Lok Sabha Elections | లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు నోటిషికేషన్‌ జారీ చేసిన ఎన్నికల కమిషన్‌..

Lok Sabha Elections | లోక్‌సభ తొలి దశ ఎన్నికలకు నోటిషికేషన్‌ జారీ చేసిన ఎన్నికల కమిషన్‌..

Lok Sabha Elections | లోక్‌సభ తొలి దశల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రపతి తరఫున ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తొలి దశల ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరుగనున్నది. నామినేషన్‌ పత్రాల దాఖలుకు చివరి తేది మార్చి 27 కాగా.. బిహార్‌లో పండుగ నేపథ్యంలో 28 వరకు అవకాశం కల్పించింది. ఇక అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్‌ నికోబార్‌ దీవులు, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో మార్చి 27తో నామినేషన్లు ముగుస్తాయని పేర్కొంది.

నామపత్రాల పరిశీలన అన్ని రాష్ట్రాల్లో 28, బిహార్‌లో 30న ఉంటుందని ఈసీ నోటిఫికేసన్‌లో పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 30న కాగా.. బిహార్‌లో ఏప్రిల్‌ 2 వరకు అవకాశం ఇచ్చింది. కాగా ఈ నోటిఫికేషన్‌తో దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరుగబోతున్నది. అత్యధికంగా తమిళనాడులో 39 ఎంపీ స్థానాలకు ఒకే విడుతలో పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఇక రాజస్థాన్‌లో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో ఆరు, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదు చొప్పున స్థానాలకు, బీహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో మూడు, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండు సీట్లు, ఛత్తీస్‌గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1- జూన్‌ ఒకటి వరకు ఏడు దశల్లో పోలింగ్‌ జరుగనున్నది. తొలి దశ ఎన్నికలు ఏప్రిల్‌ 19, రెండో దశ ఏప్రిల్‌ 26న, మూడో విడుత మే 7, నాలుగో విడుత మే 13, ఐదో విడుత మే 20, ఆరో విడతలో మే 25, ఏడో విడత జూన్‌ ఒకటి ఎన్నికలు జరుగనుండగా.. జూన్‌ 4న దేశవ్యాప్తంగా ఒకేరోజు కౌంటింగ్‌ సాగనున్నది.