Telangana Politics | పొలిటికల్‌ గేమ్‌ ప్లాన్స్‌.. స్థానిక ఎన్నికల కోసమేనా?

కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు అంకురార్ప‌ణ జ‌రిగిన నాటి నుంచి.. ఇప్ప‌టి వర‌కు కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉన్న‌ది. కేంద్రం ఎలాంటి అనుమ‌తులు ఇవ్వ‌కుండానే ప‌నులు మొద‌లు పెట్టారా?

Telangana Politics | పొలిటికల్‌ గేమ్‌ ప్లాన్స్‌.. స్థానిక ఎన్నికల కోసమేనా?

Telangana Politics | స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఎట్టి ప‌రిస్థితిలోనూ కోర్టు తీర్పు వెలువ‌డ‌గానే నిర్వ‌హించాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నిక‌లు త‌ప్ప‌ని స‌రిగా జ‌రుగుతాయ‌ని అర్థం కావ‌డంతో రాజ‌కీయ పార్టీలు త‌మ ఎజెండాల‌కు ప‌దును పెట్టాయి. ప్ర‌ధానంగా బీజేపీ, బీఆరెస్‌, కాంగ్రెస్ పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు పై చేయి సాధించే దిశ‌గా ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటున్నారు. మ‌రో వైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విచార‌ణ‌ల నోటీస్‌లు ఇస్తుంటే.. బీఆరెస్ ధ‌ర్నాలు, ముట్ట‌డిలు.. లొట్ట పీసు కేసులంటూ హూంక‌రిస్తోంది. బీజేపీ దీనికి భిన్నంగా కాళేశ్వరం అవినీతి కేసును కాంగ్రెస్ స‌ర్కార్‌ సీబీఐకి ఎందుకు అప్ప‌గించ‌డం లేద‌ని అంటున్న‌ది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆరెస్ ఒక‌టేన‌ని ఆరోపిస్తున్న‌ది. ఇలా ఈ మూడు పార్టీలు ఒక‌రిపై ఒకరు రాజ‌కీయ ఆధిప‌త్యం సాధించాల‌న్న తీరుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇదంతా ఒక పొలిటిక‌ల్ గేమ్ గా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ గురువారెడ్డి అభివ‌ర్ణించారు. ప‌బ్లిక్‌లో సింప‌తీ ఓట్లు సంపాదించాల‌న్న యావ త‌ప్ప మ‌రొక‌టి క‌నిపించ‌డం లేద‌ని మ‌రో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, కాలమిస్ట్‌, రాజకీయ విశ్లేషకుడు సీఆర్‌ గౌరీ శంక‌ర్‌ వ్యాఖ్యానించారు.

ముంపు మండలాలపై ఇప్పుడా?

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఏడు మండ‌లాల‌ను పోలవరం ముంపు పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ తన తొలి సమావేశంలో తీర్మానించింది. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌.. కేంద్ర నిర్ణయంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఫాసిస్టు ప్రభుత్వ చర్య అంటూ చెలరేగిపోయారు. కానీ.. పదేళ్ల కాలంలో ఏనాడూ వాటిని వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించలేదు. అనంతరం కాలంలో విలీన మండలాల్లో ఉద్యమాలకు అదంతా అయిపోయిన కథ అంటూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు సడన్‌గా కేసీఆర్‌ కుమార్తె కవితకు పోలవరం ముంపు మండలాలు గుర్తొచ్చాయి. వాటిని వెనక్కు ఇచ్చే వరకూ ఆందోళనలు చేస్తామని కవిత ప్రకటనపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కవిత చేపట్టిన బీసీల రిజ‌ర్వేష‌న్ పెంపు అంశం, తండ్రి కోసం ఇందిరాపార్క్ వ‌ద్ద చేసిన ధ‌ర్నాల‌పై సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, కాలమిస్ట్‌, రాజకీయ విశ్లేషకుడు గౌరీ శంక‌ర్ ‘విధాత’తో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో త‌న ఇమేజ్‌ పూర్తిగా డ్యామేజ్ అయింద‌ని అర్థం చేసుకున్న కవిత.. దాని నుంచి బ‌య‌టప‌డి, తిరిగి ఇమేజ్ పెంచుకోవ‌డానికి ధ‌ర్నాలు చేస్తున్న‌ట్లు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌జ‌ల న‌ర‌న‌రాల్లో ఉన్న భావోద్వేగాల‌ను ప‌సిగ‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన బీఆరెస్.. మ‌ళ్లీ ఆ ఎమోష‌న్స్‌ను ప్ర‌జ‌ల‌ ముందుకు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింద‌ని గురువారెడ్డి అన్నారు. ఏపీలో విలీనం అయిన‌ ఏడు మండ‌లాలు తిరిగి రావ‌న్న విష‌యం బీఆరెస్‌కు కానీ క‌వితకు తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ త‌న వైఫల్యాలను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఫోన్ ట్యాపింగ్ విచార‌ణ‌, కాళేశ్వ‌రం జ్యూడిషియ‌ల్ క‌మిష‌న్‌, ఫార్ములా ఈ రేసు విచార‌ణ‌ల‌ను సాగ‌దీస్తున్న‌ద‌ని గురువారెడ్డి వ్యాఖ్యానించారు. వాస్త‌వంగా ఈ మూడు విచార‌ణ‌లు ఇప్పటికే పూర్తి చేసి, చ‌ర్య‌ల‌కు ఉప‌క్రిమించాల్సి ఉండేద‌ని మరో సీనియ‌ర్‌ జ‌ర్న‌లిస్ట్ అన్నారు. అవినీతి అక్ర‌మాల‌కు సంబంధించిన విచార‌ణ‌ల‌ను రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కాకుండా, ఎంత‌టి వారికైనా త‌ప్ప‌కుండా శిక్ష ప‌డుతుంద‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో క‌లిగించేలా పాల‌కులు వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న చెబుతున్నారు.

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు బీజేపీ పట్టు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కాళేశ్వ‌రంపై సీబీఐ విచార‌ణ కోరాల‌ని డిమాండ్ చేస్తుండ‌డం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్ర‌జాక్షేత్రంలో ఇప్ప‌టికే బీజేపీ, బీఆరెస్ ఒక్క‌టేన‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డిన నేప‌థ్యంలో కాంగ్రెస్ ఏ విధంగా త‌న చేతిలో ఉన్న ఆస్త్రాన్ని వ‌దులుకుంటుంద‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌ గురువారెడ్డి అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు అంకురార్ప‌ణ జ‌రిగిన నాటి నుంచి.. ఇప్ప‌టి వర‌కు కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉన్న‌ద‌ని, కేంద్రం ఎలాంటి అనుమ‌తులు ఇవ్వ‌కుండానే ప‌నులు మొద‌లు పెట్టారా? అన్న సందేహాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. అలాంట‌ప్ప‌డు వ‌య‌బుల్ కాని ఇంత భారీ ప్రాజెక్ట్‌కు ఎలా అనుమ‌తులు ఇచ్చారని ఆయన నిలదీశారు. ఇప్ప‌డు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే సీబీఐ డిమాండ్‌ లేవనెత్తుతున్నారని అన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ బీఆరెస్‌కు ఏటీఎంలా మారింద‌న్న ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ.. దానిపై ఈడీ, ఐటీలను ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. సీబీఐ రావాలంటే రాష్ట్రం అనుమతించాలి. కానీ.. ఐటీ సోదాలు లేదా ఈడీ తనిఖీలకు ఎవరి అనుమతులూ అవసరం లేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దక్షిణాదిలో పాగా వేసేందుకు బీజేపీ యత్నాలు

లుక్ సౌత్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల‌లో పాగా వేసేందుకు బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం 2017లోనే మాస్ట‌ర్ ప్లాన్ వేసింద‌ని, 2019లోనే అధికారంలోకి రావాల‌న్న దిశ‌గా య‌త్నాలు చేసి విఫ‌ల‌మైంద‌ని సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ శంకర్‌ తెలిపారు. కానీ క్షేత్ర‌స్థాయిలో బీజేపీకి క్యాడ‌ర్ లేద‌ని అన్నారు. తాజాగా 2029 టార్గెట్‌ పెట్టుకున్నారని కానీ, గ్రామ‌స్థాయిలో క్యాడ‌ర్ లేద‌ని చెప్పారు. పైగా బీజేపీలో ఒక‌రంటే ఒక‌రికి స‌రిప‌డ‌డం లేద‌ని తెలుస్తోంద‌న్నారు. ఆరు నెల‌లుగా బీజేపీ రాష్ట్ర శాఖ‌ అధ్య‌క్షుడిని నియ‌మించుకోలేని స్థితిలో అధినాయ‌క‌త్వం ఉంద‌ని అన్నారు. అయితే కాంగ్రెస్‌, బీఆరెస్‌లపై వ్య‌తిరేక‌త త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌న్న ఆశతో బీజేపీ ఉన్న‌ట్లు అర్థం అవుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌, బీఆరెస్‌లకే క్యాడ‌ర్ ఉన్న‌ద‌ని, ఇది బీజేపీకి ట‌ర్న్ అయ్యే అవ‌కాశాలు కనిపించ‌డం లేద‌ని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ‌లో వ‌చ్చిన 8 పార్ల‌మెంటు సీట్లు కూడా మోదీ పేరుతోనే గెలిచార‌ని గౌరీ శంక‌ర్ అభిప్రాయప‌డ్డారు.

భరోసా వేళ ధర్నాలా?

రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు భ‌రోసా డ‌బ్బులు ల‌బ్ధిదారుల‌ బ్యాంక్ ఖాతాల్లో వేయ‌నున్న‌ట్లు షెడ్యూలు ప్ర‌క‌టించిన త‌రువాత‌ బీఆరెస్ నేత‌ల స‌చివాల‌యం ముట్ట‌డిపై సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ గురువారెడ్డి మాట్లాడుతూ తాము ధ‌ర్నా చేస్తేనే డ‌బ్బులు వ‌చ్చాయ‌న్న ప్ర‌చారం చేసుకోవ‌డానికే అన్న‌ట్లు బీఆరెస్‌ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల‌ను ఆలోచించ‌నివ్వ‌డానికి అవ‌కాశం లేకుండా ఎమోష‌న్స్ క్రియేట్ చేస్తార‌ని ఇక్క‌డ అర్థం అవుతుంద‌న్నారు. బీఆరెస్ అధికారంలో ఉన్న‌న్నాళ్లు ఓట్ల కోస‌మే ప‌థ‌కాలు తీసుకు వ‌చ్చార‌ని, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని ఆయన పేర్కొన్నారు.

విచారణల్లో పురోగతి ఏది?

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర దాటింద‌ని, కాళేశ్వ‌రం జ్యుడీషియ‌ల్ క‌మిష‌న్‌, ఫార్ములా ఈ కారు రేసు కేసు, ఫోన్ ట్యాపింగ్ విచార‌ణ‌లో సాధించిన పురోగ‌తి ఏమీ లేదని సీనియర్‌ పాత్రికేయులు అభిప్రాయపడుతున్నారు. మేడిగ‌డ్డ‌లో ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైనా.. ఇప్పటికీ దానిపై విచారణ ప్రారంభించలేదని చెప్పారు. కాళేశ్వ‌రం క‌మిష‌న్ విచార‌ణ‌, నోటీస్‌లతోనే స‌రిపెడుతుండటం ప్రచార లబ్ధికే అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ దీనిని సీరియ‌స్‌గా తీసుకుంటే ఈ పాటికే ఒక‌రిద్ద‌రు పెద్ద త‌ల‌కాయ‌లు క‌ట‌క‌టాల పాల‌య్యేర‌ని గురువారెడ్డి అభిప్రాయప‌డ్డారు. కేసుల విచార‌ణ తీరు చూసి త‌మ‌కేమీ కాద‌న్న భ‌రోసా కూడా బీఆరెస్ బ‌డా నేత‌ల‌కు క‌లుగుతుంద‌ని, అందుకే లొట్ట‌పీసు కేసులు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ వాటిని తేలిగ్గా తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నదని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌ను ఎవ‌రు, ఎందుకోసం చేయించార‌నే విష‌యం అంద‌రికీ తెలిసినా.. దానిపై కూడా చర్యల్లో వేగం లేదని అన్నారు. కాంగ్రెస్ నేత‌లు కూడా ఈ కేసుల అంశాల‌ను ఎన్నికల ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందేందుకే ఉపయోగించుకునే తీరులో కనిపిస్తున్నారని అన్నారు. ఈ తంతు చూస్తే ఒక పొలిటిక‌ల్ గేమ్‌లానే తప్ప గొప్ప విష‌య‌మేమీ క‌నిపించ‌డం లేని గురువారెడ్డి అభిప్రాయ ప‌డ్డారు.