Favoritism in Postings| కోరుకున్నవారికి కోరుకున్న చోట! పన్నుల శాఖలో నిబంధనలకు పాతర!

నచ్చినవారికి, మెచ్చినవారికి, పైరవీలు చేసుకున్నవారికి కోరుకున్న చోట.. కోరుకున్న కొలువు దొరుకుతుందనేందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి ఈ ఉదంతాలు. వీటిపై తెలంగాణ సచివాలయంలో జోరుగా చర్చ నడుస్తున్నది.

Favoritism in Postings| కోరుకున్నవారికి కోరుకున్న చోట! పన్నుల శాఖలో నిబంధనలకు పాతర!

హైదరాబాద్, ఆగస్ట్‌ 29 (విధాత):

Favoritism in Postings| నచ్చినవారికి, మెచ్చినవారికి, పైరవీలు చేసుకున్నవారికి కోరుకున్న చోట.. కోరుకున్న కొలువు దొరుకుతుందనేందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి ఈ ఉదంతాలు. వీటిపై తెలంగాణ సచివాలయంలో జోరుగా చర్చ నడుస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొందరు నియమ నిబంధనలకు నీళ్లు వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పన్నుల శాఖలో మొన్నటి వరకూ పనిచేసి, ఆ తరువాత ఐఏఎస్ అధికారిగా పదోన్నతి (కన్ఫర్డ్) పొందిన ఒక ఉద్యోగి.. తెలంగాణ సచివాలయంలో కొద్ది నెలలు పనిచేశారు. తిరిగి మళ్లీ మాతృ విభాగంలో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఒక ఐఏఎస్ అధికారికి స్వంత జిల్లాలో కలెక్టర్‌గా పోస్టింగ్ ఇవ్వకూడదు కానీ.. ఇచ్చారు. నాన్ ఐఏఎస్ అధికారికి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించకూడదని నిబంధనలు చెబుతున్నా.. వాటిని పక్కకు నెట్టేసి.. అప్పగించారు. నిరాటంకంగా సాగుతున్న ఈ నిబంధనల ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం, డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఉల్లంఘనలను సమీక్షించి, నియంత్రించే బదులు కొనసాగిస్తుండడం కంచె చేను మేసిన చందంగా ఉందని పలువురు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 1956 వరకు మద్రాస్ రాష్ట్రం పరిధిలో రెవెన్యూ బోర్డు ఉంది. ఆ తరువాత రెవెన్యూ బోర్డును తీసేసి ప్రత్యేకంగా వాణిజ్య పన్నుల కమిషనరేట్ ఏర్పాటు చేశారు. ఈ పదవికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పూర్వం కూడా ముఖ్య కార్యదర్శి స్థాయి లేదా సీనియర్ ఐఏఎస్ అధికారులను కమిషనర్‌గా నియమించేవారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి తెచ్చే విభాగం కావడంతో అనుభవం ఉన్న ఐఏఎస్‌లకే ప్రభుత్వం ప్రాముఖ్యం ఇచ్చేది. ప్రతి రోజు ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయానికి వాణిజ్య పన్నుల కమిషనర్, అంతకు ముందు రోజు రాబడిపై రిపోర్టు ఇచ్చే విధానం అమల్లో ఉంది. ఇంతటి ముఖ్యమైన వాణాజ్య పన్నుల శాఖలో జూనియర్ ఐఏఎస్ అధికారి, అది కూడా అదే శాఖలో పనిచేసి పదోన్నతి పొందిన వారికి కీలక బాధ్యతలు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉద్యోగిని కమర్షియల్ ట్యాక్స్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఇలాంటి ముఖ్యమైన పోస్టులలో ఐఏఎస్‌లను నియమించే ముందు ప్రధాన కార్యదర్శి అన్ని కోణాల్లో ఆలోచించి, నియామక పైలును సిద్ధం చేసే ముందు ముఖ్యమంత్రికి తెలియచేస్తారు. అయితే.. జూనియర్‌ అధికారి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు కమిషనర్‌గా అనిల్ కుమార్ పనిచేశారు. ఆయన చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పటి ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జూనియర్‌ అధికారిణి వివరాలు తెలియచేసి నియమించారా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే చర్చ నడుస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కూడా ఈ బదిలీకి ఎలా ఆమోదం తెలిపారో కూడా తెలియడం లేదని వాణిజ్య పన్నుల శాఖ అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగాలకు సీనియర్ ఐఏఎస్‌లను నియమిస్తారు. ఈ పదవుల ఎంపికలో ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖ, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖల మంత్రుల సిఫారసులకు పెద్దపీట వేస్తారు. వీరి సిఫారసుల మేరకు సంబంధిత పదవులకు అధికారులను ఎంపిక చేసి ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

తెలంగాణ వాణిజ్య పన్నుల విభాగంలో 1998 బ్యాచ్ కు చెందిన జూనియర్‌ అధికారి.. 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా కన్ఫర్డ్ అయ్యారు. నాన్ స్టేట్ సివిల్ సర్వీసెస్ కోటాలో మొత్తం ఐదుగురికి ఐఏఎస్‌గా పదోన్నతి కల్పించేందుకు 2023లో యూపీఎస్సీ ఇంటర్వ్యూలు చేయగా, డీఓపీటీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్ణీత గడువులోగా ఖాళీలను గుర్తించి, నోటిఫై చేయాల్సి ఉంది. కాని ఆ పని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేయకపోవడం మూలంగా కన్ఫర్డ్ ఐఏఎస్ ఖాళీల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో 2023లో ఒకే విడతలో ఐదుగురు నాన్ ఎస్సీఎస్ అధికారులు ఐఏఎస్ లుగా ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే వాణిజ్య పన్నుల కమిషనరేట్ లో తాజాగా నియమితులైన అధికారికంటే అంతకు ముందు పనిచేసిన సహచర అధికారులు, సీనియర్లు పనిచేస్తున్నారు. మొన్నటి వరకు మనతో కలిసి పనిచేసిన జూనియర్‌ను తమ బాస్‌గా అంగీకరించేందుకు వారి మనసు అంగీకరించడం లేదనే చర్చ నడుస్తోంది. వాణిజ్య పన్నుల విభాగంలో పనిచేసిన జూనియర్‌కు పదోన్నతి ఇచ్చిన తరువాత అదే శాఖలో పంజగుట్ట అడిషనల్ కమిషనర్ గా నియమించారు. 2023 జూలై నెలలో అక్కడి నుంచి బదిలీ చేసి బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఆ తరువాత మళ్లీ మాతృశాఖ అయిన వాణిజ్య పన్నుల శాఖకు డైరెక్టర్ గా పంపడం పలువురు అధికారులు, వ్యాపారవర్గాలను అప్పట్లో ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి.