30 ఏండ్ల తర్వాత JNUSU అధ్యక్షుడిగా దళిత స్కాలర్.. ఎవరీ ధనంజయ్..?
దాదాపు 30 సంవత్సరాల తర్వాత జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్ష పదవి దళిత స్కాలర్‌ను వరించింది. చివరిసారిగా 1996-97 మధ్య కాలంలో భట్టిలాల్ భైర్వా(దళిత్) జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్ష పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ పదవి దళితులకు దక్కలేదు.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో యునైటెడ్ లెఫ్ట్ ప్యానెల్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులను వామపక్షాలు దక్కించుకున్నాయి. జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీని చిత్తుగా ఓడించారు.
అయితే యునైటెడ్ లెఫ్ట్ ప్యానెల్ విజయం సాధించడంతో దాదాపు 30 సంవత్సరాల తర్వాత జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్ష పదవి దళిత స్కాలర్‌ను వరించింది. చివరిసారిగా 1996-97 మధ్య కాలంలో భట్టిలాల్ భైర్వా(దళిత్) జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్ష పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ పదవి దళితులకు దక్కలేదు. తాజా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడి విజయం సాధించిన ఆ దళిత స్కాలర్ ఎవరంటే ధనంజయ్. ఆయన బీహార్‌లోని గయా నివాసి. ప్రస్తుతం జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, ఈస్తటిక్స్‌లో పీహెచ్డీ చేస్తున్నారు.
గెలుపు అనంతరం ధనంజయ్ మాట్లాడుతూ.. జేఎన్‌యూ విద్యార్థులు హింసాత్మక రాజకీయాలకు స్వస్తి పలికారని తెలిపారు. విద్యార్థులు తమపై నమ్మకంతో లెఫ్ట్ ప్యానెల్‌ను గెలిపించారు. విద్యార్థుల హక్కుల పోరాడుతూనే ఉంటామన్నారు. క్యాంపస్‌లో నీరు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దేశద్రోహ ఆరోపణల కింద అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ధనంజయ్ మాట్లాడుతున్నంత సేపు లాల్ సలామ్, జై భీమ్ నినాదాలతో జేఎన్‌యూ క్యాంపస్ మార్మోగిపోయింది.
నాలుగేండ్ల విరామం తర్వాత జరిగిన స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నుంచి దళిత విద్యార్థి ధనుంజయ్ భారీ విజయం సాధించారు. ఏబీవీపీ తరపున పోటీ చేసిన ఉమేష్ సీ అజ్మీరా ఓడిపోయారు. ధనుంజయ్‌కు 2,598 ఓట్లు పోలవ్వగా, ఉమేష్‌కు 1,676 ఓట్లు పోలయ్యాయి.