King Mswati III | 15 మంది భార్యలు.. 30 మంది పిల్లలు, 100 మంది సేవకులతో రాజుగారి ప్రయాణం!

ఆఫ్రికన్‌–అమెరికన్‌ వ్యక్తి, ఆయన వెంట మహిళల గుంపు. ఒక ప్రైవేట్‌ జెట్‌ నుంచి దిగారు. ఆయన అర్ధనగ్నంగా ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్నవారు ఆయనకు వంగివంగి సలాములు చేస్తున్నారు. ఇంతకీ ఎవరాయన?

King Mswati III | 15 మంది భార్యలు.. 30 మంది పిల్లలు, 100 మంది సేవకులతో రాజుగారి ప్రయాణం!

King Mswati III | రాజుగారి ప్రయాణం అంటే ఆ దర్పం.. ఆ హడావుడి వేరు. అందునా కుటుంబ సభ్యులందరితో కలిసి బయల్దేరితే! ఆ కుటుంబ సభ్యుల్లో 15 భార్యలు, 30 మంది పిల్లలు, 100 మంది సేవకులు ఉంటే? ఎయిర్‌పోర్ట్‌ బంద్‌ అయిపోదూ! దీనికి సంబంధించిన ఒక వీడియో.. పాతదే అయినప్పటికీ.. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబుధాబి ఎయిర్‌పోర్ట్‌లో చిత్రీకరించినది. ఈ వీడియోలో ఆఫ్రికన్‌–అమెరికన్‌ వ్యక్తి, ఆయన వెంట మహిళల గుంపు. అంతా.. ఒక ప్రైవేట్‌ జెట్‌ నుంచి దిగారు. ఈ వీడియోలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన అర్ధనగ్నంగా ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్నవారు ఆయనకు వంగివంగి సలాములు చేస్తున్నారు.

వైరల్‌గా వీడియోలు

సహజంగానే ఆ వ్యక్తి ఎవరు? ఇంత విలాసవంతమైన ప్రయాణం ఏమిటి? ఆయన చుట్టూ ఉన్న మహిళలు, పిల్లలు ఎవరు? అనే సందేహాలు వస్తాయి. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆ ప్రైవేటు విమానం నుంచి దిగింది ఆషామాషీ వ్యక్తి కాదు. దక్షిణాది ఆఫ్రికాలోని ఎస్వాటిని (గతంలో స్వాజీలాండ్‌) అనే రాజ్యానికి రాజు. పేరు కింగ్‌ ఎంస్వాటి–3. ఆఫ్రికాలో ఇంకా రాజరికం కిందే ఉన్న ఒకే ఒక్క దేశం. ఆయన 2025 జూలై 10వ తేదీన నాటకీయ పద్ధతిలో అబుధాబి విమానాశ్రయంలో సకుటుంబ సపరివార సమేతంగా దిగాడు. అప్పడు చిత్రీకరించిన వీడియోలు.. నెట్టింట వైరల్‌గా మారాయి.
కింగ్‌ ఎంస్వాటి –3.. తన 15 మంది భార్యలు, 30 మంది పిల్లలు, సుమారు 100 మంది సేవకులతో ప్రైవేట్‌ జెట్‌ నుంచి దిగాడు. ఇంతటి భారీ పరివారం దిగడంతో రేగిన కలకలంతో.. ఎయిర్‌పోర్టు అధికారులు తాత్కాలికంగా మూడు టెర్నినళ్లను లాక్‌డౌన్‌ చేయాల్సి వచ్చింది.

ఎందుకు వచ్చాడు?

యూఏఈతో ఆర్థిక ఒప్పందాలపై సంప్రదింపులు చేసేందుకు కింగ్‌ ఎంస్వాటి విచ్చేశాడు. అయితే.. మితిమీరిన ఆయన జీవన విధానం.. ప్రపంచవ్యాప్తంగా దృష్టిని సారింపజేసింది. ఈ వైరల్‌ వీడియోలో కింగ్‌ ఎంస్వాటి.. చిరుతపులి చర్మాన్ని పోలిన సంప్రదాయ వస్త్రాన్ని ధరించాడు. అతడి భార్యలు సంప్రదాయ రంగురంగుల ఆఫ్రికన్‌ దుస్తులు, ఆభరణాలు ధరించారు. అతడి వందకుపైగా సేవకులు రాజుగారి పరివారానికి సంబంధించిన సూట్‌ కేసులను తరలిస్తూ బిజీగా కనిపించారు.

ఆయన తండ్రికి 125 మంది భార్యలు!

రాజుగారి దర్పం చూసిన నెటిజన్లు.. విస్తుబోయారు. కింగ్‌ ఎంస్వాటి తండ్రి, స్వాజీలాండ్‌ మాజీ రాజుకు 70 మంది భార్యలు ఉన్నట్టు చెబుతారు. కొన్ని రిపోర్టులు.. భార్యల సంఖ్య 125కుపైగానే ఉన్నట్టు, 210 మంది పిల్లలు, వెయ్యికిపైగా మనుమలు, మనుమరాండ్రు ఉన్నట్టు అంచనా వేశాయి. కింగ్‌ ఎంస్వాటికి 30 మంది భార్యలు ఉన్నారు. అయితే.. ఆయనతోపాటు వచ్చింది 15 మంది మాత్రమే. పిల్లలు కూడా 35మందికి మించి ఉంటారని తెలుస్తున్నది. ఆయన 1986 నుంచి ఎస్వాటిని రాజ్యాన్ని ఏలుతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న రాజుల్లో ఒకరిగా ఆయనకు గుర్తింపు ఉన్నది. ఆయన ఆస్తి సుమారు వంద కోట్ల డాలర్ల పైమాటేనని అంచనా. సంప్రదాయ రీడ్ డ్యాన్స్‌ సందర్భంగా ప్రతి ఏటా ఆయన ఒక కొత్త భార్యను ఎంపిక చేసుకుంటాడు. ఈ సంప్రదాయంపై సానుకూలతలూ ఉన్నాయి.. విమర్శలూ ఉన్నాయి. రాజు శ్రీమంతుడైనప్పటికీ.. ఆయన దేశంలోని జనాభాలో 60 శాతం మందికిపైగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. రాజు విలాసవంతమైన జీవితంపై దేశీయంగా తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఒకవైపు దేశం ఇన్ని కష్టాల్లో ఉంటే.. ఇంత విలాసవంతమైన ఖర్చులేంటనే ప్రశ్నలు ఎప్పుడూ వినిపిస్తుంటాయి. ఇక ఈ వీడియో వైరల్‌ కాగానే.. నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by FUN FACTORSS 1M™ (@fun_factorss)