చిన్న టీమ్‌ల కన్నా దారుణంగా ఆడిన ఇంగ్లండ్..ముగిసిన డిఫెండింగ్ ఛాంపియన్ క‌థ‌

చిన్న టీమ్‌ల కన్నా దారుణంగా ఆడిన ఇంగ్లండ్..ముగిసిన డిఫెండింగ్ ఛాంపియన్ క‌థ‌

వర‌ల్డ్ క‌ప్ టోర్నీలో సంచ‌ల‌నాలు న‌మోదు అవుతున్నాయి. ప‌సికూన‌లు అనుకున్న టీమ్స్ అద్భుత‌మైన గేమ్ ఆడుతుండ‌గా, చాంపియ‌న్ టీమ్స్ దారుణంగా నిరాశ‌ప‌రుస్తున్నాయి. అందులో ముందుగా ఇంగ్లండ్ గురించి చెప్పుకోవాలి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్‌లో అడుగు పెట్టిన ఇంగ్లండ్.. ఏడు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయం మాత్ర‌మే సాధించి సెమీస్ రేసు నుండి త‌ప్పుకుంది. చివరిగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్ లో ఆసీస్‌పై 33 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో ఇంగ్లండ్ జ‌ట్టు అధికారికంగా వ‌రల్డ్ క‌ప్ నుండి త‌ప్పుకున్న‌ట్టు అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టుకు ట్రావిస్ హెడ్ (11), డేవిడ్ వార్నర్ (15) రూపంలో పెద్ద‌గా ప‌రుగులు రాలేదు. కాని త‌ర్వాత స్టీవ్ స్మిత్ (44), మార్నస్ లబుషేన్ (71), కామెరూన్ గ్రీన్ (47), మార్కస్ స్టొయినిస్ (35) రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇక 287 ప‌రుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఇంగ్లండ్ వెంట‌వెంట‌నే వికెట్స్ కోల్పోయింది. తొలి బంతికే జానీ బెయిర్‌స్టో (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జో రూట్ (13), జాస్ బట్లర్ (1), లియామ్ లివింగ్‌స్టోన్ (2) ఎవరూ కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడ‌లేక‌పోయారు. డేవిడ్ మలాన్ (50), బెన్ స్టోక్స్ (64) ,మొయీన్ అలీ (42), క్రిస్ వోక్స్ (32), అదిల్ రషీద్ (20) గెలుపుపై కొంత ఆశ‌లు రేపిన కూడా ఆసీస్ బౌల‌ర్స్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో ఇంగ్లండ్‌కి ఓట‌మి తప్ప‌లేదు. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ జట్టు 48.1 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక శ‌నివారం జ‌రిగిన మ‌రో మ్యాచ్‌లో పాకిస్తాన్ జ‌ట్టు డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం న్యూజిలాండ్‌పై విజ‌యం సాధించింది. దీంతో పాక్ కూడా సెమీస్ రేసులో నిలిచింది.

బార‌త్, సౌతాఫ్రికా ఇప్ప‌టికే సెమీస్ చేరుకోగా, మిగిలిన రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక పోటీ ప‌డుతున్నాయి.పాక్ క‌నుక న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయి ఉంటే పాకిస్తాన్, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్, శ్రీలంక కథ ముగిసి ఉండేది. అయితే అనూహ్యంగా పాక్‌కి విజ‌యం ద‌క్క‌డంతో పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్‌ బెర్త్ కోసం హోరాహోరీ ఫైట్ జరగనుంది..మ‌రి రానున్న మ్యాచ్‌ల‌లో ఎవ‌రు ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసి సెమీస్‌కి చేర‌తారో చూడాలి.