బీజేపీ అభ్య‌ర్థి హేమ‌మాలినిపై అంత‌ర్జాతీయ బాక్స‌ర్ పోటీ..! మ‌రి గెలుపెవ‌రిదో..?

బీజేపీ అభ్య‌ర్థి హేమ‌మాలినిపై అంత‌ర్జాతీయ బాక్స‌ర్ పోటీ..! మ‌రి గెలుపెవ‌రిదో..?

న్యూఢిల్లీ : లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, బీజేపీల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. మూడోసారి అధికారం చేజిక్కించుకునే దిశ‌గా బీజేపీ అడుగులు వేస్తోంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీ అభ్య‌ర్థుల‌కు గ‌ట్టి పోటీనిచ్చే అభ్య‌ర్థుల‌ను కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల స‌మ‌రంలో దింపుతోంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థుర పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌పున హేమ‌మాలిని పోటీ చేస్తున్నారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున అంత‌ర్జాతీయ బాక్స‌ర్ విజేంద‌ర్ సింగ్‌ను బ‌రిలో దింపాల‌ని హ‌స్తం పార్టీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌ట‌న కూడా చేసింది. అయితే మ‌థుర నియోజ‌క‌వ‌ర్గంలో విజేంద‌ర్ సింగ్ పాపుల‌రిటీ ఉన్న వ్య‌క్తి. అంతేకాకుండా ఆయ‌న జాట్ క‌మ్యూనిటీకి చెందిన వ్య‌క్తి. మ‌థుర‌లో జాట్ క‌మ్యూనిటీ ఓట్ల‌ను కైవ‌సం చేసుకుని, ఆ పార్ల‌మెంట్‌లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఒక వ్యూహాన్ని ర‌చించింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

2014, 2019 ఎన్నిక‌ల్లో హేమ‌మాలిని విజ‌యం

2014, 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌థుర నుంచి హేమ‌మాలిని బీజేపీ త‌ర‌పున గెలిచారు. మూడోసారి కూడా విక్ట‌రీ కొట్టేందుకు ఆమె ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌(ఆర్ఎల్డీ) మ‌ద్ద‌తుతో హేమ‌మాలిన త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో వ‌రుస‌గా మూడోసారి గెలిచి లోక్‌స‌భ‌లో అడుగు పెట్టాల‌నే ల‌క్ష్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మొత్తానికి మ‌థుర లోక్‌స‌భ ఎన్నిక దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌బోతోంది.

మ‌థుర‌లో కాంగ్రెస్ గెలిచింది ఐదు సార్లు మాత్ర‌మే..

1951-52లో లోక్‌స‌భ ఎన్నిక‌లు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి మ‌థుర‌లో కాంగ్రెస్ పార్టీ కేవ‌లం ఐదుసార్లు మాత్ర‌మే గెలుపొందింది. 1991లో సాక్షిమ‌హారాజ్ నేతృత్వంలో బీజేపీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి.. మ‌థుర‌ను కైవసం చేసుకుంది. 2004, 2009 ఎన్నిక‌ల‌ను మిన‌హాయిస్తే.. మ‌థుర బీజేపీకి కంచుకోట‌గా మారింది. 2004లో కాంగ్రెస్ అభ్య‌ర్థి మాన్వేంద్ర సింగ్, 2009లో ఆర్ఎల్డీ అభ్య‌ర్థి జ‌యంత్ చౌద‌రి గెలుపొందారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో హేమ‌మాలిని విజ‌యం సాధించారు.