Ear Phones | వ్యక్తి కడుపులో ఇయర్ ఫోన్స్, బోల్టులు.. 3 గంటల పాటు సర్జరీ

Ear Phones | ఓ 40 ఏండ్ల వ్యక్తి కడుపులో ఇయర్ ఫోన్స్, బోల్టులు, నట్లు వాచర్లు, తాళం, తాళం చెవిలు లభ్యమయ్యాయి. సదరు వ్యక్తికి 3 గంటల పాటు సర్జరీ నిర్వహించి, తొలగించారు వైద్యులు. ఈ ఘటన పంజాబ్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని మోగాకు చెందిన ఓ వ్యక్తి(40) గత రెండేండ్ల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఆయనకు కడుపు నొప్పి తీవ్రమైంది. దాంతో పాటు జ్వరం వచ్చింది. వాంతులు కూడా అయ్యాయి. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు మోగాలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు.
బాధిత వ్యక్తికి వైద్యులు ఎక్స్‌రే నిర్వహించగా, కడుపులో ఇనుప వస్తువులు ఉన్నట్లు గర్తించారు. దీంతో వైద్యులు 3 గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించారు. బాధితుడి కడుపులో ఉన్న ఇయర్ ఫోన్స్, బోల్టులు, నట్లు, వాచర్లు, తాళం, తాళం చెవిలతో పాటు ఇతర వస్తువులను తొలగించారు వైద్యులు. తన కేరీర్‌లో ఇలాంటి కేసు చూడడం ఇదే మొదటిసారి అని మెడిసిటీ డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కల్రా తెలిపారు. బాధితుడికి శస్త్ర చికిత్స విజయవంతమైంది. కానీ అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.