11,062 పోస్టులతో మెగా డీఎస్సీ..! నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్..!!
టీచర్ ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను నాలుగైదు రోజుల్లో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్ : టీచర్ ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను నాలుగైదు రోజుల్లో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలన్నింటినీ విద్యాశాఖ సీఎం కార్యాలయానికి పంపింది. సీఎంవో నుంచి అనుమతి రాగానే, ఈ వారంలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అదనంగా మరో 5,973 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సోమవారం రెండు వేర్వేరు జీవోలను జారీ చేసింది. జీవో -27 ద్వారా 4,957 పోస్టుల భర్తీ, 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉద్యోగాల నియామకానికి జీవో -26ను ఆర్థికశాఖ జారీచేసింది. దీంతో గతంలో నోటిఫికేషన్‌లో ప్రకటించినవి.. తాజాగా ఆర్థిక శాఖ ఆమోదించినవి కలుపుకొంటే మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. గ్రూప్ – 1 తరహాలోనే పాత డీఎస్సీని రద్దుచేయన్నట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
తాజా సమాచారం ప్రకారం మొత్తం 11,062 పోస్టుల్ల్లో 6,500కు పైగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులున్నాయి. స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులు 2,600, పండిట్ పోస్టులు 700, పీఈటీలు 190 పోస్టులున్నట్టు తెలిసింది.