ఏప్రిల్‌ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు.. మే 22న ఫలితాలు! ఈసీ ఏమన్నది?

ఎన్నికల తేదీలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఫేక్‌ అని సీఈసీ అభివర్ణించింది. తాము మీడియా సమావేశం పెట్టి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

ఏప్రిల్‌ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు.. మే 22న ఫలితాలు! ఈసీ ఏమన్నది?

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటనా రేపా మాపా? అన్నట్టున్న సమయంలో ఎన్నికల తేదీలపై అనే వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు సైతం వైరల్‌గా మారుతున్నాయి. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్టు కొందరు నకిలీవార్తలను సైతం సృష్టిస్తున్నారు. ఇలాగే ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19 నుంచి మొదలవుతాయని, ఓట్ల లెక్కింపు మార్చి 22న ఉంటుందనేది ఆ వార్తల సారాంశం. అయితే ఇవన్నీ నకలీ వార్తలేనని, నిరాధారాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఎన్నికల తేదీలు ప్రకటించలేదని తెలిపింది. వివిధ వాట్సాప్‌ గ్రూపులలోనూ, ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవి ఫేక్‌ అని తేల్చేసింది.


ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం పెట్టిమరీ ప్రకటిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ 16వ తేదీని లోక్‌సభ ఎన్నికలకు తాత్కాలిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి జారీ చేసిన సర్క్యులర్‌ ఆధారంగా ఈ నకిలీ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. కేవలం ఎన్నికల ఏర్పాట్ల కోసమే ఆ తేదీని తాత్కాలిక తేదీగా పేర్కొన్నారు తప్పించి, అది వాస్తవం కాదని ఈసీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలకు తాత్కాలిక తేదీగా ఏప్రిల్‌ 16ను నిర్ణయించినట్టు వస్తున్న వార్తలపై మీడియా నుంచి వాకబు చేస్తున్నారు. ఆ తేదీ కేవలం ఎలక్షన్‌ ప్లానర్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవడానికి ఉద్దేశించింది మాత్రమేనని ఈసీ స్పష్టం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలపై అధికారిక ప్రకటన మార్చి మొదటివారంలో ఉంటుందని తెలుస్తున్నది.