Hyderabad | ప్రియుడి మ‌ర‌ణం త‌ట్టుకోలేక‌.. ప్రియురాలు ఆత్మ‌హ‌త్య‌

Hyderabad | ప్రియుడి మ‌ర‌ణం త‌ట్టుకోలేక‌.. ప్రియురాలు ఆత్మ‌హ‌త్య‌

Hyderabad | వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కానీ వారి ప్రేమ‌ను పెద్ద‌లు తిర‌స్క‌రించారు. దీంతో ప్రియుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప్రియుడు మ‌ర‌ణించాడ‌న్న వార్త తెలుసుకున్న ప్రియురాలు త‌ట్టుకోలేక‌పోయింది. ఆమె కూడా ఉరేసుకుని చ‌నిపోయింది. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని గ‌చ్చిబౌలిలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. పంజాబ్‌కు చెందిన నేహా(19) గ‌త ఎనిమిది నెల‌ల నుంచి గోప‌న్‌ప‌ల్లిలోని జ‌ర్న‌లిస్టు కాల‌నీలోని ఓ లేడిస్ హాస్టల్‌లో నివాసం ఉంటుంది. నాన‌క్‌రాంగూడ‌లోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్‌లోని బేక‌రిలో సేల్స్ గ‌ర్ల్‌గా ప‌ని చేస్తోంది. ఇదే బేక‌రిలో ప‌ని చేస్తున్న స‌ల్మాన్‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌కు దారి తీసింది. స‌ల్మాన్ బాలాపూర్ పీఎస్ ప‌రిధిలోని వెంక‌టాపురం వాసి.

స‌ల్మాన్, నేహా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యం బేక‌రి నిర్వాహ‌కుల‌కు తెలియ‌డంతో స‌ల్మాన్‌ను ఉద్యోగంలో నుంచి తొల‌గించారు. తన ప్రేమ విష‌యాన్ని స‌ల్మాన్ ఇంట్లో చెప్పాడు. అత‌ని త‌ల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి అంగీక‌రించ‌లేదు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన స‌ల్మాన్ రెండు రోజుల క్రితం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప్రియుడు చ‌నిపోయాడ‌న్న విష‌యం నేహాకు రెండు రోజుల త‌ర్వాత తెలిసింది. దీంతో నేహా నిన్న ఉద్యోగానికి వెళ్ల‌కుండా హాస్ట‌ల్ గ‌దిలోనే ఉండిపోయింది. గ‌దికి గ‌డియ పెట్టుకుని, ఉరేసుకుంది. డోర్ తీయ‌క‌పోయేస‌రికి హాస్ట‌ల్ సిబ్బందికి అనుమానం వ‌చ్చి కిటికీలో నుంచి చూడ‌గా, ఉరేసుకున్న దృశ్యం క‌నిపించింది. దీంతో పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న గ‌చ్చిబౌలి పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు. ప్రియుడి ఆత్మ‌హ‌త్య‌ను త‌ట్టుకోలేక త‌నువు చాలించింద‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.