Salt | ఉప్పు తిన‌క‌పోతే కోమాలోకి..? ఇంకా ఎన్ని న‌ష్టాలో తెలుసా..?

Salt | ఉప్పు తిన‌క‌పోతే కోమాలోకి..? ఇంకా ఎన్ని న‌ష్టాలో తెలుసా..?

Salt | ‘అన్నేసి చూడు.. నన్నేసి చూడు..’ ఈ సామెత అంద‌రికి తెలిసే ఉంటుంది. ఈ సామెత‌ను మ‌న పూర్వీకులు ప్ర‌తి రోజు ఉప‌యోగించేవారు. ఏ సంద‌ర్భంలో అంటే.. కూర‌లో ఏ మాత్రం కొంచెం ఉప్పు త‌క్కువైనా.. ఈ సామెత‌ను ఉప‌యోగించేవారు. ఇక మ‌హిళ‌లు అప్ర‌మ‌త్త‌మై కూర‌లో ఉప్పు వేసేవారు. అలా ‘అన్నేసి చూడు.. న‌న్నేసి చూడు’ అనే సామెత ఫేమ‌స్.

ఉప్పు వేయ‌నిదే ఏ వంట‌కం కూడా పూర్తి కాదు.. రుచిగా కూడా ఉండ‌దు. అయితే కొంద‌రు ఉప్పును పూర్తిగా మానేస్తున్నారు. ఉప్పు తిన‌క‌పోవ‌డం వ‌ల్ల అనారోగ్యం బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

మ‌న శ‌రీరానికి కావాల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో ఉప్పు ప్ర‌ధాన‌మైన‌ది. ప్ర‌తి రోజు స‌రిప‌డా ఉప్పు తింటేనే కండ‌రాల్లో క‌ద‌లిక‌లు ఏర్ప‌డుతాయి. నాడుల్లో స‌మాచార ప్ర‌సారం కూడా చ‌క్క‌గా జ‌రుగుతుంది. జీవక్రియ కూడా మెరుగ‌వుతుంది. బీపీ స‌మ‌స్య‌లు కూడా ద‌రి చేర‌వు.

ఉప్పును ర‌సాయ‌న శాస్త్రంలో సోడియం క్లోరైడ్ అని పిలుస్తారు. అంటే ఉప్పులో సోడియం 39 శాతం, క్లోరిన్ 61 శాతం ఉంటుంది. ఉప్పు మ‌న శ‌రీరంలోకి చేరిన త‌ర్వాత‌.. సోడియం క్లోరైడ్ అయాన్స్‌గా విడిపోతాయి. దీంతో సోడియం క‌ణాల్లోని ద్ర‌వాల‌ను పెర‌గ‌కుండా, త‌గ్గ‌కుండా నియంత్రిస్తుంది.

దీంతో నాడులు, కండ‌రాలు చ‌క్క‌గా ప‌ని చేస్తాయి.

ఆక‌స్మికంగా ఉప్పు తిన‌డం మానేస్తే.. క‌ణాల్లో ఒత్తిడి పెరుగుతుంది. క‌ణాల్లో నీరు పేరుకుపోయి వాపు సంభ‌విస్తుంది. శ‌రీర‌మంతా ఉబ్బుతుంది. ప‌రిస్థితి విష‌మిస్తే ఆ క‌ణాలు ప‌గిలిపోయి ప్రాణాంత‌కంగా మారే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ఉప్పును ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో తీసుకోవ‌డం మంచిది.

శ‌రీరానికి స‌రైన మోతాదులో ఉప్పు అంద‌క‌పోతే.. త‌ల, క‌ళ్లు తిర‌గ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. కొన్నిసార్లు కోమాలోకి కూడా వెళ్లే అవ‌కాశం ఉంటుంది. ఆక‌స్మాత్తుగా కింద ప‌డిపోయే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ఉప్పు తిన‌డం మానొద్దు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం మన శరీరానికి రోజుకు రెండు గ్రాముల సోడియం అవసరం. రెండు గ్రాముల సోడియం మన శరీరానికి అందాలంటే మనం రోజు ఐదు గ్రాములు ఉప్పును తినాలి. అంటే ఒక టీ స్పూన్. కానీ చాలామంది రెండు, మూడు టీ స్పూన్ల ఉప్పును రోజూ తింటున్నారు. దీనివల్ల హై బీపీ వంటి సమస్యల బారిన పడుతున్నారు. అధికరక్తపోటు వల్ల గుండె జబ్బులు కూడా త్వరగా వస్తాయి. కాబట్టి ఉప్పును పూర్తిగా మానేయకుండా… అలాగని అతిగా తినకుండా జాగ్రత్త పడాలి. రోజుకు ఒక స్పూను మించకుండా తినడం మంచిది.