Italy | ఇటలీలో ఘోర ప్ర‌మాదం.. బ్రిడ్జిపై నుంచి కింద‌ప‌డ్డ బస్సు.. 21 మంది మృతి

Italy | ఇటలీలో ఘోర ప్ర‌మాదం.. బ్రిడ్జిపై నుంచి కింద‌ప‌డ్డ బస్సు.. 21 మంది మృతి

Italy | వెనీస్ : ఇట‌లీలో మంగ‌ళ‌వారం ఘోర రోడ్డుప్ర‌మాదం చోటు చేసుకుంది. ప‌ర్యాట‌కుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సు అదుపుత‌ప్పి బ్రిడ్జిపై నుంచి కింద ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు, ప‌లువురు విదేశీయులు ఉన్నారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. అయితే బ‌స్సు ప్ర‌మాదానికి గురైన వెంట‌నే.. బ‌స్సులోని మీథేన్ ఇంధ‌న లీకై మంటలు చెల‌రేగాయి. దీంతో ప్ర‌మాద తీవ్ర‌త పెరిగింద‌ని అధికారులు పేర్కొన్నారు.

మృతుల‌ను గుర్తించేందుకు పోలీసులు, అధికారులు య‌త్నిస్తున్నారు. మృతుల్లో ఇత‌ర దేశ‌స్థులు ఉన్నార‌ని తెలిపారు. పర్యాట‌కులంతా వెనీస్ న‌గ‌రంలోని చారిత్రక ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించి, తిరిగి త‌మ క్యాంపింగ్ సైట్‌కు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఇట‌లీ ప్ర‌ధాన మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని ఆదేశించారు.