో ఉన్నది ఇదే…

ధరణి చట్టంలో లాగా రైతులను కోర్టుల చుట్టూ తిప్పి ఆర్థికంగా సంక్షోభం లోకి నెట్టడానికి విరుద్దంగా అసలు రైతులు కోర్టుకే వెళ్లాల్సిన అవసరం లేకుండా అధికారుల వద్దనే సమస్య పరిష్కారం అయ్యే వ్యవస్థను భూ భారతి చట్టం ద్వారా ఏర్పాటు చేస్తోందని రెవెన్యూ అధికారి ఒకరు చెప్పారు.

Bhu Bharathi | ధరణిలో లేనిది… భూ భారతిలో ఉన్నది ఇదే…

(తిప్పన కోటిరెడ్డి)
ఎవరైనా రోగం వస్తే డాక్టర్ వద్దకు వెళతారు. ఒక డాక్టర్ ఇచ్చిన మందు తగ్గకపోతే ఇంకో డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకుంటారు. ఇలా ఒక మనిషికి ఏదైనా జబ్బు చేస్తే ఒకరిద్దరు డాక్టర్ల వద్దకు వెళతారు. పరీక్షలు చేయించుకొని మందులు వాడతారు. రోగం నయం అయ్యేలా చేసుకుంటారు. కానీ ఒక డాక్ట‌ర్‌ వద్దకు వెళ్లి రోగం నయం అయినా కాకపోయినా అక్కడే ఉండి చావమని ఎవరు చెప్పరు. ఇది సహజ న్యాయ సూత్రం. దీనినే భూమికి అన్వయించి పరిశీలిస్తే.. ఒక రైతు తన భూమికి సమస్య వస్తే ముందుగా వీఆర్వోను అడుగుతాడు. అక్కడ కాకపోతే తాసిల్దార్ ద‌గ్గ‌ర‌కు వెళ‌తాడు. అక్కడా ప‌ని కాకపోతే ఆర్డీవోను క‌లుస్తాడు. ఆ పైన కలెక్టర్ ను కలుస్తాడు.. ఇలా అధికారులను కలిసి పని చేయించుకునే అవకాశాన్ని చూస్తాడు.. ఇది తరతరాలు భూమి సమస్యలపై అమలులో ఉన్న సహజ న్యాయ సూత్రం.

కానీ 2020లో బీఆరెస్ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకు వచ్చిన ధరణి చట్టం ఈ సహజ న్యాయ సూత్రానికి విరుద్దంగా ఉన్నది. రైతు తన భూమికి సమస్య వస్తే… డాక్టర్ లాంటి తాసిల్దార్‌కు కాకుండా కంప్యూటర్‌లో వెయ్యి రూపాయ‌లు ఫీజు చెల్లించి ద‌రఖాస్తు చేసుకోమని చెప్పింది. అయితే ఈ కంప్యూటర్ స‌ద‌రు రైతు సమస్యను పరిష్కరించలేక పోయింది. దీంతో తన భూమి సమస్యను ఎవరు పరిష్కరిస్తారో కూడా అర్థం కానీ పరిస్థితి ఎదురైంది. ధరణి చట్టం రాక ముందు 99 శాతం భూమి రికార్డులు కరెక్టుగా ఉన్నాయని నాటి బీఆరెస్ సర్కారు చెప్పింది. కానీ ధరణిలో తమ భూమి సమస్యలు వచ్చాయని ఏకరువు పెడుతూ దాదాపు 20 లక్షల మంది ద‌రఖాస్తు చేసుకున్నారు. ఇంతే కాదు.. ధరణిలో 18 లక్షల ఎకరాల భూమి.. హక్కుల రికార్డ్‌కు ఎక్కలేదు. ఇలా నాడు ధరణి.. భూమి సమస్యల పుట్టగా త‌యారై కూర్చున్న‌ది.

ధ‌ర‌ణిలో ప‌రిష్కారాలేవి?

భూమి సమస్యలకు పరిష్కారం చూపించే వ్యవస్థ ధరణిలో లేక పోవడం గమనార్హం. చట్టంలోనే సమస్యల పరిష్కారానికి అవకాశం లేక పోవడంతో దాదాపు 9 లక్షల పైచిలుకు సాదాబైనామా ద‌ఖాస్తులు అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. ఇవే కాదు.. చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు కూడా అలాగే ఉండిపోయాయి. క్షేత్ర స్థాయిలో పరిష్కార వ్యవస్థ లేకపోవడం తోపాటు.. గ్రామస్థాయిలో ఫీల్ఢ్ ఇన్‌స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇచ్చే అధికారులు కూడా లేకుండా పోయారు. ధరణి చట్టంతో పాటే నాటి బీఆర్ఎస్ సర్కారు వీఆర్వో వ్యవస్థను అబాలిష్ చేస్తూ చట్టం తీసుకు వచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో భూముల పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో భూమి సంబంధమైన సమస్యలన్నీ అలాగే పెండింగ్‌లోనే ప‌డి ఉన్నాయి. దీంతో అనేక మంది రైతులు భూమి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కోర్టు, హైకోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దశలో ఎవరికైనా భూమి సమస్య వస్తే సివిల్ కోర్టులో తేల్చుకోవాలని అసెంబ్లీలోనే చెప్పడం గమనార్హం.

