మండే ఎండలో మజ్జిగ బెటర్.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు ఏవేవో కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఈ శీతల పానీయాల వల్ల శరీరానికి ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మండే ఎండకు మజ్జిగ బెటర్ అని సూచిస్తున్నారు.

రోజురోజుకి ఎండలు ముదిరిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు గురవుతున్నారు. పనుల మీద ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు ఏవేవో కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఈ శీతల పానీయాల వల్ల శరీరానికి ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మండే ఎండకు మజ్జిగ బెటర్ అని సూచిస్తున్నారు. మజ్జిగ తాగడంతో దప్పిక తీరడమే కాకుండా, చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామని చెబుతున్నారు. మజ్జిగలో విటమిన్ బీ12, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కేలరీలు, కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కూడా మజ్జిగను తీసుకోవచ్చు.
మజ్జిగతో మరిన్ని లాభాలు ఇవే..
- మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, విరేచనాలు, వాంతుల వంటి సమస్యలకు మజ్జిగ చెక్ పెడుతుంది.
- శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. చెమటలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
- మజ్జిగ తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. దీనిలో ఉండే కాల్షియం ఎముకలకు మేలు చేకూరుస్తుంది.
- బాడీ టెంపరేచర్‌ను మజ్జిగ నియంత్రిస్తుంది. అంతేకాకుండా మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
- ఇక ఈ మజ్జిగను ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఉప్పు లేదా పంచదారను కలిపి తీసుకోవచ్చు. మజ్జిగలో సన్నగా తరిగిన మిర్చి, కొన్ని కీరా ముక్కలు, కొంచెం కొత్తిమీరా వేస్తే రుచి ఇంకా బాగుంటుందని చెబుతున్నారు నిపుణులు.