ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఢిల్లీ ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మహాధర్నా నిర్వహించారు

  • పదళ్లవుతున్నా.. ఇప్పటికీ అమలు కాలేదు
  • దుగ్గరాజపట్నం పోర్టు లేదు.. రైల్వే జోన్‌ ఇవ్వలేదు
  • పైగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే యత్నం
  • ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం
  • ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో నిరసన


విధాత, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఢిల్లీ ఏపీ భవన్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో జరిగిన సభలో నరేంద్ర మోదీ ఆనాడు చెప్పారని, కానీ విభజన చట్టంలోని హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు.

దుగ్గరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నారని, రైల్వే జోన్ అన్నారని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామన్నారని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారని గుర్తు చేసిన షర్మిల అవన్నీ ఏమైపోయాయని ప్రశ్నించారు. చివరకు విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఏపీకి తీరని ద్రోహం చేస్తుంటే అటు టీడీపీ ఇటు వైసీపీ మాత్రం బీజేపీకి గులాంగిరీ చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పి ద్రోహం చేస్తున్నారని, కచ్చితంగా ఈ విషయంలో బీజేపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

పార్టీల నేతలను కలిసిన షర్మిల

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో ఒత్తిడి పెంచేందుకు వైఎస్‌ షర్మిల ఢిల్లీ వేదికగా పలు పార్టీల మద్దతు కోరారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని చెప్పిన మోదీ ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు.

రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్ ఇలా ఏ ఒక్క హామీ అమలుకు మోదీ ప్రభుత్వం సహకరించలేదని వారికి తెలిపారు. ప్రత్యేక హోదా కాదు కదా ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇవ్వలేదని ఆమె వారికి వివరించారు. బుందేల్‌ఖండ్‌ తరహాలో రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని, వైజాగ్ -చెన్నై కారిడార్ ఏర్పాటు చేయలేదని, ఏపీని బీజేపీ ప్రభుత్వం ఇలా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు పార్టీలు బీజేపీకి బేషరతుగా మద్దతివ్వడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

Updated On 3 Feb 2024 12:20 PM GMT
Somu

Somu

Next Story