Peddapalli | పాముతో కాటు వేయించి.. భ‌ర్త‌ను చంపిన భార్య‌

Peddapalli | పాముతో కాటు వేయించి.. భ‌ర్త‌ను చంపిన భార్య‌

Peddapalli | ఓ మ‌హిళ‌తో త‌న భ‌ర్త వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నట్లు భార్య‌కు తెలిసింది. ఆమెను దూరం పెట్టాల‌ని, నిత్యం భ‌ర్త‌తో భార్య గొడ‌వ‌ప‌డేది. భ‌ర్త‌లో మార్పు క‌నిపించ‌క‌పోవ‌డంతో.. అత‌న్ని అంత‌మొందించాల‌ని భార్య నిర్ణ‌యించుకుంది. దీంతో భ‌ర్త‌కు పాముతో కాటు వేయించి చంపేసింది. ఈ దారుణ ఘ‌ట‌న పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావ‌రిఖ‌ని మార్కండేయ కాల‌నీలో ఈ నెల 9వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మార్కండేయ కాల‌నీకి చెందిన స్థిరాస్తి వ్యాపారి, బిల్డ‌ర్ కొచ్చెర ప్ర‌వీణ్‌(42)కు కొన్నేండ్ల క్రితం ల‌లిత‌తో వివాహ‌మైంది. వీరికి 14, 12, 10 ఏండ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే కొంత‌కాలం నుంచి ప్ర‌వీణ్‌.. ఓ మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్నాడు. ఈ విష‌యం ల‌లిత‌కు తెలిసి, భ‌ర్త‌ను మంద‌లించింది. నిత్యం గొడ‌వ‌ప‌డేది. భ‌ర్త‌లో మార్పు క‌నిపించ‌క‌పోవ‌డంతో అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఈ క్ర‌మంలో ప్ర‌వీణ్ వ‌ద్దే సెంట్రింగ్ ప‌ని చేసే మ‌చ్చ సురేశ్‌(37)తో క‌లిసి హ‌త్య‌కు ప్ర‌ణాళిక ర‌చించింది. ప్ర‌వీణ్‌ను హ‌త్య చేస్తే ఒక ప్లాట్ ఇస్తాన‌ని సురేశ్‌కు చెప్పింది. అంగీకారం తెలిపిన సురేశ్‌.. ఇందార‌పు స‌తీశ్‌(25), మాస శ్రీనివాస్(33), భీమ గ‌ణేశ్‌(23)ల‌తో క‌లిసి ప్ర‌వీణ్ హ‌త్య‌కు ప్లాన్ చేశారు. పాముతో కాటు వేయించి చంపాల‌నుకున్నారు. దీంతో మంద‌మ‌ర్రిలో ప్ర‌యివేటు సెక్యూరిటీ గార్డు న‌న్న‌పురాజు చంద్ర‌శేఖ‌ర్‌(38)తో మాట్లాడుకున్నారు. ఇక వీరి ఖ‌ర్చుల కోసం ల‌లిత 34 గ్రాముల బంగారం గొలుసును వారికి అప్ప‌జెప్పింది. ఈ నెల 9వ తేదీన రామ‌గుండంలో సురేశ్‌, స‌తీశ్‌, శ్రీనివాస్, గ‌ణేశ్‌, చంద్ర‌శేఖ‌ర్ క‌లిసి మ‌ద్యం సేవించారు. అనంత‌రం ల‌లిత‌కు ఫోన్ చేసి బైక్‌ల‌పై ఆమె ఇంటికి చేరుకున్నారు.

గాఢ నిద్ర‌లో ఉన్న ప్ర‌వీణ్ ముఖంపై దిండుతో అదిమిప‌ట్టారు. ప్ర‌వీణ్‌లో క‌ద‌లిక రావ‌డంతో.. వెంట తెచ్చుకున్న పాముతో కాటు వేయించి పారిపోయారు. ఈ త‌తాంగాన్ని అంతా ప‌క్క‌నే ఉన్న మ‌రో గ‌దిలో ఉండి ల‌లిత చూసింది. ఇక పామును బ‌హిరంగ ప్ర‌దేశంలో వ‌దిలేసి వెళ్లిపోయారు.

తెల్లారిన త‌ర్వాత ప్ర‌వీణ్ గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్లు అత‌ని త‌ల్లికి ల‌లిత చెప్పింది. కానీ ల‌లిత మాట‌ల‌ను ఆమె న‌మ్మ‌లేదు. త‌న కుమారుడి మృతిపై అనుమానం ఉంద‌ని త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టగా అస‌లు విష‌యం వెలుగు చూసింది. దీంతో ల‌లిత స‌హా ఆరుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు త‌ర‌లించారు. వీరి నుంచి ఆరు సెల్‌ఫోన్లు, 34 గ్రాముల బంగారం గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.