800 మందికి స్వ‌యంగా వంట చేసి వడ్డించిన హీరో.. యాక్ట‌ర్ ట్యాగ్ ప‌క్క‌న పెట్టి గిన్నెలు క‌డిగాడు..!

800 మందికి స్వ‌యంగా వంట చేసి వడ్డించిన హీరో.. యాక్ట‌ర్ ట్యాగ్ ప‌క్క‌న పెట్టి గిన్నెలు క‌డిగాడు..!

ఇటీవ‌లి కాలంలో చాలా మంది స్టార్స్ సేవా కార్య‌క్ర‌మాల‌లో భాగం అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ కొంత స‌మ‌యాన్ని మాత్రం సేవా కార్య‌క్ర‌మాల‌కి కేటాయిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ సింగ‌ర్ గీతా మాధురి భ‌ర్త‌, ప్రముఖ న‌టుడు నందు అన్నదానం చేసి ఏకంగా 800 మంది ఆకలి తీర్చ‌డ‌మే కాక అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు. శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసిన నందు.. 800 మందికి ఆహారాన్ని అందించ‌డం విశేషం. తానే స్వయంగా ఫుడ్‌ ప్రిపేర్ చేసి, అందరికీ వడ్డించాడు. అంతేకాదు అన్నదానం తర్వాత కూడా పాత్రలు కూడా కడిగాడు. యాక్టర్‌ అన్న ట్యాగ్‌ ను పక్కన పెట్టి అక్క‌డ ప్ర‌తి ప‌నిలోను ఇన్వాల్వ్ అవుతూ అంద‌రిని ఆశ్చర్య‌ప‌రిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోని నందు త‌న ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా, ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఢీ షో‌లో నందు కన్నీళ్లు పెట్టుకున్నాడు నందు. ఢీ షోని హోస్ట్ చేస్తున్న నందు.. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ.. చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. డ్ర‌గ్స్ కేసులో నందుపై ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బ్రేకింగ్‌లు వేసి అత‌ని పేరు హాట్ టాపిక్ అయ్యేలా చేశారు.అయితే డ్ర‌గ్స్ కేసులో త‌న ప్ర‌మేయం లేద‌ని ఇటీవ‌ల తేలింది. అయితే ఆ స‌మ‌యంలో నందు ఎంత బాధ అనుభవించాడో తాజాగా తెలియ‌జేస్తూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. తనకి సంబంధం లేని విషయంలోకి తన పేరు లాగి.. 12 రోజులు బ్రేకింగ్ వేసార‌ని.. ఇప్పుడు తన ప్రమేయం లేదని తేలితే.. కనీసం చిన్న స్క్రోలింగ్‌లో కూడా వేయలేదని నందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు నందు ఆవేద‌నకి సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

నందు గీతా మాధురిని 2014లో వివాహం చేసుకున్నాడు. ఈ దంప‌తుల‌కి దాక్షాయ‌ణి అనే చిన్నారి ఉంది. రీసెంట్‌గా పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది గీతా మాధురి. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ఇక నందు విష‌యానికి వ‌స్తే ఆయ‌న హోస్ట్‌గా, న‌టుడిగా, హీరోగా ప‌లు చిత్రాలు చేశాడు. 2006 నుంచి 2024 వరకూ దాదాపు 25కి పైగా సినిమాల్లో నటించారు. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’, సవారి, శివరంజని, ఇంతలో ఎన్నెన్ని వింతలో తదితర చిత్రాల్లో హీరోగా న‌టించి మెప్పించిన నందు మాన్షన్ 23, వధువు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించారు. మంచి హిట్ కోసం నందు ఎంతో తాప‌త్ర‌య ప‌డుతున్నాడు.