Viral Video | విద్యుత్ షాక్‌తో బాలుడు విలవిల.. ప్రాణాలతో కాపాడిన వృద్ధులు

Viral Video | విద్యుత్ షాక్‌తో విలవిలలాడిన ఓ బాలుడి ప్రాణాలను ముగ్గురు వృద్ధులు కాపాడారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ వారణాసిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వారణాసిలోని చేత్‌గంజ్‌లో మంగళవారం భారీ వర్షం కురిసింది.
వాన కాస్త నెమ్మదించడంతో.. స్థానికుడైన జితేంద్ర(10) అనే బాలుడు ఆడుకునేందుకు తన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అయితే విద్యుత్ తీగలు రోడ్డుపై నిలిచిన నీటిలో పడిపోయాయి. విద్యుత్ తీగలను బాలుడు గమనించకుండా, ఆ నీటిలో కాలు పెట్టాడు.
దీంతో విద్యుత్ షాక్‌కు గురై బాలుడు విలవిలలాడిపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ముగ్గురు వృద్ధులు జితేంద్రను గమనించారు. అందులో ఒకరు పరుగున వెళ్లి బాలుడిని కాపాడేందుకు యత్నించారు. విద్యుత్ ప్రసరిస్తున్నట్లు గ్రహించాక వెనక్కి తగ్గారు. ఓ వ్యక్తి కర్ర తెచ్చి ఇవ్వగా, దాన్ని మరో వృద్దుడు బాలుడి చేతికి అందించాడు.
చిన్నారి కట్టెను పట్టుకోగానే అతడిని ఆ నీటిలో నుంచి బయటకు లాగాడు వృద్ధుడు. దీంతో జితేంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడి ప్రాణాలను కాపాడిన వృద్ధుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీసీటీవీలో రికార్డు అయిన ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.