హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరిస్తాం
తాము అధికారంలోకి వస్తే.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.

- జిల్లాల్లోనూ పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు
- వంద కోట్లతో పాత్రికేయ సంక్షేమ నిధి
- కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీలు
హైదరాబాద్ : తాము అధికారంలోకి వస్తే.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ అంశాన్ని శుక్రవారం విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పొందుపర్చింది. అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాలవారీగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపింది. వంద కోట్లతో జర్నలిస్టు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నది. రిటైర్ అయిన పాత్రికేయులకు ప్రతి నెల పెన్షన్ ఇస్తామని, జర్నలిస్టు హెల్త్స్కీమ్ను జర్నలిస్టులతోపాటు.. వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించేలా హెల్త్ కార్డులు జారీ చేస్తామని తెలిపింది.
14 ఏళ్ల గోస
హైదరాబాద్ జర్నలిస్టులు 14 ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు. నిజాంపేట, పేట్బషీరాబాద్లలో స్థలాన్ని మార్కెట్ రేటుకు జవహర్లాల్ నెహ్రూ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కొనుగోలు చేసినా.. కోర్టు కేసుల వల్ల స్థలాల స్వాధీనం సాధ్యం కాలేదు. ఇటీవలే సుప్రీం కోర్టు సైతం తీర్పు ఇచ్చినా.. ప్రభుత్వం మాత్రం పేట్‌బషీరాబాద్ స్థలాన్ని సొసైటీకి అప్పగించేందుకు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతోపాటు.. జిల్లాలవారీగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీతో రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.