ధరణి చట్టంలోనే సమస్యల పరిష్కరించడానికి తాసిల్దార్ల‌కు, ఆర్డీవోల‌కు ఎలాంటి అధికారాలు లేని పరిస్థితి. జిల్లా కలెక్టర్లు దరఖాస్తులను పరిశీలించినప్పటికీ చట్టంలో మాత్రం కలెక్టర్లకు కూడా పరిష్కరించే అధికారం లేదు. ధరణిపై నాటి కాంగ్రెస్ నేత, నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నది. నాడు కలెక్టర్లకు కానీ, సీసీఎల్ఏకు కానీ పరిష్కరించే అవకాశం లేక పోవడంతో సాదాబైనామా దరఖాస్తులన్నీ పెండింగ్ పెట్టారని భూమి చట్టాల నిపుణులు సునీల్ కుమార్ తెలిపారు. భూమి సమస్యలను పరిష్కరించే కొత్త చ‌ట్టాన్ని తీసుకు వచ్చి… స్థానికంగానే రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వ్యవస్థను ఏర్పాటు చేస్తామ‌ని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఈ మేరకు ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తీసుకు వచ్చింది.

ధ‌ర‌ణిలో లేనిది.. భూభార‌తిలో ఉన్న‌ది ఇదే..

ధరణికి పూర్తి విరుద్దంగా భూ భారతి చట్టం ఉందని న్యాయ నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులపై ఎలాంటి నమ్మకం లేదని ధరణి చట్టం తీసుకురావడం ద్వారా నాటి సర్కారు చెప్పిందని, దీంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టం అధికారాలను వికేంద్రీకరణ చేసి, క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కరించే విధంగా చేసిందని రైతు నేత ఒకరు అన్నారు. భూ భారతి చట్టంలో ధరణి కారణంగా పేరుకు పోయిన 20, 30 రకాల సమస్యలను తాసిల్దార్, ఆర్డీవో, అడిషన్ కలెక్టర్ పరిష్కరించే విధంగా సెక్షన్, 5, 6 ప్రకారం కల్పించారని ఒక సీనియర్ రెవెన్యూ అధికారి తెలిపారు. వర్కింగ్ రూల్స్‌లో ఏ అధికారి ఏ సమస్యలను పరిష్కరిస్తారో తెలియజేస్తారన్నారు. ఇవి కాకుండా భూ భారతి చట్టం ప్రకారం జరిగే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియకు సంబంధించి 5,6 సెక్షన్ల ప్రకారం తాసీల్దార్లకు, 6,8 సెక్షన్ల ప్రకారం ఆర్డీవోల‌కు అధికారం ఉంటుంద‌ని భూమి సునీల్ చెప్పారు.

అయితే ఏ ఒక్క రైతు అయినా తన భూమి సమస్య లేదా వివాదంపైన తాపిల్దార్ ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సదరు రైతు పై అధికారికి అప్పీల్‌కు వెళ్ల వచ్చు. ఈ మేరకు అప్పీల్ కు వెళ్లే అవకాశం భూ భారతి చట్టంలో కల్పించింది. అలాగే ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాలపై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు.. ఆపైన ట్రిబ్యునల్ కు వెళ్ల వచ్చు… ఇలా ఆయా సమస్యల పరిష్కారంలో ఎక్కడైనా ఒక చోట తప్పు జరిగితే మరోచోట సరిచేసే అవకాశాన్ని కూడా భూ భారతి చట్టం కల్పించింది. ధరణి చట్టంలో లాగా రైతులను కోర్టుల చుట్టూ తిప్పి ఆర్థికంగా సంక్షోభం లోకి నెట్టడానికి విరుద్దంగా అసలు రైతులు కోర్టుకే వెళ్లాల్సిన అవసరం లేకుండా అధికారుల వద్దనే సమస్య పరిష్కారం అయ్యే వ్యవస్థను భూ భారతి చట్టం ద్వారా ఏర్పాటు చేస్తోందని రెవెన్యూ అధికారి ఒకరు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నదని ఒక సీనియర్ అధికారి అన్నారు. అయితే ఏ సమస్య అయినా తమ వద్దనే పరిష్కరిస్తామని భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వం చెపుతోందని న్యాయ నిపుణులు ఒకరు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Bhu Bharathi । భూ యజమానికి భరోసా కంప్యూటరా? కాగితమా? నిపుణులేమంటున్నారు?

Bhu Bharathi । భూ యజమానికి భరోసా కంప్యూటరా? కాగితమా? నిపుణులేమంటున్నారు?