King Cobra | గాయపడ్డ నాగుపాము.. అంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించి చికిత్స

King Cobra | పాములు కంటికి కనిపిస్తే చాలు.. దూరంగా పరుగెడుతాం. కొన్ని సందర్భాల్లో వాటిని చంపేస్తాం కూడా. కానీ తీవ్రంగా గాయపడ్డ ఓ నాగుపామును చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో తరలించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లోని ఓ హార్డ్ వేర్ షాపులోకి నాగుపాము దూరింది. అందులో పని చేస్తున్న యువకుడు ఐరన్ రాడ్‌ను తీస్తున్న సమయంలో బుసలు కొడుతున్న నాగుపాము కనిపించింది. భయంతో ఇనుప రాడ్‌ను తన చేతుల్లోంచి వదిలేశాడు. ఆ ఇనుప కడ్డీ.. నాగుపాముపై పడింది. దీంతో దానికి తీవ్ర గాయాలై, ముందుకు కదల్లేకపోయింది.
ఇక దుకాణ యజమాని పామును చంపకుండా.. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ కుమార్‌కు సమాచారం అందించాడు. పీపుల్ ఫర్ ఎనిమల్ వలంటీర్లు దుకాణం వద్దకు చేరుకుని, గాయపడ్డ పామును పరిశీలించారు. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి వలంటీర్లు సమాచారం ఇచ్చారు. ఆమె సూచన మేరకు పామును ఢిల్లీలోని వైల్డ్ లైఫ్ ఎస్‌వోఎస్ సెంటర్‌కు అంబులెన్స్‌లో తరలించారు. ఇద్దరు వలంటీర్లు రూ. 5 వేలు ఖర్చు చేసి ఢిల్లీకి తరలించినట్లు తెలిసింది. అయితే పాముకు శస్త్ర చికిత్స చేశామని, కోలుకున్న వెంటనే అడవిలో వదిలేస్తామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.